రాష్ట్రీయం

వరద ఉధృతి.. ఆపై వర్షం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం : తూర్పు గోదావరి జిల్లాలో గత ఆదివారం గోదావరిలో మునిగిపోయిన టూరిజం బోటును వెలికితీయడానికి అధికారులు అహరహం శ్రమిస్తున్నారు. అందుబాటులో ఉన్న అన్ని రకాల అవకాశాలను వినియోగించుకుంటూనే దేశం నలుమూలల నుండి బోట్లను వెలికితీసే సాంకేతిక నిపుణులను సంప్రదించడం, రప్పించడం వంటి చర్యలు చేపడుతున్నారు. అయితే గోదావరిలో కొంచెం కొంచెంగా పెరుగుతున్న వరద ఉద్ధృతి, భారీ వర్షం బోటు వెలికితీత ప్రయత్నాలకు అటంకం కలిగిస్తున్నాయి. బోటును వెలికితీయడానికి ప్రత్యేక సాంకేతిక నిపుణుల బృందాలు గురువారం పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యాయి. వెలికితీయడానికి ప్రత్యేక బృందాలు ప్రతిబంధకాలు ఎదుర్కొంటున్నాయి. కొండల మధ్య నుండి ప్రవహించే గోదావరి కచ్చులూరు వద్ద సుడులు తిరిగే లోతైన ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు ఉపయోగిస్తున్న బోట్లు నిలకడగా ఉండే పరిస్థితి కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో ఒక భారీ ఫంటును ఏర్పాటుచేసి ఆపరేషన్ మొదలు పెట్టారు. సోనార్ పరికరం ఆధారంగా నదిలో బోటు ఎక్కడ ఉందనే విషయాన్ని కంఫ్యూటర్ స్క్రీన్‌పై గుర్తిస్తూ, నౌకాదళం బృందం, స్థానిక మత్స్యకార నేత ధర్మాడ సత్యం బృందం యాంకరువేసి ప్రవాహ దిశగా బోటును ముందుగా కదల్చడానికి గురువారం ఉదయమే ప్రయత్నాలు మొదలుపెట్టారు. భారీ ఏనుగు పగ్గం తాళ్లు, వైర్లు, అతిబలమైన వలలను ఉపయోగిస్తున్నారు. ప్రమాదం జరిగిన చోటనుండి నీటి ప్రవాహానికి స్థాన చలనమై, కాస్త పక్కగా ఈ బోటు ఉన్నట్టుగా గుర్తించారు. మట్టిలో కూరుకుపోయి ప్రవాహ ఉద్ధృతికి అనుగుణంగా బోటు అటూ ఇటూ కదులుతున్నట్టు గుర్తించారు. గురువారం ప్రమాద ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దీంతో కొద్దిసేపు ఆపరేషన్లకు అంతరాయం ఏర్పడింది. సుమారు మూడు వందల మంది వరకు సిబ్బంది ఇక్కడి ఆపరేషన్లలో తలమునకలవుతున్నారు. ముంబై బృందం మరో రెండు రోజుల్లో మెరైన్ టెక్నాలజీతో ఇక్కడకు చేరుకోనున్నట్టు తెలిసింది. మరోవైపు భద్రాచలం వద్ద వరద ఉద్ధృతి కాస్తంత పెరుగుతోంది. భద్రాచలం వద్ద గురువారం 22.6 అడుగుల మట్టం నమోదు కాగా ధవళేశ్వరం వద్ద 10.10 అడుగులు వుంది. ఎగువ ప్రాంతంలో తాలిపేరు వద్ద నుంచి నీటిని విడుదల చేయకపోతే ఇక్కడ ఉద్ధృతి కాస్తంత అదుపులోనే వుంటుందని అంచనా అంచనావేస్తున్నారు. భద్రాచలం వద్ద మాత్రం రెండు గంటలకు ఒక సెంటీ మీటరు చొప్పున ప్రవాహ మట్టం పెరుగుతోంది.

*చిత్రం... కంప్యూటర్ తెరపై కనిపిస్తున్న బోటు