రాష్ట్రీయం

రైతుకు భరోసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 6: వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి రైతులను అన్నివిధాలా ఆదుకుంటూ వారిలో భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ధరల స్థిరీకరణ నిధి రూ. 3వేల కోట్లతో పాటు ప్రకృతి విపత్తుల సహాయక నిధిగా మరో రూ. 2వేల కోట్లను వ్యవసాయ మిషన్ పరిధిలోకి తెస్తున్నట్లు ప్రకటించారు. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలని, ఇందుకోసం టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. శనివారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ మిషన్ సమావేశం ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగింది. సమావేశం వివరాలను వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, మిషన్ ఉపాధ్యక్షుడు ఎంవీవీఎస్ నాగిరెడ్డి విలేఖరులకు వెల్లడించారు. ఇన్‌పుట్ సబ్సిడీ, విత్తనాలకు లోటు లేకుండా ప్రణాళిక చేపట్టాలని సీఎం ఆదేశించారు. త్వరలో రైతు సహకార సంఘాలు, నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. కౌలు రైతులకు కూడా ‘రైతు భరోసా’ అమలు చేయాలని, తద్వారా 30లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు. ఈ నెల 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ‘రైతు దినోత్సవం’గా జరపాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా కడప జిల్లా జమ్మలమడుగులో ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరుకానున్నారు. రైతు దినోత్సవం రోజు భరోసాతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలు, ఇతరత్రా ప్రోత్సాహకాలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతినెలా విధిగా వ్యవసాయ మిషన్ సమావేశాలు నిర్వహించి సమీక్ష జరపాలని సీఎం ఆదేశించారు. గతంలో రైతుల మార్కెటింగ్ అంశాన్ని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల నాణ్యత కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆయిల్‌పామ్ రైతులకు తెలంగాణ తరహాలోనే చెల్లింపులు జరపాలని నిర్ణయించారు. పొగాకు, కొబ్బరి రైతుల్ని ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. కౌలురైతుల ప్రయోజనార్థం అవసరమైతే చట్టసవరణ జరిపే అంశం సమావేశంలో చర్చకు వచ్చింది. భూముల రికార్డులను కూడా సవరించాల్సిన అవసరం ఉందని వ్యవసాయ మంత్రి కన్నబాబు తెలిపారు. సహకార రుణాలు అందించేందుకు కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. బ్యాంకులు రైతులపై ఒత్తిడి తేకుండా ఉండేలా జాగ్రత్తలు పాటించాలన్నారు. పగటిపూట 9గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేలా 60శాతం ఫీడర్లను ఆధునీకరించే అంశంపై ముఖ్యమంత్రి ఆరాతీశారు. ఇందుకు రూ. 17వందల కోట్లు ఖర్చవుతుందని, అది ప్రభుత్వమే భరించాల్సి ఉందని అధికారులు వివరించారు. వ్యవసాయ శాఖ పరిధిలో గత ప్రభుత్వ నామినేటెడ్ పదవుల రద్దుకు నిర్ణయం తీసుకున్నారు. విత్తనాల నాణ్యత విషయంలో రాజీపడొద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కొరత లేకుండా అవసరమైన మేరకు అందుబాటులో ఉంచాలన్నారు. కౌలు రైతులకు భరోసా పథకంలో ఏవైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. ఈ ఏడాది రబీ నుంచే రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏటా రూ. 12వేల 500 ఆర్థిక సాయాన్ని అందించాలని తీర్మానించినట్లు మంత్రి కన్నబాబు వివరించారు. సమావేశంలో మంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, అనిల్‌కుమార్ యాదవ్, వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
చిత్రం... వ్యవసాయ మిషన్‌పై జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి