రాష్ట్రీయం

కడప హౌస్‌ఫెడ్‌లో రూ.25 కోట్లు హాంఫట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, డిసెంబర్ 2: కడప జిల్లా హౌసింగ్ ఫెడరేషన్ (హౌస్‌ఫెడ్)లో సుమారు పాతికకోట్ల రూపాయలకు పైగా నిధులు పక్కదారి పట్టాయి. ఇళ్లను నిర్మించకుండానే సొసైటీలకు యథేచ్చగా రుణాలు ఇవ్వడం ద్వారా పలువురు అధికారులు కోట్లాదిరూపాయలు స్వాహాచేసినట్లు తెలుస్తోంది. హౌస్‌ఫెడ్‌లో సభ్యులైన వారికి రూ.3లక్షలు నుంచి రూ.5లక్షల వరకు ఏపి హౌసింగ్ ఫెడరేషన్ రుణాలను మంజూరు చేసింది. హౌస్‌ఫెడ్ ద్వారా ఇప్పటికే ఇళ్లునిర్మించుకున్న వారికి, పాత ఇళ్లకు, స్థలసేకరణ పేరుతో లక్షలాది రూపాయలు అక్రమంగా మంజూరుచేసి ఆయా సొసైటీల పాలకవర్గ సభ్యులు, హౌస్‌ఫెడ్ అధికారులు కుమ్మక్కై భారీగా నిధులు దిగమింగారు. కడప జిల్లా నుంచి రూ.50కోట్లు పైబడి రుణాలు ఇవ్వగా, ఇందులో సగానికి పైబడి దళారులు, హౌస్‌ఫెడ్ అధికారులు సొసైటీలు స్వాహా చేసినట్లు తెలిసింది. 2001కి ముందు రుణాలు తీసుకున్నవారంతా తిరిగి చెల్లించకపోవడంతో మొండి బకాయిలు కోట్లరూపాయల్లో పేరుకుపోయాయి. వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పేరుతో లబ్దిదారుడికి వడ్డీమాఫీ చేసి అసలు కట్టించుకున్నట్లు తెలుస్తోంది. అయితే లబ్ధిదారుల చెల్లించాల్సిన వడ్డీ అసలును మించిపోగా, ఆ మొత్తాన్ని మాఫీ చేయడంలోనే అధికారులు చేతివాటం ప్రదర్శించారు. బినామీ పేర్లతో రుణాలు తీసుకున్న కొందరు కన్పించకుండా పోవడంతో రుణాలు ఇచ్చిన సమయంలో వాటాలు పంచుకున్న హౌస్ బిల్డింగ్ సొసైటీలు, కడప హౌస్ ఫెడ్ రీజనల్ కార్యాలయంలోని కొందరు అధికారులు, సిబ్బంది, హైదరాబాద్ హెడ్ ఆఫీసులో లంచాలు మేసిన అధికారులు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద తామే కొంతమొత్తం చెల్లించి 200 ఇళ్లకు జిల్లాలో వడ్డీమాఫీ చేసినట్లు తెలుస్తోంది. కడప , రాయచోటి, రాజంపేట, కమలాపురం, ప్రొద్దుటూరు, హౌస్ బిల్డింగ్ సొసైటీలు 20కి పైబడి హౌస్‌ఫెడ్‌లో రుణాలు పొంది కోట్లరూపాయలను పక్కదారి పట్టించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హౌస్‌ఫెడ్ ఎన్నికలు త్వరలో జరగనుండటంతో సంబంధిత సొసైటీల అక్రమాలు బయల్పడకుండా రెగ్యులర్‌గా రుణాలు చెల్లించి సొసైటీలో సభ్యత్వం ఉన్నవారు రికార్డులను సక్రమంగా చూసుకోవాల్సివుంది. తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద పలు రుణాలను ‘సెటిల్’ చేశారు. హైదరాబాద్‌లోని రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీస్‌కు చెందిన పలువురు ఆడిటర్లను జిల్లాకు పంపి ఇటీవల సొసైటీలపై విచారణ చేయగా, భారీఎత్తున నిధులు గోల్‌మాల్ జరిగినట్లు నిర్ధారించారు. రుణం మంజూరుకోసం సంబంధిత సొసైటీలు లబ్దిదారుడి నుంచి రూ.25వేల నుంచి రూ.40వేల వరకు అడ్వాన్స్‌గా తీసుకుని ఇళ్లు నిర్మించుకుంటే ఒక రేటు, ఇళ్లు నిర్మాణం లేకుంటే మరో రేటు చొప్పున వసూలు చేసినట్లు తెలుస్తోంది. భారీఎత్తున కలెక్షన్లు చేసి సంబంధిత సొసైటీలు, పలువురు హౌస్‌ఫెడ్ అధికారులు స్వాహా పర్వానికి తెరలేపినట్లు తెలుస్తోంది. ఇటీవల హౌస్‌ఫెడ్‌కు చెందిన సొసైటీల పాలకవర్గాలే ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటుండటంతో అసలు గుట్టుబయటపడింది. సొసైటీలు చూపుతున్న లబ్దిదారుల జాబితాలకు, రుణాలు తీసుకున్న లబ్దిదారులకు ఏమాత్రం పొంతన లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హౌస్‌ఫెడ్‌లో నిధులు స్వాహాపై పూర్తిస్థాయి విచారణ జరిపితే అసలు దొంగలు బయటపడే అవకాశముంది.

టిడిపిలో చేరిన ఆనం సోదరులు

సిఎం చంద్రబాబు సమక్షంలో చేరిక
ఎవరినైనా చేర్చుకుంటామన్న మంత్రి నారాయణ

గుంటూరు, డిసెంబర్ 2: తెలుగుదేశం పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో గల సిఎం నివాస గృహంలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు మంత్రి నారాయణతో కలిసి కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకులు ఆనం రామనారాయణరెడ్డి, ఆనం వివేకానందరెడ్డి సోదరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ విలేఖరులతో మాట్లాడుతూ 13 జిల్లాల నుంచి ఎవరు వచ్చినా పార్టీలో చేర్చుకుంటామన్నారు. ఆనం సోదరులు మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో ప్రజాసంక్షేమం కాంక్షిస్తూ పని చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబే సమర్థత గల నాయకుడని గుర్తించి, పార్టీలో చేరామన్నారు. విభజన సమయంలో కాంగ్రెసుపార్టీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందన్నారు. గత 18 నెలల్లో కాంగ్రెస్‌పార్టీ నాయకత్వంలో ఎటువంటి మార్పు రాకపోవటంతో అనుచరగణంతో మాట్లాడి టిడిపిలో చేరటం జరిగిందన్నారు. 1983లో దేశం పార్టీలోనే ఉన్నామని, మరలా తిరిగి రావటం జరిగిందన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన వైసిపి శ్రేణులు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దొంగల పార్టీగా ఆనం వివేకానందరెడ్డి అభివర్ణించారు.
దివంగతనేత వైఎస్‌ఆర్ పేరు చెప్పుకునే అర్హత జగన్‌కు లేదన్నారు. రాజకీయ విలువలు తెలియని వ్యక్తి జగన్ అని, కేవలం పదవుల కోసమే పార్టీని నడుపుతున్నారని విమర్శించారు. సిఎం చంద్రబాబును ఎస్‌సి కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తదితరులు కలిశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ఆనం సోదరులు

భయపెడుతున్న
బ్యాక్ వాటర్!

సోమశిలకు 72 టిఎంసిల నీరు
గ్రామాలు ఖాళీ చేయాలని
కడప కలెక్టర్ ఆదేశం

కడప, డిసెంబర్ 2: సోమశిల బ్యాక్‌వాటర్ అంతకంతకు పెరిగి కడప జిల్లాలోని పలు గ్రామాల్లోకి వరదనీరు ప్రవేశించింది. సాధారణంగా 68 టిఎంసిలకే గ్రామాలు నీటికి ముంపునకు గురవుతాయి. బుధవారం సాయంత్రానికి 72టిఎంసిలకు నీరు చేరడంతో పలుగ్రామాల్లో నీరు ప్రవేశించింది. దీంతో జిల్లా కలెక్టర్ రమణ హుటాహుటిన జిల్లా అధికారులతో కలిసి ముంపుగ్రామాలను సందర్శించారు. సోమశిల ముంపుప్రాంతమైన అట్లూరు మండలం చింతావాండ్లపల్లెకు చేరుకుని గ్రామస్థులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశించారు. సోమశిల బ్యాక్‌వాటర్‌తో జిల్లాకు చెందిన ఒంటిమిట్ట, అట్లూరు, గోపవరం, నందలూరు మండలాలకు చెందిన సోమశిల బ్యాక్‌వాటర్ కంభపాలెం, వెలుగుపల్లె, జంగాలపల్లి, జాఫర్‌సాహెబ్ పల్లి, వరికుంట, కుమ్మగిరి, దర్జిపల్లె, బందారుపల్లె, గొల్లపల్లె, గంగపేరూరు, దౌలంతంపల్లి, కుడమలూరు, కొత్త కుడుమలూరు, చాపలవారిపల్లి, పొత్తపి, చుక్కాయపల్లి తదితర ప్రాంతాలు పూర్తిస్థాయిలో ముంపునకు గురికానున్నట్లు జలవనరులశాఖ అధికారులు టాం టాం వేశారు. ముంపుగ్రామాలను సందర్శించిన కలెక్టర్ వారిని వెంటనే పునరావాసకేంద్రాలకు వెళ్లాలని సూచించారు.
తమకు పూర్తిస్తాయిలో పరిహారం ఇప్పించాలని కోరగా, ప్రభుత్వానికి ప్రతిపాదించి పరిహారం అందేలా చూస్తానని కలెక్టర్ నచ్చజెప్పారు. అయినా కొంతమంది మొండికేస్తుండటంతో పోలీసు బలగాలను ప్రయోగించి బలవంతంగా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. స్పెషల్ కలెక్టర్ ఎస్వీ నాగేశ్వరరావు, జెసి కృష్ణ్భారతి, రాజంపేట ఆర్డీవో ప్రభాకర్ పిళ్లై ఆయా గ్రామాల్లో మకాం వేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పోలీసుల సాయంతో సోమశిల బ్యాక్‌వాటర్ ముంపు ప్రజలను శిబిరాలకు తరలించే ప్రయత్నంలో అధికారులు నిమగ్నమయ్యారు.

నడిరోడ్డుపై
నోట్ల కట్టలు!
క్యారీబ్యాగ్‌లో పది లక్షల నగదు
పోలీసులకు అప్పగింత
బెజవాడలో కలకలం
విజయవాడ, డిసెంబర్ 2: నగరంలో జన సంచారం.. రద్దీగా ఉన్న నడి రోడ్డుపై పట్ట పగలు అక్షరాల పది లక్షల నోట్ల కట్టల డబ్బు సంచి కలకలం రేపింది. మాచవరం పోలీస్టేషన్ పరిథిలోని పిన్నమనేని పాలి క్లినిక్ రోడ్డులో ఉన్న మైనేని హోటల్ సమీపంలో క్యారీబ్యాగులో పది లక్షల నగదు సంచి ఓ వ్యక్తికి దొరికింది. నగరానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తికి ఈమార్గంలో వెళ్తుండగా.. రోడ్డుపై పడి ఉన్న నల్ల క్యారీబ్యాగు కనిపించిది. అనుమానం వచ్చి తెరచి చూడగా అందులో వెయ్యి, ఐదు వందల నోట్ల కట్టలు పది లక్షల రూపాయలు ఉన్నాయి. వెంటనే సమీపంలోని సిగ్నల్ జంక్షన్‌లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు తెలియపరిచాడు. నగదు బ్యాగును ఓ సంచిలో భద్ర పరిచిన సదరు కానిస్టేబుల్ ట్రాఫిక్ ఎస్‌ఐ దృష్టికి తీసుకెళ్ళగా నగదు దొరికిన సత్యనారాయణను వెంట పెట్టుకుని ట్రాఫిక్ అదనపు డిసిపి వద్దకు తీసుకెళ్ళారు. దీంతో అదనపు డిసిపి విజయవాడ లా అండ్ ఆర్డర్ డిసిపి కాళిదాసు రంగారావుకు నగదును అప్పగించారు. తాను దారిన పోతుండగా ఓ బైక్ నుంచి నగదు సంచి జారి పడిందని సత్యనారాయణ చెబుతున్నాడు. అయితే దొరికిన పది లక్షల కోసం బుధవారం రాత్రి వరకూ ఎవరూ ముందుకు రాలేదు. స్వాధీనం చేసుకున్న నగదు ప్రస్తుతం డిసిపి వద్ద భద్రపరిచారు. రిజిస్ట్రేషన్ నిమిత్తం వెళ్తున్న వారెవరైనా పొగొట్టుకుని ఉంటారని భావిస్తున్నారు. పూర్తి వివరాలు కోసం ఆరా తీస్తున్నామని, ఇందుకు సంబంధించి మొత్తం వివరాలు నగర పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్ గురువారం విలేఖరుల సమావేశంలో వెల్లడిస్తారని డిసిపి తెలిపారు. కాగా దొరికిన సొమ్ము మాచవరం పరిథి కాదు.. పటమట పోలీస్టేషన్ పరిధి అంటూ ఎవరికి వారు పొంతన లేని సమాచారం చెబుతూ గోప్యంగా వ్యవహరించడం పట్ల పోలీసు అధికారుల తీరు నగరంలో చర్చనీయాంశమైంది.

పట్టిసం ఎత్తిపోతల వద్ద
నాలుగో మోటారు ప్రారంభం
పోలవరం, డిసెంబర్ 2: పట్టిసం ఎత్తిపోతల పథకం నుండి బుధవారం నాలుగో మోటారు ఆన్‌చేసి గోదావరి నీటిని పోలవరం ప్రాజెక్టు కుడికాల్వలోకి విడుదలచేశారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మోటారు ఆన్ చేసి నీటిని విడుదల చేయగా, సాంకేతిక లోపంతో మోటారు వేడెక్కి ఆగిపోయింది. మరమ్మతుల అనంతరం సాయంత్రం 4 గంటలకు మోటారును తిరిగి ఆన్‌చేసి నీటిని కుడికాల్వలోకి విడుదల చేశారు. ప్రస్తుతం నాలుగు మోటార్ల ద్వారా రోజుకు 1400 క్యూసెక్కుల నీటిని కృష్ణాకు తరలిస్తున్నారు. మరో మోటారు ఆన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, గురువారం ఐదో మోటారు ఆన్ చేసే అవకాశం వుందని పోలవరం ఇఇ ఆదిశేషయ్య తెలిపారు.
2016 నాటికి మిగులు విద్యుత్
జెన్‌కో ఎండి విజయానంద్
ఎర్రగుంట్ల, డిసెంబర్ 2: 2016 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తిలో ఎపిని మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని జెన్‌కో ఎండి విజయానంద్ అన్నారు. బుధవారం కడప జిల్లా ఆర్టీపీపీలో 600 మెగావాట్ల 6వ యూనిట్ పనులను పరిశీలించేందుకు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జెన్‌కో ఆధ్వర్యంలోని విద్యుత్ ప్రాజెక్టులన్నింటిని త్వరితగతిన పూర్తిచేసి ఉత్పత్తి సాధించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆర్టీపీపీలో 600 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న 6వ యూనిట్ పనులు వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతాయని అన్నారు. భూ సేకరణ విషయంలో తలెత్తిన సమస్య వల్ల ప్రాజెక్టు పనుల్లో కొంత ఆలస్యం జరిగిందన్నారు. గత ఆరు నెలలుగా 6వ యూనిట్ పనులు వేగం పుంజుకున్నాయన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు గాను పనులను వేగవంతం చేసేందుకు 15 రోజులకొకమారు తాను ఆర్టీపీపీని సందర్శిస్తానని అన్నారు. కాంట్రాక్టర్ల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం ద్వారా పనులు త్వరితగతిన పూర్తయ్యేందుకు వీలవుతోందన్నారు.

కోస్తాను కుదిపేస్తున్న భారీ వర్షాలు
ప్రభుత్వం అప్రమత్తం

హైదరాబాద్, డిసెంబర్ 1 : బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా అతిభారీ భారీ వర్షాలు దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాలను కుదిపేస్తున్నాయి. భారీ వర్షాలు గురువారం కూడా ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. ఐఎండి హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ వైకె రెడ్డి పేరుతో బుధవారం జారీ అయిన హెచ్చరిక ప్రకారం గురువారం కూడా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయి. ఆదివారం వరకు వర్షాలు కొనసాగతాయని వివరించారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లగా ఉంది.