రాష్ట్రీయం

స్థానిక ఎన్నికల్లో ఐక్య కూటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఏప్రిల్ 17: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీని ఢీకొనేందుకు అన్ని పార్టీలు ఐక్య కూటమిగా ఏర్పాటు కానున్నాయి. కాంగ్రెస్, తెలుగుదేశం, వామపక్ష పార్టీలన్నీ ఐక్యంగా కలిసి పోటీ చేయటం ద్వారా మంచి ఫలితాలు రాబట్టాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉన్నా ఖమ్మం జిల్లాలో మాత్రం ఐక్యంగా కలిసి పనిచేస్తే టీఆర్‌ఎస్ పార్టీకి అడ్డుకట్టవేయవచ్చునని భావిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ కంటే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు మంచి ఫలితాలు సాధించినప్పటికీ గెలిచిన నేతలు టీఆర్‌ఎస్‌లో చేరటం ఆ పార్టీ నేతలను ఇబ్బందులకు గురిచేసింది. అందుకే పూర్తిగా పార్టీ కోసం పనిచేసే వారిని గుర్తించి ఈ ఎన్నికల్లో పోటీలో పెట్టాలని నిర్ణయించారు. అధికార పార్టీ అభ్యర్థులకు ఆర్థిక, అంగబలం అధికంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఐక్యంగా ఓకే అభ్యర్థిని పోటీలో పెట్టడం ద్వారా సులభంగా విజయం సాధించవచ్చునని భావిస్తున్నాయి. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకుడు జీవన్‌కుమార్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్‌ను కలిసి దీనిపై చర్చించారు. అలాగే సీపీఎం, సీపీఐ నేతలతో కూడా చర్చించనున్నారు. ఖమ్మం జిల్లాలో 20, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 21 జడ్పీటీసీలు ఉండగా ఎవరికి బలం ఉన్న చోట వారే పోటీ చేసేలా చర్చల ద్వారా నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలా ఉండగా ఇదే విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయటం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ప్రధాన నేతలు రాష్ట్ర నాయకత్వానికి కూడా విన్నవించారు. రాష్ట్ర స్థాయిలో వామపక్షాలతో కూడా చర్చలు జరిపి ఒప్పించగలిగితే ఎక్కువ జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాలను దక్కించుకోవచ్చునని అంచనాలు వేస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న అధికార పార్టీ టీఆర్‌ఎస్ నేతలు ఆయా స్థానాలలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని నిర్ణయించారు. అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను స్థానిక శాసన సభ్యులకే ఇవ్వటంతో మొదటి నుండి పార్టీలో పనిచేస్తున్నవారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ నుండి బయటకు వచ్చి ఇతర పార్టీల మద్దతుతో పోటీ చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఆయా స్థానాలలో బలమైన అభ్యర్థి టీఆర్‌ఎస్‌ను వీడి పోటీలో ఉంటే ఆయనకు మద్దతు ఇచ్చే అంశంపై కూడా ప్రతిపక్ష పార్టీలు ఆలోచిస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీలకు నోటిఫికేషన్ రానుండడంతో త్వరితగతిన ఐక్య కూటమిపై నిర్ణయం తీసుకోవాలని ఆయా పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.