రాష్ట్రీయం

నిరసనల హోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతల నిరసనలతో నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు శనివారం హోరెత్తిపోయింది. ప్రభుత్వం జోక్యం చేసుకుని విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని, బోర్డు పరీక్షల నిర్వహణలో వైఫల్యంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆందోళనకు దిగినవారు డిమాండ్ చేశారు. తక్షణమే కార్యదర్శి అశోక్‌ను బోర్డు బాధ్యతల నుండి తప్పించాలని, సమర్థుడైన అధికారిని నియమించాలని వారు కోరారు. రాష్టవ్య్రాప్తంగా ఇంటర్మీడియట్ ఫలితాలపై నిరసనలు వ్యక్తమవుతున్నా విద్యామంత్రి జగదీష్‌రెడ్డి వౌనం వహించడం భావ్యం కాదని విద్యార్థి సంఘాల నేతలు పేర్కొన్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు బోర్డు వద్దకు వచ్చి గగ్గోలుపెట్టారు. ఫస్టియర్‌లో 90 మార్కులు వచ్చిన సబ్జెక్టులో సెకండియర్‌లో ఫెయిల్ అని చెప్పడం సరికాదని, పరీక్ష పత్రాల మూల్యాంకనంలో ఏదో లోపం జరిగిందని, అర్హులైన వారితో పేపర్లను దిద్దించకపోవడం వల్లనే ఇలా జరిగిందని వారు ఆరోపించారు. తల్లిదండ్రులు అంతా గగ్గోలు పెడుతున్న సమయంలోనే బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ ఆఫీసుకు రావడంతో ఆయనను తల్లిదండ్రులు ముట్టడించి, ఘెరావ్ చేశారు. ఇష్టానుసారం పేపర్లు దిద్దడం వల్లనే ఇలా జరిగిందని వారు పేర్కొన్నారు. విద్యార్ధులు పెద్ద పెట్టున బోర్డు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఇంటర్ బోర్డు దద్దరిల్లిపోయింది. అయితే తల్లిదండ్రులు, విద్యార్థులు చేసిన ఆరోపణలను కార్యదర్శి అశోక్ కొట్టిపారేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు జరగలేదని, ఇదో మాస్ హిస్టీరియాగా తయారుచేశారని ఆరోపించారు. అనుమానాలుంటే అభ్యర్ధులు రీ కౌంటింగ్ లేదా రీ వెరిఫికేషన్‌కు అవకాశం కల్పించామని, ఇంతకుమించిన పారదర్శకత ఏముంటుందని కార్యదర్శి వారిని ప్రశ్నించారు. బోర్డులో పరీక్షలు రాసిన వారంతా పాస్ కాలేరు కదా...కొంత మంది పరీక్ష ఫెయిల్ కావడం ప్రతి ఏటా జరిగేదేనని ఆయన అన్నారు. ఉదయం నుండి మండుటెండలో తాము బోర్డు వద్ద ఉన్నా పట్టించుకున్న నాధుడే లేడని, విద్యార్థులను పట్టించుకునే వారే లేరని తల్లిదండ్రులు వాపోయారు. ఒక పక్క రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకుంటూ మరో పక్క అడ్వాన్స్ సప్లిమెంటరీకి ప్రిపేర్ కావడం అనేది విద్యార్థులపై పెను భారం అవుతుందని, అన్నింటికీ ఫీజులు చెల్లించాలంటే ఆర్ధిక భారమని, తప్పులేకపోయినా విద్యార్థులపై దీనిని వేయడం ఎంత వరకూ సబబని వారు ప్రశ్నించారు. ఇంత టెన్షన్‌లో రానున్న ప్రవేశపరీక్షలకు సిద్ధం కమ్మంటే ఎలా అవుతారని తల్లిదండ్రులు ప్రశ్నించారు. ఒక విద్యార్థి ఆవేశంగా మాట్లాడుతూ జువాలజీ పరీక్ష 60 మార్కులకు జరుగుతుందని, కానీ 68 మార్కులు వేశారని, ఇదెలా సాధ్యమని నిలదీసింది. ఒక దశలో విద్యార్థులు, తల్లిదండ్రులకు బోర్డు అధికారులు, కార్యదర్శికి మధ్య వాగ్వాదం జరిగింది. వివాదం ముదరడంతో బోర్డు వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏమైనా పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దుతామని, ఆ వివరాలు అన్నీ బోర్డు వెబ్‌సైట్‌లో ఉంచుతామని బోర్డు కార్యదర్శి పేర్కొన్నారు.
తెరచుకున్నా, పనిచేయట్లేదు
రీ వెరిఫికేషన్‌కు బోర్డు ఏర్పాటు చేసిన వెబ్‌సైట్ ఎట్టకేలకు శనివారం మధ్యాహ్నం తెరచుకున్నా, డాటా అంతా అప్‌డేట్ చేసిన తర్వాత పేమెంట్ ఆప్షన్‌లో జామ్ అవుతోందని , వెబ్ పోర్టల్ పనిచేయడం లేదని తల్లిదండ్రులు ఆరోపించారు. దానికి బోర్డు కార్యదర్శి బదులిస్తూ నేటి నుండి వెబ్ పోర్టల్ పనిచేస్తోందని, దాంట్లో రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
ప్రభుత్వ సంస్థ ద్వారానే చేశాం: సెక్రటరీ
ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా డేటా క్యాప్చురింగ్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ద్వారానే డేటా క్యాప్చురింగ్ చేశామని కార్యదర్శి అశోక్ చెప్పారు. ఇంత వరకూ 146 మంది ఫెయిల్ అయిన విద్యార్ధులు తమ దరఖాస్తులు ఇస్తే వాటిని పరిశీలించామని, వారంతా ఫెయిల్ అయ్యారని ఆయన పేర్కొన్నారు. మెమోల్లో ఎక్కడా తప్పులు దొర్లలేదని ఆయన చెప్పారు.
ఎస్‌ఎఫ్‌ఐ, ఏబీవీపీ ధర్నాలు
బోర్డు ముందు ఎస్‌ఎఫ్‌ఐ, ఏబీవీపీ నేతలు ధర్నా చేశారు. బోర్డు కార్యదర్శిని తక్షణం తప్పించాలని ఏబీవీపీ గ్రేటర్ కార్యదర్శి పగిడిపల్లి శ్రీహరి డిమాండ్ చేశారు. ధర్నాలో సుమన్ శంకర్, రమేష్, శ్రీశైలం , తిరుమలేష్, ఎల్లయ్య, కృష్ణకిశోర్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఎస్‌ఎఫ్‌ఐ నుండి మూర్తి, కోట రమేష్, తాటికొండ రవి తదితరులు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిత్రం... నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు వద్ద విద్యార్థులతో నిరసన చేస్తున్న తల్లిదండ్రులు