రాష్ట్రీయం

మేం చేసిన తప్పేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 2:‘మేం చేసిన తప్పేంటి? రాష్ట్ర విభజనను మేం కోరుకోలేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించింది. తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రం ఆదుకోవడం లేదు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రావాలి. దాన్ని ఇవ్వడానికి కూడా కేంద్రం ముందుకు రావడం లేదు. దీనికి సంబంధించి 30సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానిని, కేంద్ర పెద్దల్ని కలిశాను. అయినా ఫలితం లేదు. అసలు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం ప్రధానికి తెలియడం లేదని అనుకుంటున్నాను’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర క్యాబినెట్ సమావేశం సోమవారం విజయవాడలోని సీఎం కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశం ముగిసిన తరువాత ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కేంద్రం తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘కొత్త రాష్ట్రానికి 16వేల కోట్ల రూపాయల ఆర్థిక లోటు ఉందన్న విషయాన్ని పదేపదే ప్రధాని దృష్టికి తీసుకెళితే కేవలం 2800 కోట్ల రూపాయలు ఇచ్చారు. పరిశ్రమలకు రాయితీలు ఇవ్వలేదు. రాజధాని నిర్మాణానికి కేవలం 1350 కోట్ల రూపాయలు మంజూరు చేశారు’ అని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర పరిస్థితి ప్రధానికి తెలియదంటారా? అని విలేఖరులు ప్రశ్నించగా.. ఆయనకు తెలియకుండా జరుగుతోందనే భావిస్తున్నానని చంద్రబాబు అన్నారు. కేంద్రంలో కిందిస్థాయి అధికారులు రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకుండా చేస్తున్నారనే భావనను చంద్రబాబు వ్యక్తం చేశారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్నిబట్టి చూస్తే విభజన చట్టాన్ని ప్రధాని దగ్గర నుంచి కేంద్ర పెద్దలెవ్వరూ సరిగా అర్థం చేసుకోలేదన్న అనుమానం వ్యక్తవౌతోందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టాన్ని ముందుగా చదవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా అక్కర్లేదని కేంద్రం ఫీలర్లు వదులుతున్నా మీరెందుకు వౌనంగా ఉన్నారని విలేఖరులు ప్రశ్నించగా.. ‘ఎవరో మాట్లాడినట్టు నేను కూడా కేంద్రంపై రంకెలు వేయలేను కదా! కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సహకారం ఎంతో ఉంది. దాన్ని రానీయకుండా చేసుకోమంటారా? మీరు కూడా ఆలోచించాలం’టూ విలేఖరులకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. రాష్ట్రానికి కేంద్రం బోలెడన్ని నిధులు ఇస్తున్నా ఇవ్వలేదని ప్రచారం చేస్తున్నారని బిజెపి నాయకులు చేస్తున్న ప్రచారాన్ని ప్రస్తావించగా.. కేంద్రం ఎపికి ప్రత్యేకించి ఏమీ చేయడం లేదన్నారు. అన్ని రాష్ట్రాలతోపాటు మన రాష్ట్రానికి కూడా నిధులు విడుదల చేస్తోందని చెప్పారు. గుజరాత్‌కన్నా ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని మోదీ మీకు సహకరించడం లేదేమో? అని విలేఖరులు ప్రశ్నించగా.. ‘అభివృద్ధి చేయడమే నేను చేసిన తప్పా?’ అని ఎదురు ప్రశ్నించారు. కేంద్రం సహకరించడం లేదనిచెప్పి రాష్ట్ర ప్రజలను వారి కర్మకు వారిని వదిలేయలేను కదా? అని బాబు అన్నారు. తనపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షం ఎప్పుడైనా ఢిల్లీ వెళ్లి హోదా గురించి ప్రధానిని కోరిందా? అని ఆయన ప్రశ్నించారు. ఏదిఏమైనా ప్రత్యేక హోదా కోసం ఇంకా ఎన్నిసార్లైనా కేంద్రం దగ్గరకు వెళతానన్నారు. వారిని ప్రాధేయపడతానని చంద్రబాబు చెప్పారు. హోదా కోరుతూ ప్రధానికి లేఖ రాస్తున్నామని, అప్పటికీ స్పందించకపోతే అఖిలపక్షాన్ని తీసుకెళతానని చంద్రబాబు ఒక ప్రశ్నకు సమాధానంగా వివరించారు.