రాష్ట్రీయం

పంతం నెగ్గింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 13: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటుపై ప్రతిష్టంభన తొలగిపోయింది. మంగళవారం కేబినెట్ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాలుగు అంశాల అజెండాతో కేబినెట్ నిర్వహణకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం పంపిన నివేదికపై సీఎస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ చర్చించి ఈ నెల 10వ తేదీన ఈసీకి సమర్పించింది. సీఈసీ ఆమోదముద్ర వేయాలంటే 48 గంటలు ముందుగా తెలియజేయాల్సి ఉంది. నిర్ణీత వ్యవధిలోపే సమాచారం అందడంతో ఆదివారం సాయంత్రమే అనుమతి వస్తుందని భావించారు. అయితే సోమవారం సాయంత్రానికి కానీ ఈ విషయమై ఈసీ స్పష్టత ఇవ్వలేదు. అజెండాలో పొందుపరచిన అంశాలపై చర్చించేందుకు మాత్రమే ఈసీ నుంచి అనుమతి వచ్చింది. ఈ సమాచారాన్ని ముందుగానే ఊహించిన ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎల్‌వీ సోమవారం ఉదయం ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకున్నారు. అటు కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి, మరోవైపు పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా సీఎస్ తనను కలుసుకోవటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పంతం నెగ్గినట్టయింది. గత కొద్దిరోజులుగా కేబినెట్ భేటీపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎన్నికల సంఘం మధ్య ప్రచ్ఛన్నయుద్ధం నడిచింది. దీనికితోడు ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షా సమావేశాలకు అధికారులు హాజరు కారాదని ఎన్నికల సంఘం నిబంధనలు విధించిందని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం ఆదేశాలు జారీ చేయటంతో వివాదం ముదిరి పాకానపడింది. మంత్రివర్గ సమావేశం నిర్వహణ అంశం ముఖ్యమంత్రికి ప్రతిష్టాత్మకంగా మారింది. తొలుత ఈనెల 10వ తేదీన కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కార్యాలయం అజెండా రూపొందించింది. అయితే అందుకు ఈసీ అభ్యంతరాలు తెలిపింది. తరువాత సవరించిన అజెండాతో పంపిన నోట్‌కు సోమవారం ఈసీ సమ్మతించింది. ఇటీవల రాష్ట్రంలో సంభవించిన ఫొని తుపాను ప్రభావం, కరవు, తాగునీటి ఎద్దడి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు నిధుల సమస్యలపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఈ నెల 11న సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే పోలవరం, రాజధాని నిర్మాణం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించేందుకు ముఖ్యమంత్రి సమాయత్తమయ్యారు. అప్పట్లో కూడా ఎన్నికల సంఘం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తనకు తెలీకుండానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తొలగించటంతో పాటు ఎల్వీ సుబ్రహ్మణ్యంను సీఎస్‌గా నియమించటాన్ని చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. ఒకవేళ ఎన్నికల సంఘం నియామకం జరిపినా బాధ్యతలు స్వీకరించిన తరువాత సీఎస్ తనను మర్యాదపూర్వకంగా కూడా కలుసుకోక పోవటాన్ని ఆక్షేపిస్తూ రాజ్యాంగ సూత్రాలను తెరపైకి తెచ్చారు. ప్రాధాన్యత అంశాలపై సమీక్షలు నిర్వహించుకునే అధికారం తమకు ఉందని, ఓట్ల లెక్కింపు 23తో పూర్తయినా తమ ప్రభుత్వం జూన్ 8వ తేదీ వరకు కొనసాగుతుందని ఇలాంటి పరిస్థితుల్లో ఈసీ ఉద్దేశపూర్వకంగానే అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందని, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లకు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు. బిజినెస్ రూల్స్ ప్రకారం క్యాబినెట్ మీటింగ్‌కు ఎన్నికల సంఘం అనుమతించాలని, ఒకవేళ సమావేశం నిర్వహించరాదంటే ఈ విషయాన్ని లిఖిత పూర్వకంగా తెలియజేయాలని పట్టుపట్టారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంపై ఆంక్షలు విధిస్తూ ఎన్నికల సంఘం పాలనా వ్యవహారాల్లో తల దూర్చుతోందని తప్పుపట్టారు. ప్రధాని నరేంద్రమోదీ కనుసన్నల్లో ఈసీ పనిచేస్తోందని ఆరోపించారు. దీన్ని వ్యతిరేకిస్తూ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. దీంతో కేబినెట్ భేటీకి ఈసీ షరతులతో కూడిన అనుమతినిచ్చింది. అజెండాలోని అంశాలు మినహా కొత్తవాటిపై నిర్ణయాలు, పెండింగ్‌లో ఉన్న బిల్లులు, ధరల్లో సవరణలు, నిధుల కేటాయింపులేవైనా ఉంటే కేంద్ర ఎన్నికల సంఘానికి ముందుగా తెలియజేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి పంపిన లేఖలో స్పష్టం చేసింది.
సీఎస్‌ను ప్రశ్నించిన సీఎం
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తనను ఎందుకు కలవలేదని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించినట్లు విశ్వసనీయ సమాచారం. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం, బ్యూరోక్రాట్ల మధ్య సత్సంబంధాలు ఉండాలని, అలా ఉంటేనే మనుగడ సాధ్యమవుతుందని హితవు పలికినట్లు సమాచారం. తమది ఆపద్ధర్మ ప్రభుత్వం కాదని, కౌంటింగ్ ముగిసినా మరో నెలరోజులపాటు గడువు ఉందని గుర్తుచేశారు. ఈసీ కేంద్రం కనుసన్నల్లో పనిచేస్తోందని, ప్రభుత్వ కీలకశాఖల్లో పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారిగా మీరు ఈ రకంగా వ్యవహరించటం మంచి పద్ధతి కాదని సున్నితంగా మందలించినట్లు చెప్తున్నారు. అయితే తాను ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడే వ్యవహరిస్తున్నానని ముఖ్యమంత్రి, మంత్రులపై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విద్వేషాలు లేవని సీఎస్ వివరణ ఇచ్చినట్లు సమాచారం. అనంతరం వీరిద్దరూ మంగళవారం జరిగే కేబినెట్ భేటీలో చర్చించాల్సిన అంశాలు, సమావేశం ఏర్పాట్లపై చర్చించారు.