రాష్ట్రీయం

అనంత బరిలో 186 మంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: అనంతపురం జిల్లాలో 186 మంది అభ్యర్థులు గురువారం జరుగనున్న ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. జిల్లాలో మొత్తం 32,39,517 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 16,25,192 మంది, మహిళలు 16,14,071 మంది, ఇతరులు 254 మంది ఉన్నారు. జిల్లాలో మొత్తం 3,884 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. సుమారు వెయ్యి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాలకు 23 మంది పోటీ చేస్తుండగా, 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో 163 మంది పోటీ చేస్తున్నారు. అనంతపురం ఎంపీ స్థానానికి 14 మంది, హిందూపురం స్థానానికి 9 మంది బరిలో నిలిచారు. 14 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి 163 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. జిల్లా నుంచి లోక్‌సభ, అసెంబ్లీ సెగ్మెంట్లలో 14 మంది మహిళలు తలపడుతున్నారు. జిల్లా నుంచి పోటీచేస్తున్న ప్రముఖుల్లో నందమూరి బాలకృష్ణ, పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, మంత్రి కాలవ శ్రీనివాసులు, చీఫ్ విప్ పల్లె రఘునాథ్‌రెడ్డి, మండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్ ఉన్నారు.
నిబంధనలకు లోబడే ఎన్నికల ప్రక్రియ.. ఏ పార్టీకీ కొమ్మ కాయం
అమరావతి: నియమ, నిబంధనలకు అనుగుణంగానే రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తున్నామని, ఈ విషయంలో ఎలాంటి ఒత్తిళ్ల కు తలొగ్గేది లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన ఆరోపణలపై పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాము ఏ పార్టీకి కొమ్ము కాయట్లేదని వివరణ ఇచ్చారు. నియమావళికి అనుగుణంగానే కేంద్ర ఎన్నికల సంఘం సూచనలిస్తోందని, ఏ రాజకీయ పార్టీకి సహకరించాలని ఆదేశాలు జారీ చేయలేదన్నారు. ఎన్నికల సంఘం అధికారులపై ఎవరి ఒత్తిళ్లు లేవని పునరుద్ఘాటించారు. ఎన్నికల నిర్వహణలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి తగిన చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలతో నిమిత్తం లేదన్నారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అంతా సహకరించాలని కోరారు.
నిజాయితీపరులను ఎన్నుకోవాలి
విజయవాడ: ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో నిజాయితీపరులైన నాయకులను పార్టీలకు అతీతంగా ప్రజలు ఎన్నుకోవాలని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు, ఆంధ్రా మేధావుల ఫోరం చైర్మన్ చలసాని శ్రీనివాస్ కోరారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రంలో విచ్ఛలవిడిగా డబ్బుల పంపకం జరుగుతోందన్నారు. అధికారులను ఇష్టానుసారంగా బదిలీలు చేస్తున్న తీరుపై అనుమానాలు వస్తున్నాయన్నారు. ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న పటిష్టమైన చర్యలకు తాము అభినందిస్తున్నామన్నారు. అయితే ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న నిర్ణయాలను పరిశీలించడానికి సుప్రీంకోర్టు అధికారులతో మానిటరింగ్ సెల్ ఉండాలని సూచించారు.
నోటాకి ఓటు వేస్తే ఉపయోగం లేదని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ తమ ఓటును తప్పనిసరిగా ఉపయోగించుకోవాలన్నారు. భావోద్వేగాలకు గురి కాకుండా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అలాగే మన రాష్ట్రంలో ఎన్నికల అనంతరం తెలుగు ప్రజలు అధికంగా ఉన్న తమిళనాడు, కర్నాటక, ఒడిశా రాష్ట్రాల్లో ప్రచారం చేస్తామన్నారు.

చిత్రం.. అనంతపురంలో ఎన్నికల సామాగ్రి, ఈవీఎంలను తీసుకువెళ్తున్న పోలింగ్ సిబ్బంది