రాష్ట్రీయం

పెట్టెల్లాంటి ఇళ్లలో బతికేదెట్లా...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నిర్మిస్తున్న పునరావాస కాలనీలను గేటెడ్ కమ్యూనిటీలుగా ప్రభుత్వం అభివర్ణిస్తున్నప్పటికీ, చాలీచాలని వసతితో వారంతా ఇబ్బందులకు గురవుతున్నారు. పునరావాస కాలనీల్లో అగ్గిపెట్టెల్లాంటి ఇరుకిళ్లు, నాణ్యతాలోపాలతో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని ఆదివాసీలు వాపోతున్నారు. గేటెడ్ కమ్యూనిటీ ఇళ్లంటే ఇవేనా అని సందర్శకులు ముక్కున వేలేసుకునేలా ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంగా కారణంగా నిర్వాసితులైన వారి త్యాగం ఎనలేనిదని అందరికీ తెలిసిందే. ఎన్నో తరాలుగా జీవిస్తున్న ప్రదేశాలను వదిలి, తమ జీవితాలు, జీవనాన్ని పణంగా పెట్టి పరాయి పంచకు చేరారు. ఇలాంటి పరిస్థితుల్లో పునరావాసం అనేది మానవీయంగా వుండాలని న్యాయస్థానాలు సైతం సూచిస్తున్నాయి. అయితే కొందరు అధికారులు మాత్రం పునరావాస చట్టానికి విరుద్ధంగా ఆదివాసీల ఉనికికే ప్రమాదం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో గూడు కోల్పోయిన ఆదివాసీలు గోడు చాలా దయనీయంగావుంది. సహజ సిద్ధ ప్రకృతి మధ్య ఆడుతూ పాడుతూ జీవించే గిరిజనులను బయటకు తీసుకొచ్చి ఒడ్డున పడిన చేపల్లా చేస్తున్నారు. తమకు సరిపడే విధంగా ఇళ్ళు కట్టించి ఇవ్వాలని ఆదివాసీలు కోరుతున్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న పునరావాస కాలనీలను వారంతా వ్యతిరేకిస్తున్నారు. చాలీ చాలని ఇళ్ళ నిర్మాణంపై విముఖత వ్యక్తంచేస్తూ ఆందోళనబాట పట్టారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉభయ గోదావరి జిల్లాల్లో పలు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలో చింతూరు, విఆర్ పురం, కూనవరం, ఎటపాక, దేవీపట్నం మండలాల్లో 234 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల పునరావాస కాలనీలు నిర్మించారు. ప్రస్తుతం దేవీపట్నం మండలం ఇందుకూరిపేట వద్ద 110 ఎకరాల భూమిని సేకరించి 1,067 గృహ సముదాయాలను నిర్మించడానికి ప్రణాళిక చేపట్టారు. ఇక్కడ నిర్మిస్తున్నన్న కాలనీ ఇళ్ళను నిర్వాసిత ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం ఆదినుంచి తమ పట్ల నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోందని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ గిరిజనులకు, గిరిజనేతరులకు కూడా గృహ సముదాయాలను నిర్మిస్తున్నారు. 2013లో నిర్వాసితులకు రూ.3.25 లక్షలతో ఇళ్లు నిర్మించగా, ప్రస్తుతం రూ.2.80 లక్షలతో రెండు గదుల ఇళ్లు నిర్మిస్తున్నారు. ఈ మొత్తంతో నిర్మించే ఇరుకు వసతి మధ్య ఎలా జీవించాలని ఆదివాసీలు, గిరిజనేతరులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ఒక్కో ఇంటికీ రూ.4.25 లక్షల చొప్పున వెచ్చించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గిరిజన నిర్వాసితుల గృహ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ విభాగం 2016 సెప్టెంబర్ 14న జీవో నెంబర్ 641 జారీచేసింది. దీని ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతంలో గిరిజన నిర్వాసితుల గృహ నిర్మాణానికి రూ.4.55 లక్షలు ఖర్చు చేయాల్సి వుంది. దీనికి విరుద్ధంగా ఇళ్ళ నిర్మాణం జరుగుతోంది.
నిర్వాసితులకు ముందుగా ఇళ్ళ స్ధలాలు కేటాయించి, ఆయా స్ధలాల్లో వారి ఇష్టానుసారంగా ఇళ్ళు నిర్మించుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సివుంది. కానీ ఇక్కడి ఇళ్ళ నిర్మాణం కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే విధంగానే సాగుతోందని నిర్వాసితులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కనీసం ఇంట్లో నివసించే అవకాశం ఉండేలా ఇళ్ళు నిర్మించాలని కోరుతున్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న పునరావాస కాలనీల పట్ల నిర్వాసితులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

చిత్రాలు.. తూ.గో. జిల్లా గోకవరం సమీపంలోని పునరావాస కాలనీలో నిర్మిస్తున్న అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లు
*పునరావాస కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇళ్లు