రాష్ట్రీయం

సిఎం చేతిలో వాణిజ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: ముఖ్యమంత్రితో పాటు ఐదుగురు మంత్రుల శాఖల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసమే మార్పులు తప్ప రాజకీయ కారణాలు లేవని మంత్రులు చెబుతున్నారు. మంత్రుల శాఖల మార్పునకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. మంత్రుల శాఖల మార్పునకు సంబంధించి గత రెండు వారాలనుంచి చర్చలు జరుగుతున్నాయి. ప్లీనరీ కన్నా ముందే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావించిన సిఎం కె చంద్రశేఖర్‌రావు ఒకదాని తరువాత ఒకటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. నామినేటెడ్ పదవుల పంపకానికి శ్రీకారం చుట్టిన సిఎం, ఇప్పుడు శాఖల మార్పుపై నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల క్రితం గవర్నర్‌ను కలిసి మంత్రుల శాఖల మార్పుపై సిఎం వివరించారు. కెసిఆర్ పంపిన ప్రతిపాదనలకు గవర్నర్ నరసింహన్ సోమవారం ఆమోద ముద్ర వేశారు. కీలకమైన వాణిజ్య పన్నుల శాఖ నుంచి తలసానిని తప్పించారు. ఈ శాఖను ఇకపై ముఖ్యమంత్రే స్వయంగా చూస్తారు. ఇక ఇప్పటి వరకు నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు చూస్తున్న మైనింగ్ శాఖను కల్వకుంట్ల తారక రామారావుకు అప్పగించారు. పరిశ్రమలు, ఐటి, మైనింగ్ ఒకే మంత్రి వద్ద ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ శాఖను కెటిఆర్‌కు అప్పగించారు. హరీశ్‌రావు నిర్వహిస్తున్న శాఖను సిఎం తన కుమారుడు కెటిఆర్‌కు అప్పగించారు అనే విమర్శ రాకుండా ఉండేందుకు హరీశ్‌రావు ముందుగానే ఈ అంశంపై ముఖ్యమంత్రికి లేఖ రాశారు. నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు ఇప్పటికే పలు కీలక శాఖలు నిర్వహిస్తున్నారు. ఇరిగేషన్, మార్కెటింగ్, మైనింగ్, అసెంబ్లీ వ్యవహారాల శాఖలతో పాటు మిషన్ కాకతీయ ప్రాజెక్టుల పనిభారం పెరిగినందున మైనింగ్ శాఖ నుంచి తప్పించాలని కోరుతూ మూడు నెలల క్రితమే సిఎంకు లేఖ రాసినట్టు హరీశ్‌రావు తెలిపారు. ఆదివారం, సోమవారం కూడా ఇదే విషయమై ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రస్తుతం నిర్వహిస్తున్న శాఖలతో పాటు అదనంగా వాణిజ్య పన్నుల శాఖ, గ్రామీణ నీటిపారుదల శాఖలను నిర్వహిస్తారు. మిషన్ భగీరథ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ పథకానికి సంబంధించిన శాఖను తానే నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. ఇప్పటి వరకు కెటిఆర్ ఈ శాఖను నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి అదనంగా సహకార శాఖ అప్పగించారు. జూపల్లి కృష్ణారావు ఇప్పటి వరకు పరిశ్రమల శాఖను నిర్వహించగా, ఆ శాఖను కెటిఆర్‌కు అప్పగించారు. కెటిఆర్‌కు అదనంగా పరిశ్రమలు, మైనింగ్ శాఖలను అప్పగించారు. కెటిఆర్ ఇప్పుడు ఐటి, పరిశ్రమలు, మైనింగ్, మున్సిపల్ వ్యవహారాలు, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలు చూస్తారు. పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలను ఇప్పటి వరకు కెటిఆర్ నిర్వహించగా, ఈ శాఖలను జూపల్లి కృష్ణారావుకు అప్పగించారు. వాణిజ్య పన్నుల శాఖను ఇప్పటి వరకు నిర్వహించిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు పశు సంవర్థక శాఖ, మత్స్య శాఖ, డెయిరీ, సినిమాటోగ్రఫీ శాఖలు అప్పగించారు.
జూన్ రెండున తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. ఉప ముఖ్యమంత్రి రాజయ్యను తొలగించి కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రిని చేయడం మినహా ఇప్పటి వరకు మంత్రివర్గంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న సమయంలో ఇప్పుడు మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు చేశారు. మరో ఏడాది వరకు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.