రాష్ట్రీయం

ఓటమి నైరాశ్యంలో మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓటమి నైరాశ్యంలో మానసిక పరిపక్వత కోల్పోతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. ఎన్నికల్లో పోటీ చేయటం ఒకటే ముఖ్యం కాదని దేశ రాజకీయాలను ఆధ్యయనం చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. సోమవారం మంగళగిరి హ్యాపీ రిసార్ట్స్‌లో నంద్యాల పార్లమెంట్ పరిధిలోని నంద్యాల, డోన్, పాణ్యం, నందికొట్కూరు, ఆళ్లగడ్డ తదితర అసెంబ్లీ సెగ్మెంట్లపై సమీక్ష నిర్వహించారు. ముందుగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 326వ ఆరాధనా మహోత్సవాల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. అనంతరం ఇటీవల కర్నూలు- హైదరాబాద్ రహదారిలో వెల్దుర్తి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పార్టీ శాశ్వతమని, ఎన్నికలు ప్రతి ఐదేళ్లకోసారి వస్తాయన్నారు. ఇప్పటి వరకు నాలుగు రకాల సర్వేలు నిర్వహించామని అన్నింటిలో టీడీపీ గెలుపు ఖాయమైందన్నారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలే పార్టీకి శ్రీరామరక్ష అన్నారు. ఎన్నికలు మే నెలలో రావాల్సింది ముందుగానే పెట్టి టీడీపీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. స్వల్ప గడువుతో టీడీపీని దెబ్బతీయాలనుకుంటే అదే కలిసొచ్చిందన్నారు. ప్రతినెలా మొదటి వారంలో లబ్ధిదారులకు పింఛన్లు, ఆర్థిక సహాయం అందుతుందని రెండవ వారంలో ఎన్నికలు రావటం టీడీపీకి మేలైందన్నారు. మంచికి మారుపేరు టీడీపీ అయితే దుర్మార్గాలకు, అరాచకాలకు బీజేపీ, వైసీపీ చిరునామాగా నిలిచాయని విమర్శించారు. ఓటమి తప్పదని తెలిసినా వైసీపీ బుకాయిస్తోందని మండిపడ్డారు. మే 23న కౌంటింగ్‌లో టీడీపీ గెలుపు లాంఛనం మాత్రమేనని ధీమా వ్యక్తంచేశారు. నరేంద్రమోదీకి మరోసారి ప్రధాని అయ్యే ఛాన్స్ లేదన్నారు. దేశంలో బీజేపీ ఓటమి ఖాయమైందని మోదీ పాలనలో ఏపీకి జరిగిన అన్యాయంపై పోరాడామని పునరుద్ఘాటించారు. గత ఐదేళ్లలో దేశానికి జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించి బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను కూడగట్టామని గుర్తుచేశారు. 28 ఏళ్ల క్రితం చనిపోయిన రాజీవ్‌గాంధీ గురించి మోదీ మాట్లాడుతున్నారని, సైన్యం త్యాగాల ద్వారా ఎన్నికల్లో లబ్ధిపొందే ప్రయత్నాలు చేశారన్నారు. గత ఐదేళ్లలో ఏమీ చేయలేదు కనుకే మోదీ ప్రజలకు ఏమీ చెప్పే స్థితిలో లేరన్నారు. నంద్యాల, కర్నూలు లోక్‌సభ సీట్లలో టీడీపీ ఘన విజయం సాధిస్తుందన్నారు. 65లక్షల మంది కార్యకర్తలు, 4లక్షల మంది సేవామిత్రలు, 45వేల మంది బూత్ కన్వీనర్లు, 5వేల మంది ఏరియా కన్వీనర్లు తమ పార్టీకి ఉన్నారని అంతా తామే అభ్యర్థులుగా భావించి ఎన్నికల్లో కష్టపడి పనిచేశారని కితాబిచ్చారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిబద్ధతతో పనిచేశారని ప్రశంసించారు. నియోజకవర్గాల వారీగా సర్వేలు నిర్వహించామని ఈ సారి సర్వేలు విలక్షణంగా ఉన్నాయన్నారు. విశే్లషణలు వినూత్నంగా జరిగాయని, అన్నింటిలోనూ టీడీపీకి ఆధిక్యత ఉందన్నారు. గత 40 ఏళ్లలో జరగని సంక్షేమం, అభివృద్ధి ఐదేళ్లలో చేసి చూపామన్నారు. మహిళలకే లక్ష కోట్ల రూపాయల మేర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు మరో లక్ష కోట్ల మేర ప్రయోజనం కల్పించామన్నారు. రైతులకు రూ. 24 వేల కోట్ల రుణమాఫీ, పెట్టుబడి సాయం కింద మరో రూ. 14 వేల కోట్లు ఇచ్చామన్నారు. కులం, మతం, ప్రాంతం పేరుతో దేశాన్ని మోదీ విడదీశారని విద్వేష భావాలు పెంచటమే ఆయన నైజమని విమర్శించారు. భవిష్యత్‌లో వీటన్నింటినీ ఎలా అధిగమించాలనే విషయమై దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. నాకు కులం లేదు.. మతం అనేది లేనేలేదు.. విద్యార్ధి దశ నుంచి సామాజిక న్యాయం కోసం పోరాడాను.. అభివృద్ధి కార్యక్రమాలే నాకు తెలిసిన విద్య అన్నారు. పాజిటివ్ భావజాలం తప్ప నెగటివ్ సెన్స్ తనకులేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏజెంట్లు, నాయకులు కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఉద్ఘాటించారు. కొత్త రాష్ట్రం నిర్మాణం మనవల్లే సాధ్యమని ప్రజలు గత సార్వత్రిక ఎన్నికల్లో ఆదరించారని, అందుకు కొనసాగింపుగా ఈ ఎన్నికల్లో ఓట్లేశారని తెలిపారు. సంస్థాగతంగా పార్టీ బలాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈసారి మన పనితీరు భిన్నంగా ఉంటుంది.. ఇంతకు ముందులా ఉండదు.. ఇకపై కఠినంగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. కార్యకర్తలు ఎవరికీ బెదరాల్సిన పనిలేదన్నారు. భయం అనేది టీడీపీ రక్తంలోనే లేదన్నారు. మనం ఏ తప్పు చేయం.. ఎవరికీ భయపడం.. ఘర్షణలు, గొడవలకు వెళ్లొద్దని గతంలోనే మిమ్మల్ని హెచ్చరించాను.. మిమ్మల్ని కంట్రోల్ చేద్దామనుకున్నా.. అది చూసి ప్రత్యర్థులు రెచ్చిపోయారు.. ఇకపై అలా కుదరదు.. ఫ్యాక్షన్‌ను పూర్తిగా కట్టడి చేయటంపైనే దృష్టి సారిస్తామన్నారు. సీమ గడ్డ నుంచి ముఠా కక్షలు సమూలంగా సమసిపోవాలన్నారు. అభివృద్ధి, సంక్షేమమే అందరి అజెండా కావాలన్నారు. గ్రూపు రాజకీయాలు, ముఠా కక్షలకు కాలం చెల్లిందన్నారు. వైసీపీలో కార్యకర్తలు, నాయకుల అభిప్రాయ సేకరణకు అసలు విలువే ఉండదన్నారు.
పార్టీ నేత జగన్మోహన్‌రెడ్డి అహంభావంతో వ్యవహరిస్తారని టీడీపీలో కార్యకర్తల అభీష్టమే అంతిమ నిర్ణయమన్నారు నంద్యాల, దోన్ అసెంబ్లీ సమీక్ష సందర్భంగా చంద్రబాబు ఉద్విగ్నభరిత ప్రసంగం చేశారు. ఈ ఎన్నికల్లో కష్టపడి అన్నింటినీ తట్టుకుని నిలబడిన కార్యకర్తలను అభినందించారు. మీ కష్టం వృథాపోదు.. మీ త్యాగాలు పార్టీ చరిత్రలో నిలిచిపోతాయన్నారు. ఎన్నికల్లో కులం, మతం ఎక్కడ పనిచేశాయో విశే్లషించాలన్నారు. ఎక్కడ ఎవరు వ్యతిరేకంగా పనిచేశారు? పార్టీలోనే ఉంటూ ఎవరు సరిగ్గా పనిచేయలేదనే వివరాలను నివేదిక రూపంలో సమర్పించాలని పార్టీ నేతలను ఆదేశించారు. నేను చేయందిస్తే అందిపుచ్చుకుని పైకి వచ్చే పరిస్థితి ఉండాలి.. అంతేకానీ నాకు భారంగా మారకూడదని స్పష్టం చేశారు. కొత్త రాష్ట్రంలో అన్నీ సమస్యలే కనుక నిర్మాణంపై దృష్టి సారించాను.. ఇక వచ్చే ఐదేళ్లు పార్టీ బలోపేతంపై దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. ఈ ఐదేళ్లలో ప్రధాని మోదీ అనేక ఇబ్బందులకు గురిచేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి రావాల్సింది ఇవ్వలేదు.. ప్రజలకు చేయాల్సింది చేయలేదు.. విభజన అంశాలు అమలు చేయలేదు.. పార్టీని కూడా ఇబ్బందుల పాల్జేశారని మండిపడ్డారు. అన్నింటినీ అధిగమించి వీరోచిత పోరాటం చేశామని 23న కౌంటింగ్‌లో అంతా అప్రమత్తం కావాలని పిలుపునిచ్చారు. దుర్మార్గపు పార్టీలతో పోటీ ఆషామాషీకాదని ఏ మాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా ప్రజా తీర్పును సైతం బీజేపీ, వైసీపీ దుష్టశక్తులు కాలరాస్తాయని హెచ్చరించారు.

చిత్రం...నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు