రాష్ట్రీయం

సామాజిక సమతౌల్యం దెబ్బతినడంతోనే ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 9: గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, పార్టీ భావజాలంలో సామాజిక సమతుల్యత లోపించడం వల్లే ఘోర పరాజయం మూటకట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో అభిప్రాయపడింది. పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా ఉన్న బీసీలు, మాదిగ సామాజికవర్గ ఓట్లు చీలడం, అప్పటి ప్రతిపక్షం వారికి వివిధ మార్గాల ద్వారా ఆశలు కల్పించడం ఎన్నికల్లో ఓటమికి దారితీసిందని పలువురు ముఖ్య నేతలు విశే్లషించారు. దూరమైన వర్గాలకు దగ్గరయ్యేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఆ దిశగా ముందుకు సాగాలని నిర్ణయించింది. శుక్రవారం గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎన్‌టిఆర్ భవన్‌లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి అధ్యక్షతన పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. ఎన్నికల అనంతరం తొలిసారిగా పొలిట్‌బ్యూరో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అవలంబించిన విధానాలు, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తీరు, తాజా రాజకీయ పరిస్థితులు తదితర అంశాలపై పొలిట్‌బ్యూరో సుదీర్ఘంగా చర్చించింది. రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల సమస్య, రైతుల ఆత్మహత్యలు, పార్టీ కార్యకర్తలు, నేతలపై దాడులపై పొలిట్‌బ్యూరో ఆందోళన వ్యక్తంచేసింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన 68 రోజుల్లో పెద్ద ఎత్తున ఆస్తుల విధ్వంసం, భౌతికదాడులకు తెగబడటం, హత్యలకు పూనుకోవడం పరిపాటిగా మారిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడుగురు కార్యకర్తలను దారుణంగా హతమార్చారని, వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో పర్యటించి బాధిత కుటుంబాల్లో భరోసా నింపి ప్రజల్లో మనోధైర్యం కల్పించేందుకు ప్రయత్నం చేశామన్నారు. ఆది నుంచి అహంభావాన్ని, ఆధిక్య ధోరణిని నిరసిస్తూ వచ్చిన తాను నక్సలైట్ల దాడికే భయపడలేదని తెలిపారు.
తనను మించిన తెగువ, ధైర్యం మన కార్యకర్తలకు ఉందంటూ గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పొనుగుపాడులో రోడ్డుకు అడ్డంగా గోడకడితే అక్కడి కార్యకర్తల పోరాట ఫలితంగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల బృందం పర్యటించి అక్కడి వాస్తవ పరిస్థితులను బహిర్గతం చేసిందన్నారు. వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక ఆశావర్కర్లు, ఉఫాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్‌లు, అంగన్‌వాడీ ఉద్యోగులు, ఇతర చిరుద్యోగులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడే దుస్థితి ఏర్పడిందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆయావర్గాల వారికి టీడీపీ తరపున అండగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ద్రవిడ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌ను, అనంతపురం విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ను రాజీనామా చేయాలని వేధించడాన్ని పొలిట్‌బ్యూరో దృష్టికి తీసుకొచ్చారు. పులివెందుల పంచాయతీలకు లొంగేది లేదని, ఉద్యోగ భద్రతకు టీడీపీ భరోసా ఇస్తుందని స్పష్టంచేశారు. గోదావరి వరదల్లో ప్రజలను అప్రమత్తం చేయడంలో, బాధితులకు సహాయక చర్యలు చేపట్టడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.
బాధిత కుటుంబానికి 10 వేలు ఇవ్వాలి
కాఫర్ డ్యామ్ వల్లే వరదలు వచ్చాయని వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని చంద్రబాబు ఖండించారు. ప్రతి బాధిత కుటుంబానికి రూ.10 వేలు అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతు ఆత్మహత్యలపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 68 రోజుల్లో 98 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం పట్ల ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకునేందుకు 24 వేల కోట్ల రూపాయల మేర రుణమాఫీ చేశామని, 4వ కిస్తీలో కొంత, 5వ కిస్తీ ఇంకా చెల్లించాల్సి ఉందని తెలిపారు. ఆ మొత్తాన్ని చెల్లించకుండా వైసీపీ ప్రభుత్వం రైతులను వేదించడం బాధాకరమన్నారు.
ఇద్దరు సీఎంల మధ్య వ్యవహారం కాదు
శ్రీశైలానికి గోదావరి జలాలల తరలింపు అంశం రెండు రాష్ట్రాలకు సంబంధించి అంశమని గుర్తుచేస్తూ రెండు రాష్ట్రాల్లోనూ దీనిపై విస్తృతంగా చర్చ జరగాలని, ఇది ఇద్దరు సీఎంల మధ్య వ్యవహారం కాదని అన్నారు. తెలంగాణలో ఇంజనీర్స్ అసోసియేషన్ ఇప్పటికే దీనిని వ్యతిరేకించగా రాష్ట్రంలో కూడా రైతు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని గుర్తుచేశారు. ఎన్టీఆర్ హయాంలో చెన్నైకి తాగునీటిని తెలుగు గంగ ద్వారా అందించామంటే అప్పటి ప్రధాని, నలుగురు ముఖ్యమంత్రులు, అందరితో విస్తృతంగా సంప్రదింపులు జరిపి, అందరికీ అమోదయోగ్యమైన నిర్ణయం తీసుకున్నామన్నారు. అలా వ్యవహరించబట్టే నేటికీ ఏ విధమైన వివాదాలు లేకుండా చెన్నైకి తాగునీటిని ఇవ్వగలుగుతున్నామని చెప్పారు.
ఈ దృష్ట్యా శ్రీశైలానికి గోదావరి జలాల తరలింపు అంశాన్ని రెండు రాష్ట్రాల ప్రజలందరి ఆమోదం మేరకే చేపట్టాలని స్పష్టంచేశారు. వైసీపీ ప్రభుత్వం శుక్రవారం విజయవాడలో నిర్వహించిన డిప్లమోటిక్ అవుట్‌రీచ్ సదస్సుపై పొలిట్‌బ్యూరోలో చర్చ జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడులు పోగొట్టేందుకు ఈ సదస్సు నిర్వహించినట్లుగా ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. పీపీఎల వివాదం గురించి, 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు, డిస్కమ్‌ల అప్పులు తదితర అంశాలపై విదేశీ రాయబారుల సదస్సులో ముఖ్యమంత్రి ప్రస్తావించడం సమంజసం కాదని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో ఇన్ని వివాదాలు ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు పెట్టకూడదని చెప్పినట్లుగా ఈ సదస్సు నిర్వహణ ఉందన్నారు. మా నాన్న కల కియా అని, అది నేటికి నెరవేరిందని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కియాకారు విడుదల సమయంలో వైసీపీ ఎంపీ మాధవ్ తీరు అభ్యంతరకరమని అన్నారు. గతంలో ఇదే విధంగా డబ్బుల కోసం వోక్స్ వ్యాగన్ కార్ల పరిశ్రమను తరిమేశారని, బ్లాక్ మెయిలింగ్ చేసి అనేక కంపెనీలను వెల్లగొట్టారని, ఇప్పుడు కియాను కూడా పొట్టనబెట్టుకోవద్దని హితవుపలికారు. కాగా ఇసుక ధరలు చుక్కలనంటి లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోవడంపై పొలిట్‌బ్యూరో ఆందోళన వ్యక్తంచేసింది. అన్న క్యాంటీన్ల మూసివేత, రంజాన్ తోఫా నిలిపివేత, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నిలుపుదల వంటి ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని పొలిట్‌బ్యూరో పిలుపునిచ్చింది.
మాజీ మంత్రి అయ్యన్న కంటతడి
పొలిట్‌బ్యూరో సమావేశంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కన్నీటి పర్యంతమైనట్లు తెలిసింది. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణలపై జరిగిన చర్చలో టీడీపీ హయాంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, రాజధాని నిర్మాణానికి కష్టపడిన తీరును ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. దేశంలోనే మరే రాష్ట్రంలో జరగని అభివృద్ధి టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగినా ప్రజలు వైసీపీ వైపు వెళ్లడంపై ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
పొలిట్ బ్యూరో ప్రక్షాళన అవసరం : సోమిరెడ్డి
ఇరు తెలుగు రాష్ట్రాల్లో పొలిట్‌బ్యూరో సభ్యులైన నేతలు పార్టీని వీడిన నేపథ్యంలో ప్రక్షాళన చేపట్టాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తంచేశారు. గత ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు పడిన కష్టాన్ని ప్రస్తుతం ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారని, త్వరలోనే తాము చేసిన తప్పును తెలుసుకుంటారని అన్నారు. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ అధ్యక్షులు కిమిడి కళా వెంక6టావ్, ఎల్ రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, చినరాజప్ప, కాలువ శ్రీనివాసులురెడ్డి, ప్రతిభాభారతి, అచ్చెన్నాయుడు, టిడి జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.