రాష్ట్రీయం

అడ్డుకోకపోతే అధోగతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఏప్రిల్ 23: రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదిపై చేపట్టిన ప్రాజెక్టులను అడ్డుకోకపోతే ఆంధ్రప్రదేశ్ అధోగతిపాలవుతుందని ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీశైలం ప్రాజెక్టుపై శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తన స్వప్రయోజనాలు మినహా ప్రజల సంక్షేమం ఏ మాత్రం పట్టడం లేదని విమర్శించారు. కృష్ణా నదిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులను అడ్డుకోవాల్సిన చంద్రబాబు వౌనం దాల్చడం వెనుక రహస్యం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లొంగిపోవడమేనని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడిగా మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాబ్లీ ప్రాజెక్టు వద్ద ధర్నా చేసిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న కారణంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడటానికి కూడా చంద్రబాబు భయపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రాజెక్టులపై తాము ఎనిమిది నెలల క్రితమే గవర్నర్ నరసింహన్‌కు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశామని ఆయన గుర్తు చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం ఏ మాత్రం స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణా జలాలపై రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలు ఆధారపడి ఉన్నాయని తెలిపారు. వీటిలో ఆరు జిల్లాలు శ్రీశైలం జలాశయం నుంచి నీటిని వాడుకుంటున్నాయన్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన జలాల విషయంలో తెలంగాణ అనుసరిస్తున్న విధానాలను అడ్డుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ప్రజాద్రోహమేనన్నారు. ఒక వైపు తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిపై నిర్మించే ప్రాజెక్టులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా నిధులు మంజూరు చేస్తూ వేగంగా పని చేస్తుంటే చంద్రబాబు మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
దీనిపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైకాపా కూడా ఏ మాత్రం స్పందించకపోవడం దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లుగా ఉందని మండిపడ్డారు. కృష్ణా నదిపై ఎవరు అక్రమ ప్రాజెక్టులు నిర్మించినా కాంగ్రెస్ పార్టీ తరపున అడ్డుకొని తీరుతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షులు తులసి రెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎనిమిది జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు, కర్నూలు జిల్లాలోని నియోజకవర్గ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.

చిత్రం శ్రీశైలం డ్యాం వద్ద మహా ధర్నా నిర్వహిస్తున్న కాంగ్రెస్ నాయకులు