రాష్ట్రీయం

వాటా వదులుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మే 2: పిడుగులు పడినా, భూకంపాలు వచ్చినా తెలంగాణ వాటా జలాలు వాడుకుని తీరుతామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు విస్పష్టంగా చెప్పారు. సమైక్య రాష్ట్రంలోనే సమైక్య పాలకులు విడుదల చేసిన జీవోల ప్రకారం, అధికారులు అధికారిక లెక్కల ప్రకారమే తెలంగాణకు కేటాయించిన 1300 టిఎంసి పైచిలుకు జలాలను కృష్ణా, గోదావరి నదుల నుంచి వాడుకుంటామని తెగేసి చెప్పారు. ఈ కేటాయింపుల ప్రకారమే ప్రాజెక్టుల నిర్మాణాలు చేపడుతున్నామని, ఇందులో ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మేడిగడ్డ (కాళేశ్వరం) ప్రాజెక్టుకు సోమవారం సిఎం కెసిఆర్ సతీసమేతంగా భూమి పూజ జరిపారు. పునాది రాయి వేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘రామాయణంలో పిడకల వేట’ మాదిరిగా తెలంగాణలో ఒక నాలుక, ఆంధ్రలో మరో నాలుక, మహారాష్టల్రో ఇంకో నాలుక ఉంటుందని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్‌కు ఒక విధానం ఉండాలని హితవు పలికారు. మహారాష్టల్రో ఎందుకు ధర్నాలు చేస్తున్నారో అర్థంకావడం లేదని, అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ధర్నాలు, ఆందోళనలు చేసుకుంటుపోతే ఎక్కడా ఏ ప్రాజెక్టూ పూర్తికాదని, దీన్ని ప్రజలు గ్రహించాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఎవరూ ఆపలేరన్నారు. తెలంగాణ ఏర్పడిందే మా హక్కులు మేం సాధించుకోవడానికి. మా కరవును మేమే తరిమికొట్టడానికి. మా ప్రజలకు సాగు, తాగు నీటి సమస్యలు తీర్చడానికి అన్నారు. అనేక పరిశీలనల అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టామని, ఈ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకు వరప్రదాయిని వంటిదన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్తర తెలంగాణలోని ఏడు జిల్లాలో 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద మూడు బ్యారేజీలు నిర్మిస్తామన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లికి, అక్కడి నుంచి మిడ్ మానేర్‌కు, తర్వాత మెదక్ జిల్లాకు, హైదరాబాద్ వాసులకు తాగునీటి అవసరాలకు నీటిని వినియోగిస్తామని వివరించారు. ఈ ప్రాజెక్టును ఒకటిన్నర ఏడాదిలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని, 15 లేదా 16 మాసాల్లో మాత్రం పంప్‌హౌస్‌ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణలోని బీడు భూములను తడిపి దరిద్య్రాన్ని పారదోలుతామన్నారు. దేవాదుల ప్రాజెక్టు 365 రోజులు పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని, దీంతో 100 టిఎంసిల నీటిని వరంగల్ జిల్లాకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మిడ్ మానేరు నుంచి మల్లన్నసాగర్‌కు నీటిని తరలించడంతో మెదక్ జిల్లా, నల్గొండ జిల్లాలోని ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు, రంగారెడ్డి జిల్లా మేడ్చల్ , హైదరాబాద్ ప్రాంతాలకు సమృద్ధిగా నీటిని అందించనున్నట్టు చెప్పారు. త్వరలోనే మహారాష్ట్ర సిఎంను హైదరాబాద్‌కు ఆహ్వానించి చివరి ఒప్పందం చేసుకుంటామని కెసిఆర్ స్పష్టం చేశారు. తుమ్మడిహట్టి వద్దనున్న ప్రాణహితను వదిలివేయలేదని, దీని ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దీంతో ఆ జిల్లాలోని తాంసీ, బేలా, భైంసా మండలాల్లోని 60 నుంచి 70 వేల ఎకరాలకు సాగు నీరందించే కార్యక్రమం చేస్తామని వివరించారు. దక్షిణ తెలంగాణలో పాలమూరు, దిండి ప్రాజెక్టుతో నల్గొండ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టుతో మొత్తం తెలంగాణ యావత్తూ సాగు, తాగు నీరు అందించే భగీరథ ప్రయత్నం చేస్తున్నామని కెసిఆర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో మంత్రులు కడియం శ్రీహరి, తన్నీరు హరీశ్‌రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటల రాజేందర్, స్పీకర్ మధుసూదనచారి, డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు, ఎమ్మెల్సీలు భానుప్రసాదరావు, నారదాసు లక్ష్మణ్‌రావు, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు పుట్ట మధు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సోమారపు సత్యనారాయణ, బొడిగె శోభ, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, వొడితెల సతీష్‌కుమార్, దాసరి మనోహర్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావులతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

చిత్రం మేడిగడ్డ ప్రాజెక్టు శంకుస్థాపనలో పునాదులు తవ్వుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్