రాష్ట్రీయం

6 చరిత్రాత్మక బిల్లులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి : బీసీల సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేయనుంది. దీంతో పాటు పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకు, నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు వంటి సాహసోపేత నిర్ణయాలను అమలు చేసేందుకు సమాయత్తమైంది. వీటికి చట్టబద్ధత కల్పించే దిశలో భాగంగా సోమవారం శాసనసభలో మొత్తం 6 చారిత్రాత్మక బిల్లులను ప్రవేశపెట్టారు.
‘శాశ్వత బీసీ కమిషన్ బిల్-2019’
వెనుకబడిన బలహీన వర్గాల అభ్యున్నతి, కుల ధృవీకరణ పత్రాలు జారీ, గ్రూప్‌ల మార్పు, అత్యంత వెనుకబడిన వర్గాల గుర్తింపు, రీగ్రూపింగ్, అత్యాచారాలు, వేధింపులు తదితర అంశాలకు నిర్దేశించింది. ఇది అన్నిరకాల బలహీన వర్గాల భద్రతకు ఉపకరిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి కమిషన్‌కు రూ. 1,49,94000 నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బిల్లును బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎం శంకర్ నారాయణ ప్రవేశపెట్టారు.
స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు
పారిశ్రామిక ప్రగతిలో భాగంగా పరిశ్రమలను ప్రోత్సహించటంతో పాటు 75 శాతం స్థానికులకే ఉపాధిని కల్పించేందుకు నిర్దేశించిన మరో బిల్లు (ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయిమెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ది ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ బిల్-2019)ను కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రతిపాదించారు. పరిశ్రమల స్థాపనలో ఉదార విధానాలను అవలంబించటం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి సంస్కరణలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అందుబాటులో ఉన్న వౌలిక సదుపాయాలు, పోర్ట్‌లు, మానవ శక్తితో పారిశ్రామిక ప్రగతికి అపారమైన అవకాశాలు ఉన్నందున పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా పెద్దఎత్తున ఉపాధి కల్పన జరుగుతుందనేది ప్రభుత్వ భావన. పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన భూములు ప్రైవేట్ వ్యక్తులు,
రైతుల వద్ద నుండి సేకరిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలలో భాగంగా స్థానికలకు ఉపాధి కల్పించాలనేది బిల్లు ముఖ్య ఉద్దేశం. పరిశ్రమల స్థాపనకు ముందు యాజమాన్యాలు స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించినా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమలు జరగలేదు. కొద్ది మందికి అదీ హౌస్‌కీపింగ్, అటెండర్ల స్థాయిలోనే ఉద్యోగావకాశాలు దక్కాయి. ఈ పరిస్థితుల్లో సమూల మార్పులు తీసుకు వచ్చి ఓ వైపు పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తూ మరోవైపు ఉపాధి కల్పన పెంపొందించేందుకు ఈ బిల్లు ఉపకరిస్తుంది.అర్హులైన వారికి పారిశ్రామిక సంస్థలు శిక్షణ ఇచ్చే అంశం కూడా ఇందులో పొందుపరిచారు.
నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్
దళిత, బలహీన, మైనారిటీ వర్గాలకు రాజకీయంగా చేయూత నందించే కార్యక్రమంలో భాగంగా ఆయా వర్గాలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్‌లను అమలు చేసేందుకు నిర్దేశించిన (50 పర్సెంట్ రిజర్వేషన్ టు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ ఇన్ ఆల్ ది నామినేటెడ్ పోస్ట్స్-2019)ను మంత్రి శంకర్ నారాయణ సభ ముందుంచారు. ఈ ప్రకారం అన్ని ప్రభుత్వ కార్పొరేషన్లు, ఏజెన్సీలు, సంస్థలు, సొసైటీలు, కమిటీలలో ఈ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తారు. బీసీ, మైనారిటీలకు 29 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్‌లు కల్పిస్తారు. ఇదిలా ఉండగా నామినేటెడ్ పదవుల్లో 50 శాతం మహిళలకూ ప్రాతినిధ్యం కల్పించేందుకు మరో బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళా భాగస్వామ్యం పెంచే చర్యల్లో భాగంగా రాజకీయ పదవుల్లో రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించడం ద్వారా ప్రత్యక్ష ఎన్నికలకు సమాయత్తమయ్యే పరిస్థితికి ఎదిగేలా చేయూతనిచ్చేందుకు ఈ బిల్లు ఉపకరిస్తుందనేది ప్రభుత్వ యోచన.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కాంట్రాక్ట్ పనులు
నామినేషన్ పద్ధతిన చేపట్టే కాంట్రాక్ట్ పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు మరో బిల్లును మంత్రి శంకర నారాయణ సభ ముందుంచారు. అణగారిన వర్గాల ఆర్థిక స్వావలంబన కోసం ఈ బిల్లు నిర్దేశించారు. నామినేటెడ్ పదవుల్లో కల్పించిన విధంగానే పనుల్లో కూడా బీసీ, మైనారిటీలకు 29 శాతం, ఎస్సీలకు 15, ఎస్టీలకు 6 శాతం ప్రాతినిధ్యం ఉంటుంది. పంచాయతీరాజ్ ఈఎన్‌సీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఆయా వర్గాలకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చటం ద్వారా ఆర్థిక అసమానతలను తొలగించాలనేదే బిల్లు ఉద్దేశం. ఇదిలా ఉండగా నామినేషన్ పద్ధతిన చేపట్టే కాంట్రాక్ట్ పనుల్లో మహిళలకు 50 శాతం వాటా కల్పించేందుకు నిర్దేశించిన ప్రత్యేక బిల్లును కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిపాదించింది. జనాభాలో సగ భాగంగా ఉన్న మహిళలు ఆర్థికంగా వెనుకబాటుతనం అనుభవిస్తున్నారని, స్వశక్తితో సాధికారత కల్పించే లక్ష్యంతో కాంట్రాక్ట్ పనుల్లో భాగస్వామ్యం ఇవ్వాలని నిర్ణయించింది. దీనివల్ల ఆర్థిక పరిపుష్టి కలుగుతుందనేది ప్రభుత్వ భావన.