రాష్ట్రీయం

బీసీలే బ్యాక్‌బోన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 17: ప్రజల ఆశీస్సులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ఏటా రూ.15 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.75 వేల కోట్లు వెచ్చిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. బీసీల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి వీలుగా రాష్ట్రంలో శాశ్వతంగా బీసీ కమిషన్‌ను నెలకొల్పుతామన్నారు. బీసీలు అంటే బ్యాక్‌వర్డ్ క్లాసెస్ నుండి బ్యాక్‌బోన్ క్లాసెస్ అనే స్థాయికి తీసుకువస్తామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో ఆదివారం సాయంత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో జరిగిన బీసీ గర్జన సభలో జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ అధికారంలోకి వచ్చాక బీసీల సంక్షేమానికి చేపట్టే అంశాలతో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు. ఒక విధంగా చెప్పాలంటే బీసీలను వరాల వర్షంలో ముంచెత్తారు. అధికారంలోకి వచ్చిన ఏడాదే బీసీ సబ్-ప్లాన్‌కు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. కులాల కార్పొరేషన్ల వ్యవస్థను ప్రక్షాళనచేసి, మొత్తం 139 వెనుకబడిన కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు నెలకొల్పుతామన్నారు. బీసీ విద్యార్థులకు పూర్తి ఉచిత విద్యను అందించడమేకాక, హాస్టళ్లలో ఉండేవారికి ఏటా రూ.20 వేలు అందిస్తామన్నారు. 45 నుండి 60 ఏళ్ల వయస్సుండే బీసీ మహిళలకు చేయూత పథకం కింద నాలుగేళ్లలో రూ.75 వేలు ఉచితంగా అందిస్తామన్నారు. పిల్లలను బడికి పంపించే బీసీ తల్లులకు ఏడాదికి రూ.15వేలు అందిస్తామన్నారు. మత్స్యకారులకు వేట నిషేధం అమల్లో ఉండే సమయంలో ప్రస్తుతం ఇస్తున్న పరిహారాన్ని రూ.4 వేల నుండి రూ.10వేలకు పెంచుతామన్నారు. వేటకెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు చనిపోతే రూ.10 లక్షల పరిహారం అందిస్తామన్నారు. షాపులున్న నారుూ బ్రాహ్మణులకు ఏడాదికి రూ.10వేలు అందిస్తామన్నారు. తిరుమల ఆలయాన్ని తెరిచే హక్కు సన్నిధి గొల్లలకే కల్పిస్తామన్నారు.ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తామన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టు నియామకాలు, పనుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తామని జగన్ ప్రకటించారు. పేదలు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోయినా, ఆత్మహత్య చేసుకున్నా రూ.ఏడు లక్షలు పరిహారం అందేలా వైఎస్సార్ బీమా పథకం తీసుకువస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీల్లో చేర్చాలని వివిధ బీసీ కులాల నుండి ఉన్న డిమాండ్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపిస్తామన్నారు. 31 బీసీ కులాలను ఎంబీసీలుగా మార్పుచేస్తూ చంద్రబాబునాయుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి చట్టబద్ధత లేదని, తాము అధికారంలోకి వచ్చాక బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా చట్టబద్ధంగా వారిని ఎంబీసీల్లో చేరుస్తామని జగన్ ప్రకటించారు. తెలంగాణలో బీసీ జాబితా నుండి తొలగించిన కులాలను తిరిగి బీసీల్లో చేర్చేలా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడతానన్నారు. కులవృత్తులు, చిరు వ్యాపారాలు చేసుకునే బీసీలకు గుర్తింపు కార్డులిచ్చి, అవసరమైనపుడు వడ్డీ లేకుండా రూ.10 వేలు రుణం అందిస్తామన్నారు. సంచార జాతుల వారికి ఉచితంగా ఇళ్లు నిర్మించడమేకాక, ఉపాధి కల్పిస్తామన్నారు. మగ్గం ఉండే చేనేత కార్మికులకు నెలకు రూ.2000 పెట్టుబడి సాయం కింద అందిస్తామన్నారు. గొర్రెలు, మేకల పెంపకందార్లకు అవి చనిపోతే రూ.6వేలు వంతున అందిస్తామన్నారు. ఆలయాల ధర్మకర్తల మండళ్లలో యాదవులు, నారుూ బ్రాహ్మణులకు ప్రాధాన్యమిస్తామన్నారు.
కేంద్ర ప్రభుత్వ కేటగిరీలో రాష్ట్రంలోని 31 కులాలు బీసీలుగా లేరని, ఆ కులాలను బీసీలుగా చేర్చడానికి నాలుగేళ్లు కేంద్రంతో అంటకాగిన చంద్రబాబు ఎందుకు ప్రయత్నించలేదని జగన్ నిలదీశారు. ఎన్నికల ముందే చంద్రబాబునాయుడుకు బీసీలు గుర్తుకువస్తారన్నారు. గత ఎన్నికల సందర్భంగా బీసీల సంక్షేమానికి ప్రకటించిన అంశాల్లో కనీస మొత్తంలో కూడా అమలుచేయలేదని దుయ్యబట్టారు.
ఎమ్మెల్సీ అభ్యర్థిగా జంగాకు అవకాశం
త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తికి అవకాశం కల్పిస్తున్నట్టు జగన్ ప్రకటించారు.
బీసీల అభ్యున్నతికి జగన్ సాయం
వైఎస్ రాజశేఖరరెడ్డి తరహాలో ఆయన కుమారుడు వైఎస్ జగన్ కూడా బీసీల అభ్యున్నతికి కృషిచేస్తారని సభలో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. బీసీల సంక్షేమం విషయంలో తాను రాజీలేని ఉగ్రవాదినని, ఆ భయంతోనో ఏమో ఇటీవల టీడీపీ నిర్వహించిన బీసీ జయహో సభకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనను ఆహ్వానించలేదన్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీసీల సంక్షేమానికి తానిచ్చిన పలు అంశాలపై సానుకూల చర్యలు తీసుకున్నారన్నారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కారణంగానే ఈ రోజు పలువురు బీసీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించగలుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకే పట్టం కట్టాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు.
కార్యక్రమం ప్రారంభంలో బీసీ నేత పూలే విగ్రహానికి జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే ఇటీవల జమ్ము,కాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, ఆళ్ల నాని, పిల్లి సుభాష్‌చంద్రబోసు, తమ్మినేని వీరభద్రం, బొత్స సత్యనారాయణ, కోటగిరి శ్రీ్ధర్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైవి సుబ్బారెడ్డి, మేకా శేషుబాబు, తలశిల రఘురాం తదితరులు పాల్గొన్నారు.

చిత్రాలు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సభలో మాట్లాడుతున్న జగన్.
*సభకు భారీగా హాజరైన జనం