రాష్ట్రీయం

కోట్లు ఇస్తామన్నా కిక్కురుమనరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 14: నిధులు లేవని బావురుమంటున్న విశ్వవిద్యాలయాలు కోట్లు ఇస్తామన్నా కిక్కురుమనడం లేదు. లాజిక్ అంతా ఆయా విశ్వవిద్యాలయాలు నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ (న్యాక్) గుర్తింపు పొందాల్సి ఉంది. కొన్ని విశ్వవిద్యాలయాలు గతంలో ‘న్యాక్’ గుర్తింపు పొందినా అది కాస్తా ముగింపు దశకు వచ్చింది. అయినా వర్శిటీలు మేలుకోవడం లేదు. న్యాక్ గుర్తింపులో మంచి స్కోర్ సాధించిన వర్శిటీలకు ఎ,బి,సి,డి గ్రేడ్‌లను జారీ చేస్తుంది. ప్రతి విశ్వవిద్యాలయంలో ఉన్న సౌకర్యాలను ఒక ప్రత్యేక బృందం పరిశీలించి వెయ్యింటికి మార్కులు కేటాయిస్తారు. దానిని సిజిపిఎ కిందకు మార్చి కనీసం 3 పాయింట్లు దాటిన వాటికి ఎ గ్రేడ్, 2 పాయింట్లు దాటితే బి గ్రేడ్, 1.5 పాయింట్లు దాటితే సి గ్రేడ్ ఇస్తారు. అంతకంటే తక్కువ పాయింట్లు వస్తే ఆ విద్యాసంస్థ పనితీరు సంతృప్తికరంగా లేదని నిర్ధారించి అక్రిడిటేషన్‌ను నిరాకరిస్తారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 46 విశ్వవిద్యాలయాలున్నాయి. ఇందులో అక్రిడిటేషన్ పొందినవి ఇరు రాష్ట్రాల్లో కలిపి 21 మాత్రమే. మిగతా 25 వర్శిటీలు అక్రిడిటేషన్ ప్రయత్నమే చేయలేదు. తెలంగాణలో సంప్రదాయ వర్శిటీలు ఆరు, స్పెషాలిటీ వర్శిటీలు ఏడు, సెంట్రల్ యూనివర్శిటీలు మూడు, డీమ్డ్ వర్శిటీలు రెండు, జాతీయ స్థాయి విద్యాసంస్థలు రెండు పనిచేస్తున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 26వర్శిటీల్లో సంప్రదాయ వర్శిటీలు 10, స్పెషాలిటీ వర్శిటీలు 11, డీమ్డ్ వర్శిటీలు ఐదు ఉన్నాయి. ఇన్ని వర్శిటీలున్నా, తెలంగాణలో 10, ఆంధ్రాలో 11 వర్శిటీలు మాత్రమే ఇంతవరకూ అక్రిడిటేషన్ పొందాయి.
తెలంగాణలో ఇఫ్లూ, ట్రిపుల్ ఐటి, జెఎన్‌టియు, కాకతీయ, ఉర్దూ యూనివర్శిటీ, ఉస్మానియా, తెలుగు యూనివర్శిటీ, తెలంగాణ యూనివర్శిటీ, ఇక్ఫాయి, సెంట్రల్ యూనివర్శిటీలకు అక్రిడిటేషన్ వచ్చింది. వీటిలో గడువు పూర్తయినవి ఇఫ్లూ, ట్రిపుల్ ఐటి, జెఎన్‌టియు, కాకతీయ, ఉర్దూ వర్శిటీ, ఉస్మానియా ఉన్నాయి. ఆంధ్రాలో నాగార్జున వర్శిటీ, ఆంధ్రా యూనివర్శిటీ, గీతం, కొనేరు లక్ష్మయ్య వర్శిటీ, ఆర్‌ఎస్‌వి, ఎస్‌కెయు, పిఎంయు, సత్యసాయి, ఎస్వీయు, విజ్ఞాన్, యోగివేమన వర్శిటీలు అక్రిడిటేషన్ పొందాయి. అందులో నాగార్జున, గీతం, ఆర్‌ఎస్‌వి, ఎస్‌కెయు, పిఎంయు, సత్యసాయి, ఎస్వీయుల కాలపరిమితి ముగిసింది. అవన్నీ తిరిగి అక్రిడిటేషన్ పొందాల్సి ఉంది. అన్ని పద్ధతులను పాటించి మూడో సైకిల్‌లో అక్రిడిటేషన్ పొందింది ఆంధ్రా యూనివర్శిటీ మాత్రమే. గ్రేడింగ్ ఎక్కువగా ఉన్న వర్శిటీలకు యూజిసి పొటన్షియల్ యూనివర్శిటీ హోదాలో రూ.100 కోట్లు వరకూ నిధులు వస్తాయి, అలాగే రూసా పథకం కింద కూడా రూ.50 కోట్ల వరకూ పొందే వీలుంది. వీటికి అదనంగా అనేక స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రాజెక్టులకు డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్, సాంఘిక సంక్షేమ శాఖ, మైనార్టీ శాఖతో పాటు పలు సంస్థల నిధులు పొందే వీలుంది.
ఇన్ని అవకాశాలతో పాటు ఆయా సంస్థల బలం, బలహీనత, యూనివర్శిటీలో ఉన్న అవకాశాలు, నిధుల కేటాయింపు, వాస్తవిక పరిస్థితుల అధ్యయనం, ఆధునిక పద్ధతులు అనుసరిస్తున్న తీరుతెన్నులను కూడా తెలుసుకునే వీలుంది. ఇన్ని అవకాశాలున్నా యూనివర్శిటీలు అక్రిడిటేషన్ పొందేందుకు ముందుకు రావడం లేదు, కారణాలు అడిగితే వర్శిటీలకు పూర్తికాలం వైస్ ఛాన్సలర్లు లేరనే ఏకైక సాకు చెబుతున్నారు. విసిలు నియమితులైతే బాధ్యతలు అప్పగించడం జరుగుతుందని, నిధులను కూడా కొంత మేర వెచ్చించాల్సి ఉంటుందని వర్శిటీల పాలకులు చెబుతున్నారు.