రాష్ట్రీయం

రేపే సింహగిరి ప్రదక్షిణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, జూలై 13: శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో ఆషాడ పౌర్ణమి సందర్భంగా సింహగిరి ప్రదక్షిణ, దేవాలయ ప్రదక్షిణ ఉత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. శ్రీ మహావిష్ణువు ద్వయావతార రూపుడిగా కొలువుతీరివున్న సింహగిరి చుట్టూ భక్తకోటి 32 కిలోమీటర్లు కాలినడకన ప్రదక్షిణ చేయనున్నారు. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ చతుర్దశినాడు గిరి ప్రదక్షిణ ప్రారంభించి పౌర్ణమి నాటి ఉదయం సింహాచలేశుని దర్శనం చేసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఏడాది చంద్రగ్రహణం ఉన్నందున పౌర్ణమినాడు మధ్యాహ్నం నాలుగు గంటలకే దర్శనాలు నిలిపివేయనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి పది గంటల వరకు భక్తులకు దర్శన భాగ్యం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. చాలా మంది భక్తులు చతుర్థశి నాడే ప్రదక్షిణ పూర్తి చేసుకొని వస్తున్న నేపథ్యంలో అధికారులు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు దేవస్థానం ధర్మప్రచార రథం ప్రదక్షిణ ప్రారంభం కానుంది. ఈ ఏడాది సుమారు పది లక్షల మంది భక్తులు సింహగిరి ప్రదక్షిణలో పాల్గొనే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవస్థానం అధికార యంత్రంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. భక్తులు ప్రదక్షిణ చేసే దారి పొడవునా విశ్రాంతి కేంద్రాలు, వైద్య శిబిరాలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవ నిర్వహణ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రంగం ఇప్పటికే సమావేశమై ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, జీవీఎంసీ కమిషనర్ సృజన, దేవస్థానం ఈవో రామచంద్రమోహన్ నేతృత్వంలో అధికార యంత్రంగం శనివారం ఏర్పాట్లను పరిశీలించింది. సింహాచలం తొలిపావంచా నుండి నగరంలోని జోడుగుళ్లపాలెం, అప్పూఘర్ సముద్రతీరం, మాధవధార దేవాలయాల వద్ద ప్రదక్షిణ చేసే రహదారుల్లో అధికార యంత్రంగా పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది. సోమవారం రాత్రి వేళలో భక్తులు ప్రదక్షిణ చేయనున్న నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తుతో పాటు అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్సులు అందుబాటులో ఉంచుతున్నారు. సమాచారం కోసం దేవస్థానం ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేసి రెండు టోల్‌ఫ్రీ నంబర్లను ( 0891-2545511, 2764949 ) ప్రకటించింది. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్యుల సలహాల మేరకు ప్రదక్షిణ చేయాలని అధికార యంత్రంగా భక్తులకు సూచన చేసింది.

చిత్రం...వరాహ నారసింహుడు కొలువుదీరిన సింహాచల క్షేత్రం