రాష్ట్రీయం

ఉత్తర తెలంగాణలో మళ్లీ మావోల కలకలం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: ఉత్తర తెలంగాణలో మావోయిస్టుల కలకలం మళ్లీ మొదలైంది. తాజాగా బుధవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు మండలం గూడెంలో మూడు వాహనాలకు నిప్పు పెట్టి పోలీసులకు సవాల్ విసిరారు. పార్టీ బలోపేతంపై మావోయిస్టులు దృష్టిసారించారు. రెండు దళాల సభ్యులు కోటపల్లి మండలం నుంచి బెజ్జూరు వరకు సంచరిస్తున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందినట్టు తెలుస్తోంది. దీంతో కరీంనగర్, ఆదిలాబాద్ సరిహద్దుల్లో ప్రత్యేక దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లాల్లో మావోయిస్టు యాక్షన్ టీం సంచరిస్తోందని ఇప్పటికే నిఘా వర్గాల నివేదిక మేరకు బిఎస్‌ఎఫ్, సిఆర్‌పిఎఫ్ దళాలు అడవులన్నీ జల్లెడ పడుతున్నాయి. అయితే మావోయిస్టుల రెండు బృందాలకు ఎవరు నేతృత్వం వహిస్తున్నారనే విషయం పోలీసులకు తెలియడం లేదు. నాలుగు రోజుల క్రితం బెజ్జూరు మండలంలో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. బుధవారం రాత్రి గూడెం వద్ద మూడు వాహనాలకు నిప్పు పెట్టడంతో ఇది పక్కా మావోయిస్టుల పనేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇటీవల ఓ మాజీ ఎమ్మెల్యే బాడీగార్డ్‌ను మావోయిస్టులు కాల్చి చంపిన ఘటన చోటుచేసుకోవడంతో చత్తీస్‌ఘడ్ మావోయిస్టులు ఇక్కడికి, ఇక్కడి మావోయిస్టులు అక్కడికి వస్తూ, వెళుతూ ఉన్నారని పోలీసులు గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు, సిర్పూరు కమిటీ కార్యదర్శి ఆజాద్ అలియాస్ సాంబయ్య, ఛత్తీస్‌ఘడ్ దళకమాండర్ సుధీర్, మంగీ కార్యదర్శి చార్లెస్ అలియాస్ శోభన్‌లతోపాటు సుమారు పది మంది మావోయిస్టులు ఈ ప్రాంతంలో సంచరిస్తూ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారని, పార్టీ కేడర్ రిక్రూట్‌మెంట్ కూడా జరుపుతున్నట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు సరిహద్దు జిల్లాల్లో కొంతమందిని అదుపులో తీసుకొని విచారించినట్టు తెలిసింది. వేమనపల్లి నుంచి దహెగాం, బెజ్జూరు మండలాల్లో పోలీసులు భారీ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. సోమ, మంగళవారాల్లో అదనపు బలగాలను అడవుల్లోకి దింపనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నెల 29, 30 తేదీల్లో నాలుగు రాష్ట్రాలకు చెందిన డిజిపిలు విశాఖపట్టణంలో సమావేశం కానున్నారు. మావోయిస్టుల కదలికలు, సరిహద్దు రాష్ట్రాల్లో నక్సల్స్ కార్యకలాపాలు, మావోయిస్టుల అణచివేత, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసుల పరస్పర సహకారం వంటి అంశాలపై చర్చిస్తారు. ఈ సమావేశంలో ఛత్తీస్‌ఘడ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లతోపాటు దేశ భద్రత సలహాదరులు, సిఆర్‌పిఎఫ్, బిఎస్‌ఎఫ్‌ల డిఐజిలు పాల్గొంటారని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఇదిలావుండగా లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసానికి తెలంగాణ ప్రభుత్వం రూ. 35 లక్షలు మంజూరు చేసిందని, ఈ నిధులను 2016-17లో లొంగిపోయిన నక్సలైట్ల పునరావాసానికి ఆర్థిక సహాయంగా అందజేస్తారని డిజిపి ముఖ్య ప్రజాసంబంధాల అధికారి తెలిపారు.