రాష్ట్రీయం

పార్టీ ఎదగనివ్వకుండా కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), జూన్ 6: క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి లోతుగా వెళ్లిన జనసేన పార్టీని ఎదగనివ్వకుండా రాష్ట్రంలో కొన్ని దుష్టశక్తులు కుటిల ప్రయత్నాలు చేస్తున్నాయని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులు, పార్టీ ముఖ్యనేతలతో పవన్‌కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ నేతలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ పార్టీ ఓటమికి ఏ ఒక్కరు కారణం కాదన్నారు. ఓటమిని ఒక అనుభవంగా తీసుకుని పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు తన తుదిశ్వాస వరకు పోరాడతానన్నారు. ఓటమిపై స్వీయ విశే్లషణ చేసుకోవాలని నేతలకు సూచించారు. ఓటు వేసిన వారితో పాటు జనసేన పోరాటయాత్ర, ఎన్నికల ప్రచార సభలకు హాజరైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఓటమిని ఒక అనుభవంగా తీసుకుంటున్నామన్నారు. నాలుగేళ్ల వయసు ఉన్న జనసేనపార్టీకి ఇన్ని లక్షల మంది ఓటు వేశారంటే అది నిజంగా విజయంగానే భావిస్తున్నట్లు తెలిపారు. అయితే పార్టీని ఎదగనివ్వకూడదని కొన్ని బలీయమైన శక్తులు పని చేయడంతో ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు చూడవలసి వచ్చిందన్నారు. పార్టీకి బలమైన క్యాడర్ ఉందని ఈ ఎన్నికలు నిరూపించాయని, భవిష్యత్తులో ఉత్తమ ఫలితాలు సాధించాలంటే పార్టీ కోసం పని చేసేవారందరూ ఒకే తాటిపై ఉండి ఒకే ఆలోచనా విధానంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలలో పార్టీకి ఉపకరించే అనేక సానుకూల అంశాలు ఉన్నాయన్నారు. ఓటమికి మనం వ్యక్తులను కారణంగా చూపరాదన్నారు. దృఢమైన సంకల్పంతో పార్టీ కోసం పని చేయాలనుకున్న వారే తనకు అవసరమని, కనీసం పదేళ్లపాటు పార్టీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లగలిగే వారు ఉండాలన్నారు. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు ఒకే తరహా ఆలోచనతో ముందుకు వెళ్లకపోతే విజయం సాధించడం కష్టమని అభిప్రాయపడ్డారు. తనతో పాటు వచ్చే వారు ఒక విషయం గుర్తుంచుకోవాలన్నారు. తనతో ఉంటే కీర్తి ప్రతిష్టలు వస్తాయి కానీ డబ్బు రాదన్నారు. పార్టీకి అనుకూలమైన పవనాలు వీచినప్పుడు ఆ ఫలితాలు వేరుగా ఉంటాయని, మనకు జనబలం ఉంది, ఆ బలాన్ని పార్టీ కోసం ఉపయోగించుకోవడం పార్టీ నేతల ముందున్న తక్షణ కర్తవ్యంగా చెప్పారు. మనం ఒక్కోసారి ఉహించని ఫలితాలను చూడవలసి వస్తుందన్నారు. దానిని ఎదుర్కోవాలంటే దీర్ఘకాలిక ప్రణాళిక, ముందు చూపు ఎంతో అవసరమన్నారు. తాను గాజువాక, భీమవరం రెండు చోట్ల పోటీ చేసినప్పటికీ సమయాభావం వల్ల ఏ నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో ఓటర్లను కలుసుకోలేకపోయానన్నారు.
త్వరలోనే కొత్త రాజకీయ వ్యవహారాల కమిటీ
ప్రస్తుతం పార్టీకి ఉన్న రాజకీయ వ్యవహారాల కమిటీ కాలం ముగిసిందని, ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గతంలో ఈ కమిటీని నియమించినట్లు పవన్‌కళ్యాణ్ తెలిపారు.
కొద్ది రోజుల్లోనే కమిటీని పునర్నియామకం చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మరో కమిటీని నియమించనున్నట్లు వెల్లడించారు. ఈ కమిటీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికలు, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలను పరిగణలోనికి తీసుకుని పని చేస్తుందన్నారు. అలాగే పార్టీ భావజాలం, నిర్ణయాలు, ప్రణాళికలు కార్యకర్తలు, ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియచేయడానికి పార్టీ తరఫున పత్రికను వెలువరించాలని నిర్ణయించినట్లు పవన్‌కళ్యాణ్ ప్రకటించారు. ఈ పత్రికలో రాష్ట్ర, దేశ, విదేశాలకు చెందిన విధానాలు, అభివృద్ది రంగాలకు చెందిన సమాచారం పొందుపరచాలన్నారు. మేధావులు, కార్యకర్తల అభిప్రాయాలు వెల్లడించడానికి ఈ పత్రిక ఒక వేదిక కావాలన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు వాటి పరిష్కారానికి ఈ పత్రిక తోడ్పడాలని ఆకాంక్షించారు. పత్రిక స్వరూప స్వభావాలు, ఎటువంటి శీర్షికలు ఉండాలో నిర్ణయించడానికి ఒక కమిటీని నియమించనున్నట్లు వెల్లడించారు. పత్రిక తొలి ప్రతిని సెప్టెంబర్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. పత్రిక ఈ- మ్యాగజైన్‌తో పాటు ముద్రిత సంచికను కూడా కార్యకర్తలకు అందుబాటలో ఉంచుతామన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో పార్టీ వ్యవహారాలకు సంబంధించిన అంశాలను పార్టీ నేతలు మాదాసు గంగాధరం, పీ రామ్మోహన్, తోట చంద్రశేఖర్, చింతల పార్థసారథి, ముత్తంశెట్టి కృష్ణారావు, మహేందర్‌రెడ్డి, పీ హరిప్రసాద్‌లు సమావేశంలో వివరించారు.
చిత్రం... విజయవాడలో గురువారం పార్టీ నేతలతో సమీక్ష జరుపుతున్న పవన్‌కళ్యాణ్