రాష్ట్రీయం

గోదారా? ఎడారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మే 16: ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రధాన ఆధారమైన గోదావరి నదిలో నీటి నిల్వలు అంతరించిపోయి ఎడారిని తలపిస్తోంది. ప్రతిఏటా వేసవిలో గోదావరిలో నీటి నిల్వలు తగ్గిపోవడం సాధారణమే అయినప్పటికీ, ఈసారి వర్షాభావ పరిస్థితులకు తోడు ఎండల తీవ్రత కారణంగా జీవనది పూర్తిగా ఎండిపోవడంతో సాగు, తాగునీటి అవసరాలు తీర్చుకునేందుకు ప్రజలు పరితపించాల్సి వస్తోంది. గోదావరి నదీ తీరం వెంబడి ఎక్కడ చూసినా, చిన్న నీటి పాయ కూడా కనిపించకుండా అడుగున ఉన్న ఇసుక తినె్నలు, బండరాళ్లు దర్శనమిస్తున్నాయి. నిజానికి వేసవి ఆరంభానికి ముందే గోదావరిలో నీడి జాడలు కనుమరుగయ్యాయి. అక్కడక్కడా కొద్దిపాటిగా ఉన్న నీటి ప్రవాహం సైతం మండుతున్న ఎండల ధాటిగా పూర్తిగా ఆవిరైపోవడంతో గోదావరి గలగలలు మూగబోయాయి. ఫలితంగా రబీలో నిర్దేశిత ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీటిని అందించలేకపోయారు. తాగునీటి పథకాలకు కూడా గోదావరి నది ద్వారా చుక్కనీరు లభించని దుస్థితి నెలకొంది. గోదావరి జలాలపైనే ఆధారపడి వేలాది కోట్ల రూపాయలతో జిల్లాలో సాగు, తాగునీటి పథకాలను నిర్మించారు. వీటన్నింటికీ మూలాధారంగా నిలిచే గోదావరిలోనే నీటి జాడలు అంతరించిపోవడంతో ఈ పథకాలన్నీ వట్టిపోయి ఉత్సవ విగ్రహాలను తలపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నదీ తీర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎడారిగా మారిన గోదావరి నదిలోనే ఇసుక తినె్నలు తోడి చెలిమెలను ఏర్పాటు చేసుకుంటూ తాగునీటి అవసరాలను తీర్చుకుంటున్నారు. నవీపేట మండలంలోని యంచ, ఫకీరాబాద్, కోస్లి, నాళేశ్వర్, తుంగిని, నిజాంపూర్, నందిపేట మండలంలోని అన్నారం, బాద్గుణ, వనె్నల్(కె), సిర్‌పూర్, గంగాసముందర్, మారంపల్లి, డొంకేశ్వర్, జిజి.నడ్కుడ, సిద్ధాపూర్ తదితర గ్రామాల ప్రజల తలాపునే గోదావరి నది ఉన్నా తాగునీటి కోసం ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నీరు పూర్తిగా ఆవిరైపోవడంతో గోదావరి నది మీదుగా రాకపోకలు సాగిస్తున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక గోదావరి నీటిని వినియోగించుకుని లబ్ధి చేకూర్చాల్సిన గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాలతో పాటు మరో 15వరకు చిన్న తరహా లిఫ్టులు నీటివసతి లేక నిరుపయోగంగా మారి సేద దీరుతున్నాయి. తాగునీటి అవసరాల నిమిత్తం ఏర్పాటైన యంచ ఫ్లోరైడ్ స్కీమ్, జలాల్‌పూర్ పథకం నిష్ప్రయోజనంగా నిలుస్తుండడంతో వందలాది గ్రామాల గొం తెండుతోంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో అధికారులు వ్యవసాయ బోరుబావులు అక్కడక్కడా అద్దెకు తీసుకుని, ట్యాంకర్ల ద్వారా ప్రజలకు అరకొర స్థాయిలో నీటిని సరఫరా చేస్తున్నారు. తెలంగాణ జిల్లాల వరప్రదాయినిగా పిలిచే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు గోదావరి నది ద్వారా వరద జలాలు చేరాల్సి ఉండగా, ఈ ఏడాది పూర్తిస్థాయిలో ఇన్‌ఫ్లో రాలేకపోయింది. దీంతో ప్రస్తుతం శ్రీరాంసాగర్‌లో నీటి నిల్వలు డెడ్‌స్టోరేజ్‌కు చేరువయ్యాయి. 1091.00 అడుగులు, 90 టీఎంసీల పూర్తిస్థాయి సామర్థ్యం కలిగిన ఈ రిజర్వాయర్‌లో, గురువారం నాటికి 1049.80 అడుగులు, 6.09 అడుగుల వరకే నీరు నిలిచి ఉంది. నిజానికి ఐదు టీఎంసీలకు నీటి నిల్వలు చేరితే దానిని డెడ్‌స్టోరేజీగా పరిగణిస్తారు. అంటే ఎస్సారెస్పీలో ప్రస్తుతం కేవలం 1 టీఎంసీ నీటి నిల్వలు మాత్రమే వినియోగానికి మిగిలి ఉన్నాయని స్పష్టమవుతోంది. దీనిని ఆధారంగా చేసుకుని మిషన్ భగీరథ ద్వారా వందలాది గ్రామాలకు శుద్ధి జలాలు అందించాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరేందుకు నీటినిల్వలు అడుగంటడం ప్రధాన అవరోధంగా మారింది. ఇక చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు వేంపల్లి లిఫ్టు, నవాబ్ ట్యాంకు, మారంపల్లి, తల్వెద వంటి ఎత్తిపోతల పథకాలకూ నీటి లభ్యత ప్రశ్నార్ధకంగా మారింది. కనీసం ఈసారైనా సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురియకపోతే మనుగడ సాగించడమే కష్టంగా మారుతుందని గ్రామాల ప్రజలు, గోదావరి ఆయకట్టు ప్రాంత రైతులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు.
చిత్రాలు.. త్రివేణి సంగమ ప్రాంతమైన కందకుర్తి వద్ద ఇసుక తినె్నలు బయల్పడి ఎడారిని తలపిస్తున్న గోదావరి, *ఎస్సారెస్పీ లక్ష్మీ కాలువ వద్ద లిఫ్టు నిర్మించిన ప్రాంతంలో చుక్క నీరు లేని దృశ్యం