రాష్ట్రీయం

సైబర్ నేరాలకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: నేరాలను అదుపు చేయడానికి కావల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. రోజురోజుకూ పెరిగిపోతున్న సైబర్ నేరాలను నూతన చట్టాలు, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఖైరతాబాద్‌లోని ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా (ఐఈఐ) మోక్షగుండం విశే్వశ్వరయ్య భవన్‌లో శనివారం ‘సైబర్ సెక్యూరిటీ, ప్రాసెసింగ్’ అనే అంశంపై జరిగిన రెండు రోజుల అఖిల భారత సెమినార్‌ను కిషన్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. సైబర్ నేరగాళ్ల అప్పగింతకు ఇతర దేశాలతోనూ ఒప్పందాలు చేసుకుంటున్నామని, ఈ విషయంలో అన్ని రాష్ట్రాలతో కేంద్రం
సమన్వయం చేసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దేశంలో నేరాలను అరికట్టేందుకు ‘సిటిజన్స్ స్మార్ట్ కార్డు’ను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బంగ్లాదేశ్ వంటి చిన్న దేశాల్లో ప్రతి పౌరుడి పూర్తి వివరాలు తెలిపే స్మార్ట్ కార్డులను వినియోగిస్తున్నట్లు మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. సైబర్ టెక్నాలజీలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు మరింత అధ్యయనం చేయాల్సిన అవసరముందని కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియాలో భాగంగా దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలను అన్‌లైన్ చేస్తున్నామని, అందుకు కావాల్సిన నిధులను కూడా మంజూరు చేసిందని తెలిపారు. దేశంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారి వివరాలను సేకరించి డేటా బేస్‌ను తయారు చేస్తున్నామని ఆయన తెలిపారు. దీంతో భవిష్యత్తులో ఎవరైనా నేరాలకు పాల్పడినా అలాంటి వారికి ఉద్యోగాలు రావని, బ్యాంకుల ద్వారా లోన్లు కూడా మంజూరు కావని మంత్రి హెచ్చరించారు. మహిళల శ్రేయస్సు కోసం కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని, అందుకోసం 2018 సంవత్సరంలో ఉమెన్స్ సేఫ్టీ డివిజన్‌ను ఏర్పాటు చేశామన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతోనే ప్రస్తుతం చైనా, పాక్, బంగ్లాదేశ్ వంటి సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించగలుగుతున్నామని ఆయన వివరించారు. ఇటీవల పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ ప్రధాన మంత్రి రెచ్చగొట్టే ప్రకటనలు చేశారని, భారత్‌లో ఏమన్నా జరగవచ్చునని బాధ్యతరహితంగా మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. 370 ఆర్టికల్ విషయంలో కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ దృక్పథంతో లేని ఆరోణలు చేస్తున్నాయని ఇది ఎంతవరకు సబబుకాదన్నారు. జమ్మూలో ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని, కనుకే 144 సెక్షన్ ఎత్తివేశామన్నారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితి అదుపులోకి వచ్చిందని, 370 ఆర్టికల్ రద్దుతో అక్కడి యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. 370 ఆర్టికల్ ద్వారా ఎంత నష్టం కలిగిందో ప్రతిఒక్కరూ గుర్తించారని, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల దేశ వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేశారని తెలిపారు. ది ఇంజనీర్ ఇనిస్టిట్యూట్ ఇండియా తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సెమినార్‌లో బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు, మాజీ ఎమ్మెల్యే సుభాష్ చందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పదవి చేపట్టిన సందర్భంగా హోం మంత్రి కిషన్‌రెడ్డిని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తెలంగాణ చైర్మన్ జీ.రామేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి అంజయ్య, సంయుక్త కార్యదర్శి ప్రొ. డాక్టర్ బానోత్ రమణ నాయక్‌తో పాటు సభ్యులు కలిసి ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు.