రాష్ట్రీయం

పండేది బంగారమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 29: పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతోనే బంగారు తెలంగాణ కల సాకారం కానుందని భారీ నీటిపారుదల శాఖా మంత్రి టి హరీశ్‌రావు అన్నారు. ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి తెలంగాణలోని పలు జిల్లాల్లో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్టు ప్రకటించారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిధిలోని రిజర్వాయర్ల నిర్మాణానికి హరీశ్ శ్రీకారం చుట్టారు. కృష్ణా తీరాన కొల్లాపూర్ నియోజకవర్గం నార్లపూర్ దగ్గర నిర్మించ తలపెట్టిన రిజర్వాయర్, కాల్వల పనులు, పంప్‌హౌస్ పనుల నిర్మాణానికి శంకుస్థాపన చేసి పైలాన్ ఆవిష్కరించారు. అదేవిధంగా వనపర్తి నియోజకవర్గం ఏదుల దగ్గర నిర్మించనున్న రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేసి పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం ఏదుల గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో హరీశ్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం కోసం దశాబ్దాలుగా తెలంగాణ వాసులు ఆందోళన చేస్తున్నా సీమాంధ్ర నేతలు పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత పాలమూరు ఎత్తిపోతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. 120 టిఎంసిల కృష్ణా జలాలను 60 రోజుల్లో పొలాల్లోకి ఎత్తిపోస్తామన్నారు. ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే ఈ ప్రాజెక్టు ద్వారా 70 టిఎంసిలకు సంబందించిన రిజర్వాయర్లు నిర్మిస్తున్నట్టు చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లాలోనే పాలమూరు సహా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా, కాంగ్రెస్ నేత రఘువీరా ఎన్ని దీక్షలు చేసినా పాలమూరు పథకాన్ని పూర్తి చేసి, బంగారు తెలంగాణ ఆవిష్కరిస్తామన్నారు. గత పాలకులు కల్వకుర్తి ఎత్తిపోతలను విస్మరించారని, మూడు లక్షల ఆయకట్టు అంటూ అందుకు కేవలం 25 టిఎంసిల నీటిని కేటాయించి మోసం చేశారని ఆరోపించారు. అయితే దీన్ని గమనించిన సిఎం కెసిఆర్ నీటిపారుదల శాఖల నిపుణులతో చర్చించిన తరువాత కల్వకుర్తి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు పెంచడం జరిగిందన్నారు. కాంగ్రెస్, తెదేపా నేతల దిమ్మతిరిగేలా ఏకంగా 40 టిఎంసిల నీటిని కేటాయించారన్నారు. పాలమూరు ఎత్తిపోతలకు భూములిస్తున్న రైతాంగానికి తాను ప్రత్యేకంగా పాదాభివందనం చేస్తున్నానని హరీశ్ ప్రకటించటంతో హర్షధ్వానాలు మిన్నంటాయి. భూములిచ్చిన నిర్వాశితులకు మెరుగైన పరిహారం అందిస్తామని, నార్లపూర్, ఏదుల గ్రామాలకు ప్రత్యేక ప్యాకేజీ విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. సిఎంతో ఈ విషయాన్ని ప్రత్యేకించి మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ఏదులకు రూ.2 కోట్లు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారు. నార్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గిరిజన తండావాసులకు 218 డబుల్ బెడ్‌రూంలు సైతం రూ.5 లక్షలతో కట్టిస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం చేసేందుకు తాను ప్రత్యేకంగా నెలలో రెండు రోజులపాటు ప్రాజెక్టుల దగ్గర బస చేస్తానని ప్రకటించారు. పెండింగ్ ప్రాజెక్టులపైనా ప్రత్యేక దృష్టి పెట్టామని, రాబోయే ఖరీఫ్‌లోనే కొన్ని ప్రాజెక్టుల ద్వారా నీటిని అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. దేశంలోనే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తిచేసి రికార్డు సృష్టిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ ముందుగా తమ ఆంధ్ర నేత రఘువీరారెడ్డిని పాలమూరు ఎత్తిపోతలకు అడ్డంరాకుండా చూసుకోవాలని హితవుపలికారు. కాంగ్రెస్ నేతలకు విధానమంటూ ఉండదని, ఏ పూటకు ఆ పూట మాట్లాడేవారని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కల్వకుర్తి ఆయకట్టు దెబ్బతినకుండానే నార్లాపూర్ నుండి డిండికి కృష్ణా జలాలను తరలిస్తామని, అందులో భాగంగానే అచ్చంపేటకు 30వేల ఎకరాలకు సాగునీరు అందేలా ఇందులో రూపకల్పన చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి, ఎమ్మెల్యేలు గువ్వల బాల్‌రాజ్, శ్రీనివాస్‌గౌడ్, మర్రి జనార్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

చిత్రం పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పైలాన్ ఆవిష్కరిస్తున్న మంత్రి హరీశ్‌రావు