రాష్ట్రీయం

తెలంగాణ అంబేద్కర్ చలవే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 14: రాజ్యాంగంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కల్పించిన వెసులుబాటు వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆయన దయ వల్లనే ప్రస్తుతం తెలంగాణ సమాజం స్వేచ్ఛా వాయువులు పీలుస్తోందన్నారు. అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం నెక్లస్‌రోడ్‌లోని ఎన్టీఆర్ గార్డెన్‌లో 125 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేయనున్న అంబేద్కర్ విగ్రహానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అంతకుముందు లోయర్ ట్యాంక్‌బండ్‌లో అంబేద్కర్ టవర్స్ నిర్మాణానికి, బోరబండలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఐమాక్స్ థియేటర్ పక్కన ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. అంబేద్కర్‌కు తెలంగాణ సమాజం ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు. ఆయన లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదన్నారు. రాజ్యాంగం రాసేటప్పుడు దేశంలో ఏదైనా రాష్ట్రం విడిపోవాలంటే ఆ అధికారం ఎవరి చేతిలో ఉండాలన్న చర్చ జరిగిందన్నారు. అయితే రాజ్యాంగ రచనలో పాల్గొన్న వారంతా ఏ రాష్ట్రం నుంచి విడిపోవాలనుకున్నారో, ఆ రాష్ట్రం అంగీకారం తెలియజేయాల్సి ఉంటుందని వాదించారన్నారు. అయితే అంబేద్కర్ ఒక్కరే మైనార్టీల అభిప్రాయాన్ని మెజార్టీలు ప్రభావితం చేయకుండా ఆ అధికారం కేంద్రానికి ఉండాలని వాదించారన్నారు. అంబేద్కర్ వాదన ఫలితంగా రూపుదాల్చిన చట్టం వల్లనే ప్రస్తుతం తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారని, ఆయన దయ వల్లనే ఈ ప్రాంతానికి దోపిడి నుంచి విముక్తి లభించిందని అన్నారు. ఆ మహనీయుడికి తెలంగాణ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని, ఆయనకు ఎంత ఘనంగా నివాళులు ఆర్పించినా తక్కువేనని అన్నారు. అందుకే హైదరాబాద్‌కు ల్యాండ్ మార్క్‌గా ఉండేవిధంగా 125 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసే స్థలాన్ని అన్ని కోణాల నుంచి పరిశీలించిన తర్వాతనే ముందు బుద్ఢుడు, తర్వాత అంబేద్కర్, వెనుక సచివాలయం ఉండే విధంగా స్థలాన్ని ఎంపిక చేశామన్నారు. ట్యాంక్‌బండ్‌కు ఈశాన్యభాగంలో అంబేద్కర్ టవర్ నిర్మిస్తున్నామని, ఇకనుంచి దళితులకు సంబంధించిన కార్యక్రమాలన్నీ అందులోనే నిర్వహించుకోవచ్చని ముఖ్యమంత్రి అన్నారు. అంబేద్కర్ ఆశయసాధనలో భాగంగానే రాష్ట్రంలో పేదలకు ఈ ఏడాది రెండు లక్షల అరవై వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తున్నామన్నారు. అలాగే నిరుపేద దళిత కుటుంబాలకు ఉచితంగా మూడు ఎకరాల చొప్పున వ్యవసాయ భూమి పంపిణీ చేస్తున్నామన్నారు. మిషన్ కాకతీయ కూడా అంబేద్కర్ ఆలోచనల నుంచి పుట్టిందేనని అన్నారు. ఈ విద్యా సంవత్సరంలో 100 సాంఘిక సంక్షేమ పాఠశాలలను ప్రారంభించబోతున్నామని, ఇందులో ప్రత్యేకంగా 25 గురుకుల డిగ్రీ కాలేజీలను దళిత అమ్మాయిల కోసం, ఐదు గురుకుల పాఠశాలలు దళిత విద్యార్థుల కోసం కేటాయిస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల కోసం 250 గురుకుల విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తున్నామని, ఇవన్నీ కూడా కెజీ టు పిజీలో భాగమేనని ముఖ్యమంత్రి వివరించారు. విదేశాలలో చదువుకునే దళిత విద్యార్థులకు గతంలో రూ. 10 లక్షల స్కాలర్‌షిప్ ఇవ్వగా ఇక నుంచి దీనిని రూ. 20 లక్షలకు పెంచుతున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. దళితులకు ఉద్యోగాలు ఇవ్వడం కాదు, వారే ఇతరులకు ఉద్యోగాలు కల్పించేస్తాయికి ఎదగాలని టిఎస్ ప్రైడ్ ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి అన్నారు. అంబేద్కర్ 125 జయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహిస్తామన్నారు. ప్రతి నెలా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.

చిత్రం అంబేద్కర్ జయంతి సందర్భంగా గురువారం హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పైనున్న విగ్రహానికి పూలమాల వేస్తున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు.