రాష్ట్రీయం

వేడెక్కిస్తున్న సమ్మర్ క్యాంప్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: విందు వినోదాలకు, ఆటపాటలకు, కొత్త కొత్త విషయాలపై శిక్షణ పొందేందుకు, లలిత కళల్లో రాటుదేలేందుకు కూడా వేసవి కాలం ఒక బృహత్తర అవకాశం. రెండు మూడేళ్ల వయస్సున్న పిల్లలు మొదలు ఇంటర్, డిగ్రీ చదివే వారికి సైతం వేసవి కాలం ఒక సువర్ణావకాశం. వార్షిక పరీక్షలు ముగియడం మరో పక్క 16 నుండే సెలవులు రావడంతో రెండు నెలల పాటు సుదీర్ఘకాలం ఏదో ఒక నైపుణ్యాన్ని పొందేందుకు వీలుదొరుకుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మార్కెట్ శక్తులు విద్యార్ధుల అవసరాలకు అనుగుణమైన కోర్సులను, శిక్షణ కార్యక్రమాలను, కౌశలాలను, నైపుణ్యాలను అందించే ప్రయత్నం చేస్తున్నాయి. హైదరాబాద్ వంటి ఎ-1 నగరాలకే పరిమితం కాకుండా మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా కేంద్రాలు, మున్సిపల్ పట్టణాలకు, మండల కేంద్రాలకు సైతం వేసవి శిక్షణ కార్యక్రమాలు తాకాయి. ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖలోని బాల భవన్ ద్వారా చిన్నపిల్లలకు వివిధ అంశాల్లో శిక్షణ అందిస్తుండగా, ప్రైవేటు సంస్థలు మరో అడుగు ముందుకు వేసి 15 రోజుల పాటు పిల్లలను తమ క్యాంపస్‌ల్లోనే ఉంచి అనేక రంగాల్లో శిక్షణ అందించడమేగాక, వినోదాన్ని కూడా పంచుతున్నాయి. ప్రధానంగా లలిత కళలు, కంప్యూటర్ శిక్షణ, విదేశీ భాషలు, ఆంగ్ల తర్ఫీదు, రోబోటిక్స్, డాన్స్, మ్యూజిక్, మాథమెటిక్స్, అనలసిస్, సైకాలజీ, యాక్షన్, షార్ట్ఫుల్మ్ మేకింగ్, గూగుల్ అనలైటిక్స్, హార్స్‌రైడింగ్, స్విమ్మింగ్, టోయస్ మేకింగ్, ఎంబ్రయిడరీ, స్టిచ్చింగ్ తదితర అంశాల్లో శిక్షణ ఇస్తున్నాయి.
ఇందుకోసం శిక్షణ సంస్థలు రకరకాల పేర్లతో వెలుస్తున్నాయి. ఒక్కో అభ్యర్ధి నుండి శిక్షణ ఇచ్చే అంశాల వారీ 3వేల నుండి పాతిక వేల వరకూ వసూలు చేస్తున్నాయి. కొన్ని సంస్థలు రెసిడెన్షియల్ క్యాంపస్‌లను ఏర్పాటు చేసి, అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి. తల్లిదండ్రులకు దూరంగా ఉన్నామనే భయం లేకుండా వారికి అన్ని రకాల భద్రత, భరోసా ఈ సంస్థలు కల్పిస్తున్నాయి. అయితే అదే సమయంలో ఈ సంస్థలు డ్రెస్ కోడ్, మెటీరియల్, ట్రాన్స్‌పోర్టు, రెసిడెన్షియల్ క్యాంపస్ పేరుతో పెద్ద ఎత్తున ఫీజులను వసూలు చేస్తున్నాయి. శిక్షణ సంస్థలను అదుపుచేసే వ్యవస్థ ప్రభుత్వ పరంగా లేకపోవడంతో తల్లిదండ్రులను దోచుకుంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
కొన్ని విద్యాసంస్థలు విద్యార్ధులను ఆకర్షించేందుకు సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాయి. మరో పక్క ఉన్న విద్యార్ధులు వేరే చోటుకు వెళ్లకుండా వారికి ఉచిత శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నాయి. ఇలా విద్యార్ధులను తమ తమ సంస్థల్లో కొనసాగేలా చూడటమే లక్ష్యంగా విద్యాసంస్థలు తమ జిమ్మిక్కులను ప్రదర్శిస్తున్నాయి. వీధికొక శిక్షణాలయం వెలసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటివి వేలల్లో పుట్టుకొచ్చాయి. సగటున వేసవిలో 15వేల కోట్ల రూపాయిల ‘శిక్షణ’ వ్యాపారం జరుగుతుందని అంచనా. మరో పక్క సబ్జెక్టు నిపుణులకు భారీ గిరాకీ ఏర్పడింది. ప్రధానంగా ఇంగ్లీషు, గణితం, ఫిజిక్స్ బోధించే వారు హోం ట్యూషన్ల పేరిట శిక్షణ ఇస్తున్నారు. నగరాల్లో వీరి ఫీజులు కూడా భారీగానే ఉంటున్నాయి.
విందు వినోదమేకాదు, మానసికోల్లాసంతో పాటు బోధనాంశాల్లో తర్ఫీదు పొందే గొప్ప అవకాశం వేసవి శిక్షణలో లభిస్తుందని గణిత శాస్త్ర నిపుణుడు వివిఎన్‌ఎస్‌ఎస్ రామ్ వ్యాఖ్యానించారు. వ్యయం అనుకోకుండా విద్యార్ధులకు వేసవి శిక్షణ ప్రోత్సాహం కల్పించాలని ఆయన సూచించారు.

తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం

కుతకుతలాడుతున్న సీమ
తెలంగాణ జిల్లాల్లో వడదెబ్బకు 14మంది మృతి

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 15: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. మరో నాలుగైదు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అనంతపురంలో 44 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు, నంద్యాల పట్టణాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా తిరుపతిలో 42 డిగ్రీలు నమోదైంది. తెలంగాణలో హకీంపేట (39 డిగ్రీలు) మినహాయిస్తే మిగిలిన అన్ని పట్టణాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటిపోయింది. వడదెబ్బకు తెలంగాణ జిల్లాల్లో శుక్రవారం 14 మంది మరణించారు.

ఇఎఫ్‌ఎల్ వర్శిటీలో
దళిత విద్యార్థి బహిష్కరణ

భగ్గుమంటున్న విద్యార్థి సంఘాలు
చదువుపూర్తయినందునే ఆంక్షలంటున్న విసి

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 15: దళిత విద్యార్ధులపై వివక్షతో యూనివర్శిటీలు భగ్గుమంటున్న సమయంలో హైదరాబాద్ ఇంగ్లీషు అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ (ఇఎఫ్‌ఎల్ వర్శిటీ)లో ఒక దళిత విద్యార్ధిని బహిష్కరించడం వివాదాస్పదంగా మారిం ది. వర్శిటీ పాలకుల నిర్ణయంపై విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. చదువుపూర్తయిన తర్వాత కూడా ఆ విద్యార్ధి యూనివర్శిటీలోకి వచ్చి విద్యార్ధుల్లో ఉద్యమాలు రెచ్చగొడుతున్నందునే తాము ఆయనపై ఆంక్షలు విధించామని, బహిష్కరణ జరగలేదని వర్శిటీ పాలకులు చెబుతున్నారు. మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ వివాదం, నిన్న ఢిల్లీ జెఎన్‌యులో కన్హయ్య కుమార్ వివాదం నుండి ఇంకా తేరుకోక ముందే ఇఎఫ్‌ఎల్ యూనివర్శిటీలో కునాల్ దుగ్గల్ అనే పిహెచ్‌డి విద్యార్ధి బహిష్కరణ తీవ్ర సంచలనం రేపుతోంది. హెచ్‌సియు వివాదం దేశాన్ని కుదిపేస్తున్న తరుణంలో ఇఎఫ్‌ఎల్ వర్శిటీ అధికారులు మరో ఘర్షణకు తెరతీయడంపై సర్వత్ర నిరసన వ్యక్తమవుతోంది. అంబేద్కర్ జయంతి రోజున యూనివర్శిటీలోకి వచ్చిన కునాల్ దుగ్గల్ జాతి వివక్షపై ఉపన్యిసిస్తున్న సమయంలో సెక్యూరిటీ సిబ్బంది ఆయనను గేట్ వద్దకు తీసుకువచ్చి బయటకు పంపించారు. యూనివర్శిటీలోకి రావాలంటే ప్రోక్టర్ ప్రకాష్ కోన అనుమతి తీసుకోవాలని సెక్యూరిటీ సిబ్బంది కునాల్‌కు వివరించారు. అయితే తన పట్ల అనుచితంగా వ్యవహరించారంటూ ఆయన ఉస్మానియా పోలీసు స్టేషన్‌లో ప్రోక్టర్‌పై కేసు పెట్టారని తెలిసింది. కునాల్ సెక్యూరిటీ సిబ్బంది విధుల్లో జోక్యం చేసుకుని వారిని అడ్డుకున్నారని పేర్కొంటూ యూనివర్శిటీ అధికారులు సైతం కునాల్‌పై మరో కేసు పెట్టారు. యూనివర్శిటీ విసి ఆదేశాలతో తాము ఆంక్షలు విధించామని గత ఏడాదే ఆయన చదువు పూర్తయిందని, పిహెచ్.డి థీసిస్ సైతం సమర్పించారని, ఆయన చదువు పూర్తయినందున ఆంక్షలు విధించాల్సి వచ్చిందని యూనివర్శిటీ సిబ్బంది చెబుతున్నారు. క్యాంపస్‌లోకి వచ్చి విద్యార్ధులను రెచ్చగొట్టడం, ఉద్యమాలు, ఘర్షణలకు తావిచ్చేలా వ్యవహరించడం వల్లనే విసి ఆదేశాల మేరకు ఆయనపై ఆంక్షలు విధించామని ప్రోక్టర్ ప్రకాష్ కోన చెప్పారు. కునాల్ వాదన ప్రకారం వర్శిటీ ప్రాంగణంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటైన వేదికపై ఒక పాట పాడిన అతను కీలక ప్రసంగం చేశాడు, అతడి ప్రసంగం పూర్తికాగానే అక్కడకొచ్చిన సెక్యూరిటీ గార్డులు బలవంతంగా వేదిక కిందకు ఈడ్చేసి చీఫ్ సెక్యూరిటీ అధికారి వద్దకు లాక్కుపోయారు. కార ణం ఏమీ చెప్పకుండానే అతడిని క్యాంపస్ నుండి బహిష్కరిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా హెచ్‌సియు రీసెర్చి స్కాలర్ రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఉద్యమాల్లో కునాల్ చురుకుగా పాల్గొంటున్నాడు. ఇఫ్లూలో ఉంటూ హెచ్‌సియు లో గెస్టు ఫ్యాకల్టీగా పనిచేస్తున్నట్టు స్థానిక సిబ్బంది చెబుతున్నారు.

గ్రూప్ -1 అభ్యర్థులతో ఎపిపిఎస్‌సి గేమ్స్

సాచివేత ధోరణితో ఇరకాటంలో అభ్యర్థ్ధులు ఫలితాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూపులు ఎటూ తేల్చుకోలేని అయోమయం పీకల మీదకు తెచ్చిన రాష్ట్ర విభజన

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 15: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ సాచివేత ధోరణితో గ్రూప్-1 అభ్యర్ధులు ఫలితాల కోసం ఏళ్లతరబడి ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర పునర్విభజనతో వారి పరిస్థితి పెనం మీద నుండి పొయ్యలో పడ్డట్టు అయింది. 2011 నాటి గ్రూప్-1 పరీక్షకు సంబంధించిన న్యాయవివాదాల పరిష్కారానికి ఇటు ఎపిపిఎస్‌సి, అటు తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అభ్యర్ధులు గాలిలో కొట్టుమిట్టాడుతున్నారు. 314 పోస్టులకు 2011లో గ్రూప్-1 నోటిఫికేషన్ ఇచ్చారు. 2012 మేలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించి మూడు లక్షల మంది నుండి 15వేల మందిని మెయిన్స్‌కు ఎంపిక చేశారు. 2012 సెప్టెంబర్ లో మెయిన్స్ పరీక్ష నిర్వహించి 606 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. మూడో దశ ఇంటర్వ్యూలను 2013 జనవరిలో నిర్వహించారు. మూడు నెలల పాటు ఇంటర్వ్యూలు నిర్వహించిన ఎపిపిఎస్‌సి అనంతరం వాటి ఫలితాలను ఇచ్చే దశలో ఇద్దరు అభ్యర్ధులు ప్రిలిమినరీ పరీక్ష కీలో ఉన్న పొరపాట్లపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో దానిని ఎపిపిఎస్‌సి సమ్మతించి, ఆరు ప్రశ్నలకు మార్కులను కలిపింది. దాంతో 209 మంది అదనంగా అర్హత సాధించారు. ఈ వివాదం కాస్తా సుప్రీంకోర్టు వరకూ వెళ్లడంతో అందరికీ మరో మారు మెయిన్స్ పరీక్ష నిర్వహించమని ఆదేశించింది.
మూడేళ్ల క్రితం అప్పటి సిలబస్, పరిస్థితులకు అనుగుణంగా తాము సన్నద్ధమై పరీక్ష రాశామని, ఇన్నాళ్ల తర్వాత మరో మారు మెయిన్స్ పరీక్ష రాయమంటే తమ జీవితాలతో ఆడుకోవడమేనని అభ్యర్ధులు వాపోతున్నారు. అభ్యర్ధులు అందరికీ మరోమారు మెయిన్స్ పరీక్ష నిర్వహించేబదులు కొత్తగా అర్హత సాధించిన 209 మందికి న్యాయం చేస్తూ మెయిన్స్ పరీక్ష నిర్వహించి అందులో అర్హులైన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదని ఇప్పటికే ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్ధులు వాపోతున్నారు. నోటిఫికేషన్ విడుదలై ఐదేళ్లయిందని, తాము ఫలితాల కోసం ఎదురుచూస్తూ కళ్లు కాయలు కాస్తున్నాయని , ఇప్పుడు తమ వయోపరిమితి సైతం దాటిపోతున్నందున అవకాశాలు కూడా మృగ్యమయ్యాయని వారు చెబుతున్నారు. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రా ప్రభుత్వాలు గ్రూప్-1 ఫలితాలపై సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నామని వారు చెప్పారు. ఎపిపిఎస్‌సి తప్పునకు తాము శిక్ష అనుభవించాలా అని వారు ప్రశ్నిస్తున్నారు. న్యాయస్థానం ముందు సమర్ధవంతమైన వాదనలు వినిపించి ఉన్నా, లేదా ఏ అభ్యర్ధికీ ఇబ్బంది లేని రీతిలో వ్యవహరించినా ఈ సమస్య ఇప్పటికే పరిష్కారమయ్యేదని వారు పేర్కొన్నారు. తిరిగి మెయిన్స్ నిర్వహిస్తే మారిన పరిస్థితుల్లో స్థానిక సమస్య, స్థానిక కోటాల సమస్య ఉత్పన్నమవుతుందని వారు చెబుతున్నారు. రెండు రాష్ట్రాల పబ్లిక్ సర్వీసు కమిషన్లు కొత్త సిలబస్ ప్రకటించాయని, కాని 2011 గ్రూప్-1 కోసం పాత సిలబస్‌తో పరీక్షలు పెట్టాలని చూడటం కూడా సహేతుకం కాదని అంటున్నారు.

ఏది మంచిదయతే అదే చేస్తాం

ఉత్తరాఖండ్‌పై బిజెపి స్పష్టీకరణ

డెహ్రాడూన్, ఏప్రిల్ 15: ఉత్తరాఖండ్‌లో రాష్ట్ర ప్రజలకు ఏది మంచిదయితే అదే చేస్తామని బిజెపి స్పష్టం చేసింది. ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రయోజనాలకు మేలు చేస్తుందని భావిస్తే తాము అదే చేస్తామని, ఎన్నికలకు వెళ్లడం వారి ప్రయోజనాలకు మంచిదని భావిస్తే అలా చేయడానికి కూడా తాము వెనకాడబోమని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి అనిల్ బలూని చెప్పారు. ఉత్తరాఖండ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తారా లేదా అనే దానిపై రాష్ట్ర బిజెపి నేతలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రకటనలు చేయడం గురించి విలేఖరులు అడిగినప్పుడు ఆయన ఈ విషయం చెప్పారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు సంబంధించిన ద్రవ్య వినిమయ బిల్లుపై ఓటింగ్‌కు 70 మంది సభ్యులున్న అసెంబ్లీలో 26 మంది బిజెపి సభ్యులతో పాటుగా తొమ్మిది మంది తిరుగుబాటు కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టడంతో రాజ్యాంగ సంక్షోభం తలెత్తడంతో ఉత్తరాఖండ్‌లో గత నెల 27న రాష్టప్రతి పాలన విధించడం తెలిసిందే. అవినీతి ప్రభుత్వంలో చాలాకాలంగా ఊపిరాడని రాష్ట్ర ప్రజలకు రాష్టప్రతి పాలనతో ఊరట లభించిందని బలూని అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను ఆకట్టుకోవడానికి బిజెపి ధనబలం, కండబలం ఉపయోగించి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికయిన తన ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి బిజెపి కుట్రలు పన్నుతోందని ముఖ్యమంత్రి హరీశ్ రావత్ తరచూ చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పి కొడుతూ, నిజానికి ఈ మొత్తం గందరగోళానికి ముఖ్యమంత్రే కారణమన్నారు.
తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అసమ్మతి ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకోవడానికి ముఖ్యమంత్రి బేరం కుదుర్చుకోవడానికి ప్రయత్నించే స్టింగ్ వీడియోను మొత్తం దేశం చూసిందని బలూని అన్నారు.

రీ డిజైనింగ్ బాగుంది

నీటి పారుదల
రంగ నిపుణుడు
హనుమంతరావు కితాబు
టి. మంత్రి హరీశ్‌రావుతో భేటీ

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 15: నీటిపారుదల రంగంలో నిపుణులు, మేధావుల అభిప్రాయాలు తీసుకోవడానికి ప్రభు త్వం సిద్ధంగా ఉందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. సాగునీటి రంగం నిపుణుడు టి హనుమంతరావుతో హరీశ్‌రావు శుక్రవారం సమావేశం అయి ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పై విస్తృతంగా చర్చించారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ ఎందుకు చేసిందీ హరీశ్‌రావు వివరించారు. ప్రభు త్వ నిర్ణయాన్ని హనుమంతరావు అభినందించారు. సాగునీటి రంగంలో హనుమంతరావుకు అపారమైన అనుభవం ఉందని, ప్రభుత్వ ఆలోచనలతో ఏకీభవించారని మంత్రి తెలిపారు. విపక్షాలు ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌లో హనుమంతరావు పలు అంశాలు ప్రస్తావించారు. దాంతో మంత్రి హరీశ్ శుక్రవారం ఆయన్ని కలిశారు. హనుమంతరావు అభిప్రాయాల ను తెలుసుకున్నారు. మిషన్ కాకతీయ చక్కటి కార్యక్రమమని హనుమంతరావు అభినందించారు. ఈసందర్భంగా చెరువుల్లో నీటి నిలువ ఎక్కువగా ఉండే విధంగా, మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దడానికి అవసరమైన సూచనలు, సలహాలను మంత్రికి ఆయన వివరించారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌పై సీఎం అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన తరువాత విపక్షాలు మేమూ ఇస్తామని స్పందించాయి. ఈ మేరకు వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ జరిగింది. కాంగ్రెస్ నాయకులు సైతం ఈ పవర్ పాయింట్ ప్రజంటేషన్‌లో పాల్గొని సందేహాలను వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల గురించి సవివరంగా మాట్లాడిన హనుమంతరావు తమ్మిడిహట్టి ప్రాజెక్టును 142 మీటర్లకు పరిమితం చేయడాన్ని సమర్ధించారు.