రాష్ట్రీయం

ప్రధాన పార్టీల్లో అ‘టెన్షన్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్లు వార్తలొచ్చిన నేపథ్యంలో రాజకీయ పక్షాలు అలెర్టయ్యాయి. వచ్చే నెలలో ఎన్నికల సంఘం పరిశీలకుల బృందం కూడా రాష్ట్రంలో పర్యటిస్తుందంటున్నారు. దీంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో ఎన్నికల వేడి రాజుకుంది. అధికార తెలుగుదేశంతో పాటు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గుంభనంగా తొలివిడత జాబితాను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ తరహాలో ఈసారి జాప్యం జరక్కుండా కాంగ్రెస్‌తో పొత్తుపై స్పష్టత ప్రకటించి ఈ నెలాఖరులోనే అభ్యర్థుల జాబితా విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. వైసీపీ నుంచి ఇక ఎటూ వలసలు ఉండవని తేలటంతో కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లకు ఆఫర్లు ఇస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం గత సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ తిరిగి జీవం పోసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈనేపథ్యంలో తెలంగాణ ఎన్నికల్లో టీడీపీతో కలిసి మహాకూటమి ఏర్పాటు కావటంతో కొందరు సీనియర్ నాయకులు కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. అయితే ఏపీలో పొత్తు కొనసాగించాలా, లేక ఒంటరిగా పోటీ చేయాలా? అనే విషయమై తెలుగుదేశం పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. తెలంగాణలో ఘోర పరాజయాన్ని చవిచూడటంతో ఏపీలో పొత్తుపై టీడీపీ సందిగ్ధంలో పడింది. ఇప్పటికే లోపాయకారీగా మంతనాలు జరుగుతున్నట్లు చెపుతున్నారు. ఏ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నా తగిన సీట్లు కేటాయించేందుకు టీడీపీ అధినేత 25 శాసనసభ సీట్లను సర్దుబాటు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే కాంగ్రెస్‌కు బయటి నుంచి మద్దతిస్తేనే మంచిదని సీనియర్ నేతలు వారిస్తున్నట్లు సమాచారం.
సంక్రాంతి తరువాత ఈ నెల మూడోవారంలో రాష్ట్ర కేబినెట్‌తో పాటు సమన్వయ కమిటీ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవటం, వచ్చే నెల మొదటి వారంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ముగిస్తే ఇక జిల్లాల వారీగా పార్టీ సమీక్షలు నిర్వహించి నోటిఫికేషన్ వెలువడేలోగా అభ్యర్థులను ఖరారు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్ తరహాలోనే ముందుగా అభ్యర్థులను ప్రకటించి ప్రచారానికి పంపితే ఆపై నియోజకవర్గాల్లో తాను పర్యటించడం ద్వారా కొత్త ఊపునిచ్చేందుకు చంద్రబాబు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్లు వినికిడి. ఇదిలావుంటే, పార్టీలోకి వస్తున్న వలస నేతలు తమ్ముళ్లలో మరింత టెన్షన్ పెంచుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల అనంతరం కూడా నామినేటెడ్, ఎమ్మెల్సీ పదవుల్లో వలస నేతలకే బాబు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తమ సీటు పదిలంగా ఉంటుందా, లేదా అనే భయం కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పట్టుకుంది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల టీడీపీ గూటికి చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకే టికెట్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అలాగే మరికొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది.
మరోవైపు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత కూడా సంక్రాంతి అనంతరం అమరావతి కేంద్రంగా ఎన్నికల సమర యాత్ర నిర్వహించాలని భావిస్తున్నారు. ఇప్పటికే సీట్ల కేటాయింపుపై ఆయన ఓ అవగాహనకు వచ్చారని చెపుతున్నారు. మూడు నెలల క్రితం రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలకు ఇన్‌చార్జిల మార్పు ఇందులో భాగమేనని అంటున్నారు. విజయావకాశాలు ఉన్నవారినే ఇన్‌చార్జిలుగా నియమిస్తున్నారని, వారే రేపు ఎన్నికల్లో పోటీ చేస్తారని వైసీపీ నేతలు చెపుతున్నారు. ఇన్‌చార్జిల మార్పు విషయంలో ఓ సీనియర్ నేత చక్రం తిప్పుతున్నట్లు వినికిడి. దీనిపై జగన్‌కు ఫిర్యాదులు కూడా అందుతున్నాయని పార్టీ నేతలే చెపుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు వైసీపీకి జీవన్మరణ సమస్య కానున్నాయి. ఇప్పటికే పార్టీలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఐదు విడతలు ఎన్నికల్ని ఎదుర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తేనే తమకు వెసులుబాటు కలుగుతుందని వారు గంపెడాశతో ఉన్నారు. పొత్తు పెట్టుకునే పార్టీల నేతలే టీడీపీ, వైసీపీలోకి వలసలు రావటం గమనార్హం. ఓ వైపు కాంగ్రెస్ నుంచి టీడీపీకి వలసలు పెరుగుతుంటే, మరోవైపు బీజేపీ సీనియర్లు కొందరు వైసీపీ బాట పట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి గుంటూరు లేదా నరసరావుపేట పార్లమెంట్ స్థానాన్ని ఆశించటంతో పాటు తన తనయుడు హితేష్‌కు పరుచూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలిపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి ఖారరైతే వైసీపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇప్పటికే వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారని సమాచారం. నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధం కావటం, ఎన్నికలు ఏప్రిల్ చివరి వారంలో జరిగే అవకాశాలు ఉండటంతో ప్రధాన పార్టీలు అభ్యర్థుల జాబితాతో సహా ఎన్నికల ప్రణాళికపై దృష్టి కేంద్రీకరించాయి. వైసీపీ ప్రకటించిన నవరత్నాలకు దీటుగా టీడీపీ ప్రభుత్వం పింఛన్ల పెంపు, వ్యవసాయానికి 9గంటల ఉచిత విద్యుత్ లాంటి వరాలను ఇప్పటి నుంచే అమలు చేస్తోంది. దీంతో మేనిఫెస్టోలో చేర్చాల్సిన మరిన్ని అంశాలను వైసీపీ పరిశీలిస్తోంది.
ఇదిలావుంటే, కొత్తగా సార్వత్రిక ఎన్నికల బరిలో నిలుస్తున్న జనసేన రాష్ట్రంలోని అన్ని స్థానాలకు పోటీ చేస్తుందని పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో పాటు టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సూర్యనారాయణ జనసేనలో చేరారు. అయితే ఎన్నికల్లో డబ్బు, అభ్యర్థుల అనే్వషణ, మేనిపెస్టో, ప్రచారాలపై ఇప్పటికీ ఆ పార్టీలో స్పష్టత లేదు. పార్టీని నడపాలంటే రూ. 2500 కోట్లు అవసరమని పవన్‌కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనమని అంటున్నారు. పవన్ మినహా ఆ పార్టీలో నాయకత్వ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో ఇతర పార్టీల్లో ఉన్న సీనియర్లు ఎవరూ అంతగా ఆసక్తి చూపటంలేదు. పార్టీకి కేడర్ ఉన్నప్పటికీ నియోజకవర్గాల వారీ నడిపించే నాయకత్వం లేకపోవటం వెలితిగా మారింది. దీనికితోడు బూత్ కమిటీలు ఏర్పాటు కాలేదు. సంస్థాగత నిర్మాణం జరగలేదు.
దీంతో కార్యకర్తల బలం ఉన్నా ఎన్నికలను ఎదుర్కొనే సత్తా కనిపించటం లేదనే వాదనలు వినవస్తున్నాయి. సంక్రాంతి అనంతరం పార్టీని బలోపేతం చేసేందుకు పవన్‌కళ్యాణ్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. బీజేపీ, టీఆర్‌ఎస్ జగన్‌కు మద్దతిచ్చే సంకేతాలు రావటంతో జనసేన ఏవైపు మొగ్గు చూపుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికల ముహూర్తం దగ్గర పడుతున్నకొద్దీ ప్రధాన పార్టీలో టెన్షన్ మాత్రం మొదలైంది.