రాష్ట్రీయం

ఇకపై పకడ్బందీగా నిర్వహణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపిన ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడిలో జరిగిన తప్పిదాలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎట్టకేలకు స్పందించారు. ఈ వివాదానికి తెర దించడానికి కొన్ని కీలకమైన నిర్ణయాలను ఆయన బుధవారం ప్రకటించారు. ఫెయిలైన విద్యార్థులకు రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్‌ను ఉచితంగా చేయనున్నట్టు ప్రకటించారు. అలాగే పాసైన విద్యార్థులకు కూడా ఈ అవకాశాన్ని ఫీజు తీసుకొని చేయనున్నట్టు సీఎం వెల్లడించారు. రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ ప్రక్రియలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి విద్యాసంవత్సరం కోల్పోకుండా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. భవిష్యత్‌లో పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు, తలనొప్పులు లేకుండా మెరుగైన విధానం ఏ రాష్ట్రం, దేశంలో ఉందో అధ్యయనం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఇంటర్ ఫలితాల అనంతరం తలెత్తిన పరిణామాలపై విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, ఇంటర్మీడియట్ కార్యదర్శి అశోక్ తదితరులతో సీఎం కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థులు కొందరు ఆత్మహత్యలకు పాల్పడటం పట్ల సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పరీక్షలో ఫెయిలైనంత మాత్రాన జీవితంలో ఫెయిలైనట్టు కాదన్నారు. ‘ప్రాణం ఎంతో ముఖ్యమైంది. జీవితంలో మరెన్నో అవకాశాలు ఉంటాయి. అభిరుచి, సామర్ధ్యాన్ని బట్టి అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాణించాలి. విద్యార్థులు ధైర్యంగా ఉండాలి. పిల్లలు ప్రాణాలు తీసుకుంటే తల్లిదండ్రులకు తీవ్ర దు:ఖం మిగులుతుంది. వారికది ఎన్నటికీ తీరని లోటు. విద్యార్థులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని వేడుకుంటున్నా’ అని సీఎం హితవు పలికారు. అధికారులతో జరిగిన సమీక్షలో కేసీఆర్ మాట్లాడుతూ, ఈ ఏడాది 9.74 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయగా 3.28 లక్షల మంది ఫెయిలయ్యారన్నారు. మార్కులను కలిపే క్రమంలో కొన్ని తప్పులు దొర్లడం వల్ల రావాల్సిన మార్కులకంటే తక్కువ వచ్చాయని కొందరు, ఫెయిలయ్యామని మరికొందరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో వారి అనుమానాలను నివృత్తి చేయడానికి ఫెయిలైన విద్యార్థులకు ఉచితంగా రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ చేయించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. పాసైన విద్యార్థులు కూడా ఈ రెండింటికీ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్‌ల ప్రక్రియిను త్వరగా పూర్తిచేసి విద్యాసంవత్సరం కోల్పోకుండా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఈ బాధ్యతలను విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డికి అప్పగించినట్టు కేసీఆర్ వెల్లడించారు. ఇంటర్మీడియట్‌తో పాటు ఎమ్సెట్ తదితర ప్రవేశ పరీక్షల విషయంలో కూడా ప్రతీసారి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో ప్రభుత్వం, విద్యార్థులు, తల్లిదండ్రులు అనవసరమైన తలనొప్పులను భరించాల్సి వస్తుందని, ఈ పరిస్థితిని శాశ్వతంగా నివారించాలని ఆయన అన్నారు. పరీక్షల నిర్వహణను స్వతంత్ర సంస్థలకు అప్పగించే అవకాశాలను పరిశీలించాలని సీఎం సూచించారు. మెరుగైన పరీక్షల నిర్వహణ ఏ దేశంలో, రాష్ట్రంలో ఉందో అధ్యయనం చేసి ఆ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు లేని పరీక్షల విధానాన్ని తీసుకురావాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఎన్నో రుగ్మతలు, సమస్యలను నివారించామని, పరిష్కరించామని, అలాంటిది పరీక్షల నిర్వహణలో తలనొప్పులను నివారించడం అసాధ్యమైందేమీ కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

చిత్రం... ఇంటర్ ఫలితాలపై మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్