రాష్ట్రీయం

హెచ్‌ఎండిఏకు మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: హైదరాబాద్ మెట్రోపాలిటిన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ)కు మహర్దశ పట్టనుంది. ఈ ప్రాంతం మొత్తానికి ఏకీకృత మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ప్రస్తుతం ఉన్న ఐదు మాస్టర్ ప్లాన్లను ఒకటిగా చేసి ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ తయారు చేసేందుకు సమాయత్తమవుతోంది. హైదరాబాద్ నగర పాలక సంస్థ (ఎంసిహెచ్), హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (హుడా), సైబరాబాద్ డెవలప్‌మెంట్ అథారిటీ (సిడిఏ), హైదరాబాద్ ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఏడిఏ), హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ (హెచ్‌ఎంఆర్)గా మాస్టర్ ప్లాన్లు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం నగర పరిధిని విస్తరించి, సరికొత్త హంగులతో అభివృద్ధిలో ముందడుగు వేయాలని భావిస్తోంది. దీనికి అనువుగా ఏకీకృత (ఇంటిగ్రేటెడ్) మాస్టర్ ప్లాన్ తయారు చేసి అమల్లోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు ఒక కన్సల్టెన్సీని నియమించుకునే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు. ఇటీవల రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటిఆర్ ఇందుకు సంబంధించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలివ్వడంతో కొత్త మాస్టర్ ప్లాన్ తయారీకి హెచ్‌ఎండిఏ చొరవ తీసుకుంది.
ప్రస్తుతం ఉన్న ఐదు మాస్టర్ ప్లాన్ల పరిధి ఐదు జిల్లాల్లో 7,257 చదరపు కిలోమీటర్లు ఉంది. దీనిలో హైదరాబాద్ 16 మండలాలు, మెదక్ 10 మండలాలు, రంగారెడ్డి జిల్లాలో 22, మహబూబ్‌నగర్ జిల్లాలో 2, నల్గొండ జిల్లాలో 5 మండలాలతో పాటు సంగారెడ్డి, భువనగిరి పట్టణాలు, 849 గ్రామాలు కలిసి ఉన్నాయి. ఈ మేరకు హైదరాబాద్ మహానగర పరిధిని తూప్రాన్, భువనగిరి, చౌటుప్పల్, యాచారం, సాగర్ హైవే రోడ్డు, శ్రీశైలం రాష్ట్ర రహదారిలోని కందుకూరు వరకు, షాద్‌నగర్, చేవెళ్లను కలుపుతూ వికారాబాద్ స్టేట్ హైవే వరకు, సంగారెడ్డి పట్టణం వరకు కొత్త ప్లాన్‌లో తీసుకు రావాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. సంగారెడ్డి, నర్సపూర్, తూప్రాన్, గజ్వేల్, భువనగిరి, చౌటుప్పల్, షాద్‌నగర్, శంకరపేటలను కలుపుతూ 290 కి.మీ పొడవున మరోరింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని హెచ్‌ఎండిఏ చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరించింది.
ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్‌ను జిఐఎస్ ఫార్మేట్‌లో ప్రస్తుతం ఉన్న ఐదు మాస్టర్ ప్లాన్లను కలుపుతూ, అవసరమైనప్పుడు వాటిని తిరిగి పరిశీలించుకునేందుకు వీలుగా డిజిటలైజేషన్ చేయాలని హెచ్‌ఎండిఏ భావిస్తోంది. ఇంతేకాకుండా నగర అభివృద్ధికి సంబంధించి రైల్వే, రోడ్డు రవాణా కనెక్టివిటీని కూడా దృష్టిలో ఉంచుకుని, అందుకు అనువుగా కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని ఎంపిక చేసే కన్సల్టెన్సీకి తెలియజేయనుంది. వీటితో పాటు తాగునీటి సరఫరా, డ్రైనేజీ, మురుగునీటి పారుదల వ్యవస్థ, డంపింగ్ యార్డులను ఒక క్రమ పద్ధతిలో తీర్చిదిద్దేందుకు వీలుగా మాస్టర్ ప్లాన్‌లో పొందుపర్చాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ మొత్తం అంశాలను పరిగణనలోకి తీసుకుని నమూనా మాస్టర్ ప్లాన్ ను ముందు తయారు చేసి తుది మెరుగులు దిద్దిన అనంతరం సమీకృత మాస్టర్ ప్లాన్ తయారు చేసి అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.