రాష్ట్రీయం

చంద్రబాబుకు రిటైర్డ్ ఐఏఎస్‌ల షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 13: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు షాక్ ఇచ్చారు. ఈనెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ క్యాడర్‌కు చెందిన పలువురు రిటైర్డ్ ఐఏఎస్‌లు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎల్వీపై చేసిన వ్యాఖ్యలు ఉప సంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శులు, ఉన్నతాధికారులు బహిరంగ లేఖ రాశారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం కోవర్ట్‌గా వ్యవహరిస్తున్నారని, ఆయనపై గతంలో హైకోర్టులో కేసులు ఉన్నాయని, ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగానే పునేఠాను విధుల నుంచి తప్పించి ఎల్వీని నియమించిందని చంద్రబాబు ఆరోపించారు. అయితే ఎల్వీపై గతంలో హైకోర్టులో ఉన్న పిటిషన్లు క్వాష్ చేశారని, ఎన్నికల సంఘం ఆదేశానుసారం పనిచేస్తున్న ఆయన్ను నిందించటం తగదని రిటైర్ట్ ఐఏఎస్ అధికారులు పేర్కొన్నారు. ఎల్వీపై చంద్రబాబు వాడిన పదజాలం సరికాదని లేఖలో ఖండించారు. గతంలో కోర్టు ఎల్వీని దోషిగా తేల్చలేదని గుర్తుచేశారు. ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది పట్ల కూడా చంద్రబాబు దురుసుగా వ్యవహరించటం సమంజసం కాదన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారులపై పాలనా సాంప్రదాయాలకు విరుద్ధంగా అనుచిత వ్యాఖ్యలు చేయటం తగదని రిటైర్డ్ ఐఏఎస్‌లు శ్రీపాద భలేరావ్, కేవీ రావ్, టీఎస్ అప్పారావ్, ఏకె ఫరీదా, ఎస్‌కె సిన్హా, సుతీర్థ భట్టాచార్య, విద్యాసాగర్, ఎంజీ గోపాల్, సీవీఎస్‌కె శర్మ, వినోద్ కె అగర్వాల్, జతీష్ చంద్ర మొహంతి, డాక్టర్ విజయ్‌కుమార్, ఐవైఆర్ కృష్ణారావు తదితరులు ఖండించారు. చంద్రబాబు వ్యాఖ్యలతో సీనియర్ అధికారిగా ఎల్వీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మానసిక ఆందోళన చెందుతున్నారని తెలిపారు. దురదృష్టకరమైన తన వ్యాఖ్యలను చంద్రబాబు ఉపసంహరించుకుని భవిష్యత్‌లో ఇలాంటి వాటికి తావివ్వరాదని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ భారత ఎన్నికల సంఘం అధికారులకు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు డీజీ బదిలీ వ్యవహారంలో అప్పటి సీఎస్ అనిల్‌చంద్ర పునేఠా నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారని, అందువల్లే ఆయన్ను విధుల నుంచి పక్కనపెట్టి సీనియర్ అధికారి ఎల్వీని నియమించారన్నారు. ఎన్నికల విధుల నిర్వహణలో పునేఠా వైఫల్యం చెందారని, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ చంద్రబాబు ఆదేశాల మేరకే పనిచేశారని ఆరోపించారు. ఇంటెలిజెన్స్ డీజీ బదిలీలో రకరకాల జీవోలు జారీ చేశారన్నారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలైందన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారుల పట్ల దురుసు ప్రవర్తన ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు.
ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 324ను ధిక్కరించటమే అవుతుందన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు ఎన్నికల సంఘంపైనా చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారని ఐఏఎస్‌లు రాజకీయ పార్టీల కతీతంగా తమ విధులు నిర్వహించాల్సి ఉందన్నారు. సాధారణ సమయాల్లో ముఖ్యమంత్రి ఆదేశాలను ఉన్నతాధికారులు పాటిస్తారని, ఎన్నికల సమయంలో దేశం మొత్తంగా ఒకే విధానం అమలులో ఉంటుందన్నారు. ఎల్వీపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాల్సిందిగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా, ఈసీలు అశోక్ లావాసా, సుశీల్ చంద్రకు ఈఏఎస్ శర్మ లేఖ రాశారు. ఇదిలా ఉండగా చంద్రబాబు వ్యాఖ్యలపై వివరణ ఇవ్వకపోతే గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని కూడా రిటైర్డ్ ఐఏఎస్‌లు నిర్ణయించుకున్నారు.