రాష్ట్రీయం

జలాశయాలు కళకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: దేశంలో గంగా, మహానది, కావేరి ఇతర నదులతో పోల్చితే ఈ ఏడాది ప్రస్తుతం గోదావరి, కృష్ణా నదులపై నిర్మించిన జలాశయాల్లో నీటి నిల్వ మెరుగుగా ఉంది. సింధూ, నర్మద, తపతి నదుల్లో కూడా నీటి నిల్వ పరిస్థితి మెరుగుగా ఉందని కేంద్ర జల సంఘం తాజాగా విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. దేశంలో 103 రిజర్వాయర్లల్లో నీటి నిల్వ స్థాయిని కేంద్ర జల సంఘం పర్యవేక్షిస్తుంటుంది. ఇందులో 38 రిజర్వాయర్లపై జల విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. మొత్తం 103 రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 164.36 బీసీఎం (బిలియన్ క్యూబిక్ మీటర్లు). ప్రస్తుతం ఈ రిజర్వాయర్లలో నీటి నిల్ల సామర్థ్యం 76.845 బీసీఎం ఉంది. మొత్తం జలాశయాల కెపాసిటీలో 47 శాతం నీటి నిల్వ ఉంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ రిజర్వాయర్లలో మొత్తం నీటి నిల్వ సామర్థ్యం ఈ రోజు 77.403 బీసీఎంగా నమోదైంది. గత పదేళ్లలో సగటున ఇదే కాలంలో 79.471 బీసీఎం నీటి నిల్వలు ఉన్నాయి. గంగా, మహానది, కావేరి నదుల్లో నీటి నిల్వస్థాయి లోటుగా ఉంది. సబర్మత, కుచ్ ప్రాంతంలో నదుల్లో నీటి నిల్వల్లో లోటు ఎక్కువగా ఉంది.
దక్షిణాది రీజియన్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, కేరళ, తమిళనాడులో 32 రిజర్వాయర్లు ఉన్నాయి. వీటి మొత్తం నీటి నిల్వసామర్థ్యం 52.10 బీసీఎం. ఈ నెల 8వ తేదీ వరకు నీటి మట్టాలు, స్టోరేజీని పరిగణనలోకి తీసుకుంటే, 21.83 బీసీఎం నీటి నిల్వ ఉన్నట్లు కేంద్ర జల సంఘం పేర్కొంది. మొత్తం రిజర్వాయర్ల కెపాసిటీలో 42 శాతం నీటి నిల్వ ఉంది. గత ఏడాది ఇదే కాలంలో 62 శాతం నీటి నిల్వ ఉండేది.
కేంద్రజల సంఘం విడుదల చేసిన గణాంక వివరాల ప్రకారం శ్రీశైలంలో 269.75 మీటర్లకు 266.70 మీటర్ల నీటి మట్టం, 8.288 బీసీఎం నీటి సామర్థ్యానికి 4.535 బీసీఎం నీటి లభ్యత ఈ నెల 8వ తేదీన నమోదైంది. గత ఏడాదితో పోల్చితే నీటి లభ్యత గత ఏడాది కంటే ఎక్కువగా స్టోరేజీలో 55 శాతం ఉంది. ఏపీ, తెలంగాణ సాగునీటి ఇంజనీర్ల చెప్పిన ప్రకారం తాజాగా గత మూడు రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండింది. అన్ని గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీని వల్ల నాగార్జునసాగర్ కూడా వచ్చే నాలుగైదు రోజుల్లో నిండుతుంది. నాగార్జునసాగర్ నీటి మట్టం 225 టీఎంసీకి చేరుకుంది. ఈ జలాశయానికి శ్రీశైలం నుంచి 7.45 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. శ్రీశైలంకు 6.53లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇదే ఫ్లో కొనసాగితే, పులిచింతల ప్రాజెక్టు కూడా వచ్చే వారంలో 45 టీఎంసీ నీటి నిల్వ చేరుకుంటుందని స్థానిక రాష్ట్ర సాగునీటి ఇంజనీర్లు చెబుతున్నారు.
ఉత్తరాది ప్రాంతంలో ఆరు రిజర్వాయర్లలో మొత్తం 18.83 బీసీఎం నీటినిల్వ సామర్థ్యానికి 12.40 బీసీఎం నీటి లభ్యత ఉంది. తూర్పు ప్రాంతంలో 16రిజర్వాయర్లలో 18.83 బీసీఎంకు 6.09 బీసీఎం నీటి నిల్వ సంది. పశ్చిమప్రాంతంలో 35 రిజర్వాయర్లకు 32.31 బీసీఎంకు 17.40 బీసీఎం నీటి నిల్వలు ఉన్నాయి. సెంట్రల్ రీజియన్‌లో 14 రిజర్వాయర్లలో 43.11 బీసీఎంకు 19.13 బీసీఎం నీటి నిల్వలు ఉన్నట్లు కేంద్ర జల సంఘం పేర్కొంది.