రాష్ట్రీయం

అద్దెకు ఇళ్లు దొరుకును!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 29: హైదరాబాద్ నుంచి ఉన్నపళంగా అమరావతికి వెళితే ఇళ్ళు ఎక్కడ వెతుక్కోవాలి? ఆగస్టులోగా తరలిరావడానికి సిద్ధమవుతున్న ఉద్యోగుల్ని వెంటాడుతున్న భయమిదే. అయితే ఆ భయం వారికి అక్కర్లేదు. వారికోసం అమరావతిలో అద్భుతమైన ఇళ్లు తయారవుతున్నాయి. జూన్‌లో అమరావతికి వచ్చే ఉద్యోగుల కోసం ఇళ్ళను సిద్ధం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అయితే హైదరాబాద్ నుంచి వచ్చే హెచ్‌ఓడిలకు మాత్రమే విజయవాడకు సమీపంలో ఇళ్ళను వెతుకుతున్నారు. వేలాదిగా తరలి వచ్చే సాధారణ ఉద్యోగుల విషయాన్ని ప్రభుత్వం గాలికొదిలేసింది. కానీ, ఉద్యోగుల కోసం అమరావతి రైతులు ఎడాపెడా ఇళ్ళను నిర్మిస్తున్నారు. కాస్త అద్దె ఎక్కువైనా, ఉద్యోగులు కాళ్ళరిగేలా తిరగక్కర్లేకుండా వారు కోరుకున్న ప్రదేశంలో, వారి టేస్ట్‌కు తగిన విధంగా ఇళ్ళను నిర్మించి వారికి అందుబాటులో ఉంచుతున్నారు. రాజధాని ఆనుకుని ఉన్న తాడేపల్లి, తాడికొండ, తుళ్లూరు తదితర మండలాల్లో గ్రామ కంఠాల్లో భూములున్న రైతులు ఇప్పుడు అపార్ట్‌మెంట్లను నిర్మిస్తున్నారు. అలాగే రాజధానికి ఇచ్చిన భూమిని అమ్ముకునే హక్కున్న కొద్దిమంది రైతులు కూడా ఇదే బాటను అనుసరిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన ఈ భవనాలు సిద్ధమవుతున్నాయి. రాజధాని కోసం గుంటూరు జిల్లా తాడేపల్లి, తాడికొండ, తుళ్లూరు తదితర మండలాల్లో భారీగా భూములను సేకరించిన సంగతి తెలిసిందే. భూములు ఇచ్చిన రైతుల లావాదేవీలు ఇంకా పూర్తికాలేదు. రాజధానికి భూములు ఇవ్వని గ్రామకంఠాల్లోని రైతుల పంట పండింది. ఇక్కడ ఒక్కో రైతుకు కనీసం ఎకరం నుంచి నాలుగు ఎకరాల భూమి ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఎకరం విలువ తొంభై లక్షల నుంచి కోటీ ఏభై లక్షలు పలుకుతోంది. రెండెకరాల భూమి ఉన్న రైతు ఒక ఎకరాన్ని విక్రయిస్తున్నాడు. అప్పులు తీర్చేసి, మిగిలిన డబ్బుతో బంగారం, ఓ చిన్నపాటి కారు కొంటున్నాడు. మిగిలిన భూమిలోని ఒక వెయ్యి గజాల్లో అపార్ట్‌మెంట్ కడుతున్నాడు. జి ప్లస్ 4 పద్ధతిలో 10 ప్లాట్‌ల అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తున్నాడు. కొంతమంది తెలివైన రైతులు గ్రౌండ్ ఫ్లోర్‌ను షాపుల కోసం వదిలేసి, ఫస్ట్ ఫ్లోర్‌ను వారికోసం ఉంచుకుని, మిగిలిన గదులను అద్దెకివ్వడానికి సిద్ధం చేస్తున్నారు. గజిటెడ్ ఉద్యోగులు ఉండేందుకు వీలుగా కూడా అన్ని హంగులతో భవనాలను సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి అపార్ట్‌మెంట్‌లు రాజధాని ప్రాంతంలో రెండు వందల వరకూ ఉన్నాయి. ఇన్ని ఇళ్ళు ఒకేసారి ఎందుకు నిర్మిస్తున్నారో తెలుసా! త్వరలో ఈ ప్రాంతానికి ఇబ్బడిముబ్బడిగా తరలివచ్చే ఉద్యోగుల కోసం.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్‌లను బుక్ చేసుకుంటే, డబుల్ బెడ్ రూం ఇంటిని ఎనిమిది వేల నుంచి 10వేల రూపాయల అద్దెకు ఇవ్వజూపుతున్నారు. నిర్మాణం పూర్తి స్థాయిలో జరిగిన ఇళ్లకు 15 వేల రూపాయల వరకూ అద్దె పలుకుతోంది. ఇక కమర్షియల్ భవనాల సంగతి చెప్పనక్కర్లేదు. చిన్నపాటి దుకాణం ఏర్పాటు చేసుకోవాలంటే, కనీస అద్దె 15 నుంచి 20 వేల రూపాయలు చెపుతున్నారు. భారీగా అడ్వాన్స్ కూడా అడుగుతున్నారు. జూన్ నాటికి ఈ భవనాలన్నింటినీ సిద్ధం చేస్తామని భవన యజమానులు చెపుతున్నారు.

చిత్రం తుళ్లూరులో నిర్మాణంలో ఉన్న ఓ భవనం