రాష్ట్రీయం

ఐదెకరాల్లోనే కొత్త సచివాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కొత్త సచివాలయ నిర్మాణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే శంకుస్థాపనను పూర్తి చేసుకుని, కార్యాలయాల తరలింపు ముమ్మరంగా జరుగుతోంది. ఈ కార్యక్రమం ఈనెలాఖరున పూర్తి చేసి వచ్చే నెలలో కూల్చివేతలను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త భవన నిర్మాణం ఎలా ఉండాలి? నిర్మాణాన్ని ఎంత విస్తీర్ణంలో చేపట్టాలి, ల్యాండ్ స్కేప్‌కు ఎంత స్థలం వదిలేయాలి? పార్కింగ్, కేఫ్‌టేరియా, కాన్ఫరెన్స్ హాల్, హెలిప్యాడ్ నిర్మాణాల విస్తీర్ణం ఎంత ఉండాలి? వాస్తు ప్రకారం ఎక్కడ ఏ నిర్మాణం జరగాలన్న దానిపై సాంకేతిక కమిటీ, ప్రభుత్వ వాస్తు సలహాదారు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. సాంకేతిక కమిటీ సచివాలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు సేకరించింది. వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ ఇప్పటికే కొత్త సచివాలయ నిర్మాణంపై ఔట్ లైన్ స్కెచ్ చిత్తు ప్రతిని ప్రభుత్వానికి అందజేశారు. కొత్త సచివాలయం ఎలా ఉండాలన్నది ఖరారు అయితే ఆ తర్వాత దాని ప్రకారం అంచనాలను రూపొందించి నిర్మాణానికి టెండర్లను ఆహ్వానిస్తారు. ఇప్పటికే దేశ, అంతర్జాతీయంగా పేరొందిన ఆర్కిటెక్ట్‌లు ప్రభుత్వానికి తమ డిజైన్లను అందజేశారు. సాంకేతిక కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం ఈ డిజైన్లలో కొన్ని చేర్పులు మార్పులు చేసి, సీఎం కేసీఆర్ ఆమోదించాక టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇలా ఉండగా కొత్త సచివాలయం ఎలా ఉండాలన్న దానిపై సాంకేతిక కమిటీ కసరత్తు చేస్తోంది. ప్రస్తుత సచివాలయంతో పాటు దీనికి ఆనుకొని ఉన్న మింట్ కాంపౌండ్‌లోని విద్యుత్‌శాఖ భవనాలు, ఉద్యోగుల సంఘాల కార్యాలయాలను కూడా కలుపుకొని నేలను చదును చేశాక మొత్తంగా 25 ఎకరాల విస్థీర్ణంలో కొత్త సచివాలయం నిర్మాణం జరగనుంది. అయితే, ఇందులో ఐదు ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే భవనాలను నిర్మించి మిగతా 20 ఎకరాలను ల్యాండ్ స్కేప్‌కు వదిలేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పూర్తిగా పర్యావరణ ఫ్రెండ్లీగా నిర్మాణం జరగాలని భావిస్తోంది. పచ్చని చెట్లు, పచ్చిక బయళ్లు, స్వచ్ఛమైన గాలి, వెలుతురు ఉండేలా వందకు వందశాతం నేషనల్ బిల్డింగ్ నార్మ్స్, గ్రీన్ బిల్డింగ్ నార్మ్స్‌కు అనుగుణంగా నిర్మాణం జరగాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. ప్రస్తుత భవనం జోన్-3 ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించలేదు. జోన్-3లో భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.7 పైనా పరిగణనలోకి తీసుకొని నిర్మిస్తారు. సచివాలయంలోని కొత్తగా నిర్మించిన భవనాలను కూడా కూల్చుతారా? అని ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కానీ వాస్తవానికి కొత్త భవనాలు హెచ్ బ్లాక్, డీ బ్లాక్ నిర్మాణాలు కూడా జోన్-3 ప్రమాణాల ప్రకారం నిర్మించలేదని సాంకేతిక కమిటీ గుర్తించింది. కొత్తగా నిర్మించబోయే సమీకృత భవనంలో ప్రస్తుతం సచివాలయంలో వేర్వేరు చోట్ల ఉన్న పోచమ్మగుడి, మసీదు, చర్చిలను ఎక్కడ నిర్మించాలన్న దానిపై కూడా సాంకేతిక కమిటీ, వాస్తు సలహాదారు పరిశీలిస్తున్నారు. గుడి-మసీదు-చర్చి మూడింటినీ ఒకేచోట తిరిగి నిర్మించడమా? ఉన్న చోటనే ఉంచి కొత్త నిర్మాణాలను చేపట్టడమా? అలానే ఉంచితే వాస్తుకు అనుగుణంగా ఉంటుందా? లేదా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ప్రగతి భవన్ స్థలంలో కూడా గతంలో గుడి ఉంటే దానిని వాస్తుకు అనుగుణంగా వేరే చోట నిర్మించిన అంశాన్ని సాంకేతిక కమిటీ పరిశీలిస్తోంది. సాంకేతిక కమిటీ తన నివేదికను ఈ వారంలోనే ప్రభుత్వానికి సమర్పించడానికి కసరత్తు చేస్తోంది.

చిత్రం... నూతన సచివాలయం నమూనా