రాష్ట్రీయం

బతికుండగానే చంపేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుంగతుర్తి: ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు కొందరు అవినీతికి పాల్పడుతున్నారని సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు బలం చేకూరే ఉదంతమిది. బతికే ఉన్న ఓ వృద్ధుడి పేరును చనిపోయినట్టు రికార్డుల్లోకి చేర్చిన వైనం. తన భర్త జీవించే ఉన్నాడంటూ వాపోతున్న భార్య. న్యాయం కోసం అవిశ్రాంత పోరాటం. చివరికి తన భర్త చనిపోయాడంటూ ధ్రువీకరణ పత్రమైనా ఇవ్వాలని కోరుకునే స్థితికి ఆ వృద్ధురాలిని చేర్చిన ఘనత. ‘కొంతమంది బ్రోకర్లతో కలిసిన రెవెన్యూ అధికారులు కాసులకు కక్కుర్తిపడి నాభర్తని చంపేశారు.. అయినా నాభర్త బ్రతికే ఉన్నాడంటూ ఆయన పేరుమీద భూమి పట్టా చేయమంటూ ఏళ్ల తరబడి కార్యాలయం చుట్టూ తిరుగుతునే ఉన్నా.. కానీ, వారి నుండి న్యాయం జరగడం లేదు.. ఇక తిరిగే ఓపిక నాకు లేదు.. అందుకే నాభర్త చనిపోయినట్టు మరణ ధ్రువీకరణపత్రం ఇవ్వమంటున్నా. అది ఉంటే, నేను విధవరాలిగా మారి ఇంట్లోనే కూర్చుంటా’ అంటూ తన భర్తతో కలిసి వచ్చిన ఓ వృద్ధ మహిళ విసిగి వేసారిపోయి, ఆవేదన వ్యక్తం చేసిన వైనం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది.
తుంగతుర్తి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతాంగం తమకు భూముల పట్టాలు చేయడంలో రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్య వైఖరిని దుయ్యబడుతూ స్థానికులు శనివారం పెద్దఎత్తున ధర్నా, రాస్తారోకోలు చేశారు. తాము కూడా భాధితురాలమేనంటూ మహబూబాబాద్ జిల్లా, దంతాలపల్లి మండల కేంద్రానికి చెందిన వృద్ధ దంపతులు రుద్రంగి యాదగిరి, సోమక్క కన్నీరుమున్నీరయ్యారు. వివరాల్లోకి వెళితే, తిరుమలగిరి మండలం జలాల్‌పురం గ్రామానికి చెందిన రుద్రంగి సీతారామయ్యకు నలుగురు కొడుకులు. 1982లో సీతారామయ్యతోపాటు ఆయన భార్య కూడా చనిపోయారు. తనకు రావాల్సిన తండ్రి వాటా 4.31 ఎకరాల భూమిపై బంధువులతో యాదగిరి, సోమక్కకు గొడవలు మొదలయ్యాయి. జీవనోపాధి నిమిత్తం ఇరువురు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రానికి వలసగా వెళ్లారు. చాలాకాలం అక్కడే ఉన్నారు. కొనే్నండ్ల క్రితం వారు తమ భూమికి పట్టా చేయాలంటూ తిరుమలగిరి మండల రెవెన్యూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. అయితే, అప్పటికే రుద్రంగి యాదగిరి చనిపోయినట్టు, ఆయన భూమినంతా ఇతరులు పట్టాచేసినట్టు రికార్డుల్లో నమోదైంది. విషయాన్ని వృద్ధ దంపతులు సాక్షాత్తు అప్పటి మంత్రి కడియం శ్రీహరి దృష్టికి వెళ్లగా, వారికి వెంటనే న్యాయం చేయమంటూ ఆయన సంబంధిత అధికారులకు సూచించారు. ఇది రెండేండ్ల నాటి సంగతి. కానీ, నేటికీ వారి సమస్య పరిష్కారం కాలేదు. అధికారుల చుట్టూ తిరిగి వేసారి పోయారు. కాగా, తన భర్త చనిపోయినట్టుగా మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలంటూ రెవెన్యూ అధికారులను సోమక్క కోరుతోంది.
స్వయంగా ముఖ్యమంత్రే ఆదేశించినా...
తుంగతుర్తి మండలం తూర్పుగూడెం గ్రామానికి చెందిన గుండ్ల రాజయ్యది మరో సమస్య. భూమి పట్టా కోసం తాను పడుతున్న ఇబ్బందులను ఆయన ఈ ఏడాది మార్చి 7న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. దీనిపై వెంటనే స్పందించి, న్యాయం చేయలాంటూ సీఎం నుంచి ఆదేశాలు కూడా వెలువడ్డాయి. కానీ, సమస్య పరిష్కారం కాలేదు. అంతకు ముందు, 2018 జూలైలో జిల్లా జాయిట్ కలెక్టర్ సంజీవరెడ్డిని కలిసి రెవెన్యూ సిబ్బంది పెడుతున్న ఇబ్బందులపై రాజయ్య ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన జేసీ న్యాయం చేయాలంటూ వీఆర్‌ఓను ఆదేశించారు. అక్టోబర్, నవంబర్ మాసాలు దాటినా సమస్య పరిష్కారం కాకపోవడంతో, తన భూమిపట్టా సమస్యపై ఆయన జేసీని కలిశారు. చివరికి ఎకరానికి నాలుగువేల చొప్పున వీఆర్‌ఓ లెక్కగట్టి తనకు ఉన్న ఏడున్నర ఎకరాలకు 30వేలు ఇవ్వాలని చెప్పుకొచ్చారు. అయితే డిమాండ్ చేసిన డబ్బు ఇవ్వలేకపోవడంతో ఆయన భూముల పట్టా అడుగు కూడా ముందుకు కదలేదు. రాజయ్య తిరిగితిరిగి నాలుగు జతల చెప్పులు అరిగించుకొని, కాళ్ళ నొప్పులతో కుంటివాడు కూడా అయ్యాడు. సమస్య మాత్రం ఒక కొలిక్కి రాలేదు. హృదయాలను కలిచివేసే ఇలాంటి గాధలు ఎన్నో ఉన్నాయి. రెవెన్యూ అధికారులు, సిబ్బంది అవినీతి అక్రమాల కారణంగా, తుంగతుర్తి మండలంలో వందల సంఖ్యలో రైతులు రోడ్డుమీద పడుతున్నారు. వేలాది రూపాయలను ముడుపులుగా ఇచ్చినప్పటికీ భూముల పట్టాలు కావడం లేదని ఎంతో మంది రైతులు ఆరోపిస్తున్నారు. నిత్యం స్ధానిక తహసీల్దార్ కార్యాయానికి తమతమ సమస్యల పరిష్కారం కోసం వస్తున్న రైతులు వందల్లో ఉంటారు. ఇలా ఎనే్నళ్లు తిరిగినా ఫలితం లేకపోవడంతో, గత్యంతరం లేని పరిస్థితుల్లో వారంతా ఆందోళన బాటపడుతున్నారు.
ఇదిలా ఉంటే రెవెన్యూ సిబ్బందికి తమభూముల పట్టాకోసం వేలకు వేలు లంచాలు ఇచ్చి, అప్పటికీ పనులు కాక ఏండ్ల తరబడి అవస్థలు పడుతున్న భాదిత రైతులతో అసెంబ్లీ ముందు భారీ ధర్నాకు దిగుతామని తెలంగాణ సామాజిక న్యాయ వేదిక అధ్యక్షుడు అనె్నపర్తి జ్ఞానసుందర్ ప్రకటించారు.

చిత్రం... రికార్డుల్లో అధికారులు చంపేసిన రుద్రంగి యాదగిరి. న్యాయం చేయాలంటున్న ఆయన భార్య సోమక్క