రాష్ట్రీయం

లోక్‌సభ ఎన్నికలకు భారీ బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బందోబస్తు కోసం పోలీస్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణలో తొలివిడతలో జరగనున్న ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి అనుసరించాల్సిన ప్రణాళికను పోలీస్ అధికారులు సిద్ధం చేస్తున్నారు. 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కోసం దాదాపు లక్షమంది బలగాలతో ఎన్నికలను పర్యవేక్షించారు. ఇటు తెలంగాణ అటు కేంద్ర బలగాలు భారీగా మోహరించడంతో తెలంగాణలో ఎక్కడా గొడవలకు అవకాశం లేకపోయింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కపోవడంతో ఎన్నికల సంఘం పోలీసుల పనితీరును ప్రశంసించింది. కేంద్ర బలగాల కోసం కేంద్ర హోంశాఖ, ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌కు తెలంగాణ పోలీసులు ఒక నివేదికను సమర్పించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్రం 279 పారా మిలటరీ బలగాలను తెలంగాణకు పంపింది. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున అనుకున్న బలగాలను కేంద్రం పంపుతుందా? అన్న అంశంపై పోలీస్ వర్గాలు యోచిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ పొరుగు రాష్ట్రాల నుంచి బలగాలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల నుంచి 19.500 మంది పోలీస్ బలగాలు తెలంగాణకు వచ్చాయి. ఈ సారి తొలి విడతలో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికల జరగనున్నందున అక్కడి నుంచి బలగాలు వచ్చే అవకాశాలు లేవంటున్నారు. రెండో విడతలో మహారాష్ట్ర, కర్నాటకలో (ఏప్రిల్ 18న) ఎన్నికలు నిర్వహిస్తున్నందున అక్కడి నుంచి కూడా పోలీస్ బలగాలు వచ్చే అవకాశం లేదు. దీంతో కేంద్రం పంపే బలగాలపైనే తెలంగాణ పోలీస్ అధికారులు దృష్టి పెట్టారు. మరోపక్క ఆంధ్రలో కూడా ఎన్నికలు ఏప్రిల్ 11న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల బందోబస్తు కోసం ఉన్న పోలీస్ బలగాలను ఏ మేరకు వినియోగించుకోవాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గడచిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఉత్తర తెలంగాణలో మావోయిస్టులు కరపత్రాలు, వాల్‌పోస్టర్లతో హంగామా చేశారు. వరంగల్ జిల్లాలో జరుగుతున్న సాగునీటి ప్రాజెక్టుల వద్ద ఉన్న యంత్రాలను ధ్వసం చేశారు. దీంతో పోలీసులు అదనపు బలగాలు పంపించి మావోయిస్టుల చర్యలను అడ్డుకున్నారు. భూపాలపల్లి జిల్లాల్లో మావోయిస్టు ప్రాబల్యం ఉన్న మండలాలకు కేంద్ర బలగాలను తరలించారు. దీంతో ఆయా మండలాల్లో మావోయిస్టు కదలికలను కేంద్ర బలగాలు అడ్డుకున్నాయి. దీంతో మావోయిస్టులు కొంత వెనక్కు తగ్గారు. ఈనెల 18వ తేదీ నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు రక్షణగా గన్‌మెన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణలో 11 అసెంబ్లీ నియోజక వర్గాల్లో మావోయిస్టులకు పట్టుఉంది. అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నేతలకు సైతం గన్‌మెన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి వెళ్లొద్దని స్థానిక ఎస్‌ఐలు సూచిస్తున్నారు. మావోయిస్టుల నిఘాపై ప్రత్యేక బృందాలను పంపనున్నారు.