రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాల్లో పాగా వేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/శంషాబాద్, జూలై 6: తెలుగు రాష్ట్రాల్లో కమలం వికసిస్తుందని, వచ్చే ఎన్నికల్లో కాషాయం జెండా ఎగురవేస్తామని, పార్టీ కార్యకర్తలు, నేతలు సమష్టిగా పనిచేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో తెలంగాణ, ఆంధ్ర, కేరళ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు వీలుగా దృష్టిని సారించినట్లు ఆయన చెప్పారు. ఈ మూడు రాష్ట్రాల్లో పార్టీని దిగువ స్థాయి నుంచి బలోపేతం చేస్తామన్నారు. శనివారం శంషాబాద్ వద్ద జరిగిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్రంలో బీజేపీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఇక్కడకు వచ్చిన అమిత్ షా మాట్లాడుతూ, తాజా పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి నాలుగు లోక్‌సభ సీట్లు, 20 శాతం ఓట్లు రావడం వెనుక పార్టీ కార్యకర్తల కృషి ఉందని అభినందించారు. రాష్ట్రంలో 20 లక్షల సభ్యత్వం చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన కోరారు. కార్యకర్తలే పార్టీకి బలమని ఆయన అన్నారు. తెలంగాణ బడుగు, బలహీనవర్గాల ప్రజల జీవితాల సంక్షేమం బీజేపీ వల్లనే సాధ్యమవుతుందన్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ముక్కచెక్కలవుతోందని ఆయన అన్నారు. మరో ప్రాంతీయ పార్టీ కూడా ముక్కలైందన్నారు. వ్యక్తిస్వామ్య వ్యవస్థలు ఉన్న పార్టీల వల్ల ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడతాయని, పరిపాలన ఉండదన్నారు. బీజేపీ సిద్ధాంతాల పార్టీ అని, వ్యక్తులకు, ప్రాంతానికి, కులాలకు ప్రాధాన్యత ఉండదన్నారు. 1984లో ఇద్దరు ఎంపీలతో ప్రయాణం ప్రారంభించిన బీజేపీకి ఈరోజు లోక్‌సభలో 303 సీట్లు వచ్చాయంటే కేవలం పార్టీ కార్యకర్తలు, ప్రజల ఆదరణ వల్లనే సాధ్యమైందన్నారు.
ఎన్నికల్లో గెలుపు ఓటములను సమానంగా తీసుకుంటామన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్వాన్నంగా ఉందని, ప్రతిపక్ష హోదా కూడా లేదన్నారు. బీజేపీలో కింది స్థాయి నాయకుడు ఉన్నత స్థానానికి ఎదిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. అన్ని పార్టీల్లో సమర్థులైన నేతలు ఉన్నారని, వారిని చేర్చుకుంటామన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పోరాటం చేశారని, నిజాం నియంతృత్వ పాలనకు చరమగీతం పాడారని ఆయన గుర్తు చేశారు. ఆ నాడు రజాకార్లు అఘాయిత్యాలకు పాల్పడ్డారని, ఈరోజు నిజాం వారసులుగా మజ్లిస్ పార్టీ అదే బాటలో నడుస్తోందన్నారు.
హరిత తెలంగాణ సాధనకు అంకితభావంతో పార్టీ నేతలు పనిచేయాలన్నారు. బీజేపీ పోలింగ్ బూత్ నుంచి పటిష్టంగా ఉండే విధంగా ప్రణాళికతో ముందుకెళుతుందన్నారు. నేతలు, కార్యకర్తలు, జనంలోకి వెళ్లి వారి మెప్పును పొందాలన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రజలు రెండవసారి ఓట్లు వేసి పెద్ద మెజారిటీ ఇచ్చారన్నారు. రానున్న రోజులు బీజేపీకి తెలంగాణలో పెను సవాళ్లు ఎదురవుతాయన్నారు. ఈ సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు పార్టీ నేతలు సిద్ధం కావాలన్నారు. తెలంగాణ బీజేపీ శాఖ ఉత్సాహంగా పనిచేస్తోందని, అనేక పార్టీలకు చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరాలని ఉత్సాహాన్ని కనబరుస్తున్నారని, అలాంటి వారిని చేర్చుకోవాలన్నారు. అందరినీ కలుపుకుని ప్రజలకు మంచి పాలన అందించడమే బీజేపీ లక్ష్యమన్నారు.
అమిత్ షా ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు బీజేపీలో చేరి సభ్యత్వం తీసుకున్నారు. మాజీ ఎంపీ రామ్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ, రిటైర్డు ఐఏఎస్ అధికారి చంద్రవదన్, మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి తదితరులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఐదుగురికి అమిత్‌షా పార్టీ సభ్యత్వం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.

చిత్రం... పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా