రాష్ట్రీయం

పేదలందరికీ కనీస ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 9: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తాము అధికారంలోకి రాగానే పేదలందిరికీ, ప్రతి రైతుకూ కనీస ఆదాయం అందిస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వాగ్దానం చేశారు. శంషాబాద్‌లో శనివారం సాయంత్రం పార్టీ రాష్ట్ర నాయకత్వం ‘కనీస ఆదాయ వాగ్దానం’ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ పేదలందరికీ కనీస ఆదాయం అందించే పథకాన్ని ప్రారంభించి, నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లకే పంపిస్తామన్నారు. దేశంలో ఎక్కడ పేదవాడు ఉన్నా అమలు చేస్తామని ఆయన చెప్పగానే సభికులు కరతాళధ్వనులు చేశారు. ఈ పథకం అమలుతో కనీస ఆదాయ పరిమితి కన్నా ఎవరికీ తక్కువ ఆదాయం ఉండదని అన్నారు. కుల, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా అందరికీ ఈ ఫలాలు అందిస్తామని అన్నారు. అనిల్ అంబానీ, నీరవ్ మోదీ జేబుల్లో ప్రధాని నరేంద్ర మోదీ డబ్బులు నింపితే.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల జేబుల్లోకి కనీస ఆదాయం సమకూరుస్తామని తెలిపారు. ప్రధాని మోదీ మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా మాటలకే పరిమితమయ్యాయని విమర్శించారు. రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ, యుద్ధ విమానాల తయారీలో అనుభవం లేని అనిల్ అంబానీకి అప్పగించి.. వేల కోట్ల రూపాయల లబ్ది చేకూర్చారని ఆరోపించారు. రూ.526కోట్లతో తయారు కావాల్సిన రాఫెల్ యుద్ధ విమాన వ్యయాన్ని రూ.1600 కోట్లకు ఎందుకు పెంచారని రాహుల్ ప్రశ్నించారు. అవినీతిపై పోరాటం చేస్తున్నట్లు ప్రధాని మోదీ చెబుతుంటారని.. కానీ ఈ విషయంలో మోదీ తప్పు చేశారని హిందూ దిన పత్రిక సైతం స్పష్టంగా పేర్కొందని ఆయన చెప్పారు.
దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ దేశాన్ని రెండు భాగాలు చేశారని, ఒక భాగాన్ని ధనికులకు కేటాయించారని ఆయన విమర్శించారు. పెట్టుబడిదారులకు లాభం చేకూర్చాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఒక భాగమైన ధనవంతులు విమానాల్లో తిరిగేవారు.. అప్పులు చేసి ఆ తర్వాత చెల్లించని వారు ఉంటారని ఆయన తెలిపారు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి పారిపోయినవారి గురించి ప్రధాని పట్టించుకోరని, విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి వారిపై చర్యలు తీసుకోలేదని
విమర్శించారు. రెండో భాగంలో పేదలు, రైతులు ఉంటారని.. పేద రైతులు రుణమాఫీ కోరినా చేయరని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా ఉండదని, ఒకే దేశం ఉంటుందని ఆయన తెలిపారు.
మహిళలకు రక్షణ లేదు
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే లోక్‌సభ, రాజ్యసభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో (చట్టసభల్లో) మహిళా రిజర్వేషన్లు కల్పిస్తామని ఆయన పునరుద్ఘాటించారు. మహిళల రక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
చైనా అధ్యక్షునితో మోదీ చాయ్
మన దేశ సరిహద్దు డోక్లాంలో చైనా దళాలు దూసుకుని వచ్చినా ప్రధాని నరేంద్ర మోదీ పట్టించుకోరని ఆయన విమర్శించారు. ఇదేనా ఆయన దేశభక్తి అని ప్రశ్నించారు. ఇంత జరిగినా ప్రధాని మోదీ చైనా అధ్యక్షునితో కలిసి ఉయ్యాల్లో ఊగుతూ చాయ్ తాగారే తప్ప.. ఆ దేశ దళాలు దూసుకుని రావడం గురించి ఎందుకు ప్రశ్నించలేదని రాహుల్ ప్రశ్నించారు.
తెల్లోళ్లను తరిమికొట్టాం
తెల్లోళ్లను తరిమికొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని రాహుల్ తెలిపారు. తాము ఎవరికీ తలవంచమని.. దేశంకోసం ప్రాణ త్యాగం చేసిన ఘనచరిత్ర అని ఆయన చెబుతూ.. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీని గుర్తుచేశారు. నోట్ల రద్దుతో ప్రజలు బేజారయ్యారని, జీఎస్‌టీతో చిరు వ్యాపారులు, పేదలు కుదేలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే జీఎస్‌టీ అమలులో సమూల మార్పులు చేస్తామని రాహుల్ గాంధీ అన్నారు.

చిత్రాలు..శంషాబాద్‌లో శనివారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సభకు హాజరైన కార్యకర్తలు