రాష్ట్రీయం

కరవు తీరా దాణా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఏప్రిల్ 29: పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నారాయణఖేడ్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని కల్హేర్ మండలం సుల్తానాబాద్ గ్రామ శివారు నల్లచెరువు వద్ద పశువుల పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యే మారెడ్డి భూపాల్‌రెడ్డి శుక్రవారం ఉదయం ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. పశు సంపద ఎక్కువగా ఉండే నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన రైతులు తమ పశువులను కాపాడుకునేందుకు ప్రతి వేసవిలో సింగూర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాంతాలకు వలసపోయేవారు. రెండేళ్లుగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో ప్రాజెక్టులూ ఎండిపోవడంతో ఖేడ్ ప్రాంత రైతులు పశువులను రక్షించుకోలేని దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడారు. కరవుతో కళ్లముందే పశువులు మృత్యువాత పడుతుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. స్థానిక ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఈ విషయాన్ని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పశు సంపద పరిరక్షణకై పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖకు ఆదేశాలు అందాయి. ఈమేరకు సుల్తానాబాద్ చెరువు పరిసర ప్రాంతంలో షామియానాలతో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. దక్షిణ భారతదేశంతోపాటు తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి పశు పునరావాస కేంద్రం నారాయణఖేడ్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఏర్పాటు చేయడం గమనార్హం. తొలిరోజు 700 నుంచి వెయ్యి పశువులు వస్తాయని అధికారులు అంచనా వేస్తే, అందుకు మూడు రెట్లు అధికంగా మూడు వేల పశువులు ఐదు మండలాల నుంచి తరలివచ్చాయి. ఐదు మండలాల నుంచి పశువులు తరలివచ్చాయంటే, ఆయా ప్రాంతాల్లో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితుల్ని అంచనా వేయొచ్చు. పునరావాస కేంద్రానికి వచ్చే ఒక్కో పశువుకు రోజుకు రూ.8.30 విలువైన ఆరు కిలోల మామిడి గడ్డిని ఉచితంగా అందించనున్నారు. పోషక విలువలు కలిగిన దాణాను యాబై శాతం సబ్సిడిపై కిలో రూ. 6.50కు సమకూర్చనున్నారు. 130 మెట్రిక్ టన్నుల మామిడి గడ్డి, 40 మెట్రిక్ టన్నుల దాణాను ఇప్పటికే పునరావాస కేంద్రం వద్ద అందుబాటులో ఉంచారు. పశువులు త్రాగడానికి నీటి తొట్లు వరుసగా ఏర్పాటు చేశారు. పశువుల ఆరోగ్యాన్ని పరీక్షించడానికి వైద్యశాలను ఏర్పాటు చేశారు. పశువులను తీసుకొచ్చే రైతులకు భోజనంతోపాటు వసతి సౌకర్యం కల్పించడానికి ఏర్పాట్లు చేశారు. పశువుల నుంచి పాల సేకరణకు డెయిరీ శాఖ ద్వారా ఎప్పటికప్పుడు చెల్లింపులతో పాలను తరలించే ఏర్పాట్లు చేపట్టారు. జూన్ రెండోవారంలో ప్రారంభం కానున్న వర్షాకాలం వరకూ పునరావాస కేంద్రాన్ని నిరంతరాయంగా కొనసాగించనున్నారు. తన విజ్ఞప్తిని ప్రభుత్వం అంగీకరించి పశు పునరావాస కేంద్రం ఏర్పాటు చేయించినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి హరీశ్‌రావుకు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం విజయవంతమైతే ప్రతి నియోజకవర్గంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. వర్షాకాలం వచ్చే వరకు పశుగ్రాసం, దాణాకొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని రైతుల వద్ద పశువుల పూర్తి వివరాలు తమ వద్ద ఉన్నాయని, అవసరమైతే వారందరికీ పశుగ్రాసం అందిస్తామని పశు సంవర్థక శాఖ డిడి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనురాధ రాజు పటేల్, ఎంపిపి జమునాబాయి, ఎంపిటిసి ప్రకాష్, జెడ్పీటీసీ సప్నమోహన్, డిడి డాక్టర్ రవీంద్రప్రసాద్, ఎడిలు సత్యనారాయణ, నర్సింగ్‌రావు, వైద్యులు చైతన్య, సునీల్‌దత్, తహశీల్దార్ సమ్మయ్య, ఎంపిడిఓ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం పునరావాస కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి