రాష్ట్రీయం

పెండింగ్ పిటిషన్లను వెంటనే పరిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను వెంటనే పరిష్కరించాలని ఎపి శాసనమండలి (కౌన్సిల్) చైర్మన్ డాక్టర్ ఎ.చక్రపాణి కౌన్సిల్ పిటిషన్స్ కమిటీకి సూచించారు. ఎపి కౌన్సిల్ పిటిషన్స్ కమిటీ చైర్మన్‌గా ఎపి కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్ రెడ్డి ఇటీవల నియమితులయ్యారు. ఈ కమిటీ తొలి సమావేశాన్ని కౌన్సిల్ చైర్మన్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలకు సకాలంలో పరిష్కారం కావాలన్న ఉద్దేశంతో సభ్యులు పిటిషన్లు ఇస్తుంటారని తెలిపారు. అటువంటి పిటీషన్లను పిటీషన్స్ కమిటీ పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని ఆయన సూచించారు. కాబట్టి కొత్త కమిటీ జాప్యం చేయకుండా పిటీషన్లను పరిశీలించి, అధ్యయనం చేసి పరిష్కరిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. డిప్యూటీ చైర్మన్ సతీష్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ జాప్యం చేయకుండా పిటీషన్లను పరిష్కరిస్తామని తెలిపారు. ఇలాఉండగా ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్ర ప్రసాద్ చైర్మన్‌గా నియమితులైన పేపర్ లెయిడ్ కమిటీ ప్రాథమిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు పి.చలపతి రావు, మహ్మద్ జానీ తదితరులు పాల్గొన్నారు. ఈ రెండు కమిటీల సమావేశాలలో శాసనమండలి కార్యదర్శి (ఇన్‌చార్జి) కె.సత్యనారాయణ రావు, ఒఎస్‌డి సత్యానందం తదితరులు పాల్గొన్నారు.
సెంట్రల్ వర్శిటీకి
43వేల దరఖాస్తులు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 13: వివాదాలలో మునిగి తేలుతున్నా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ప్రవేశాలకు మాత్రం ఢోకా లేదు. దేశంలోనే ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంగా ఒక దశలో దేశంలోనే నెంబర్‌వన్‌గా ఎదిగిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో వివిధ కోర్సులకు 43,300 దరఖాస్తులు వచ్చాయి. పరీక్షలు మే 30 నుండి జూన్ 5వ తేదీ వరకూ జరుగుతాయని కంట్రోలర్ దేవేష్ నిగం చెప్పారు. అత్యధికంగా తెలంగాణ రాష్ట్రం నుండి 13,649 దరఖాస్తులు వచ్చాయని, వివిధ కోర్సుల్లో చేరేందుకు దేశవ్యాప్తంగా 37 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. మొత్తం దరఖాస్తుల్లో 18,769 మహిళలు, 24,526 మంది పురుషులు దరఖాస్తు చేశారని పేర్కొన్నారు. దరఖాస్తు దారులు తమ హాల్‌టిక్కెట్లను ఈ నెల 15వ తేదీ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
ప్రశాంతంగా ఇసెట్
నేడు తొలి కీ విడుదల
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 13: ఇసెట్ 2016 శుక్రవారం నాడు ప్రశాంతంగా ముగిసింది. 12 విభిన్నమైన బ్రాంచిలలో ప్రవేశానికి 26,970 మందికి హాల్ టిక్కెట్లు జారీ చేయగా, 26,410 మంది పరీక్ష రాశారు. ఇసెట్ పరీక్ష ప్రశ్నపత్రం కోడ్ ఎంపిక కార్యక్రమం ఉదయం ఆరు గంటలకు జెఎన్‌టియులో నిర్వహించారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ టి. పాపిరెడ్డి, జెఎన్‌టియుహెచ్ విసి శైలజా రామయ్యర్, రెక్టార్ ప్రొఫెసర్ ఎన్‌వి రమణారావు, ఇసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్ యాదయ్య, కో కన్వీనర్ ప్రొఫెసర్ ఎస్ తారాకళ్యాణి తదితరులు హాజరయ్యారు. పరీక్ష ఉదయం 10 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరిగింది. తొలి కీ శనివారం విడుదల చేస్తామని, ఏమైనా అభ్యంతరాలుంటే 16వ తేదీలోగా కన్వీనర్‌కు తెలియజేయాలని పాపిరెడ్డి పేర్కొన్నారు. వారం రోజుల్లో తెలంగాణ ఇసెట్ ఫలితాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

15న వైఎస్‌ఆర్ కాంగ్రెస్
జిల్లా సమావేశాలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 13: తెలంగాణ రాష్ట్ర వైఎస్‌ఆర్‌సిపి జిల్లాల స్థాయి సమావేశాలు ఈ నెల 15న జరుగుతాయని ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.శివకుమార్ తెలిపారు. అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ అధ్యక్షతన రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల విస్తత్ర స్థాయి సమావేశం 15వ తేదీ ఉదయం 11 గంటలకు లోటస్‌పాండ్‌లోని పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఆవరణలో జరుగుతుందని ఆయన తెలిపారు. కాగా జిల్లా అధ్యక్షులను ఎంపిక చేసినట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా బొడ్డు సాయినాథ్‌రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా నేడం శాంతికుమార్, మెదక్ అధ్యక్షుడిగా జి.శ్రీధర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ అధ్యక్షుడిగా ఎం.్భగవంత్‌రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వి.అనిల్‌కుమార్‌లను నియమించినట్లు తెలిపారు.

విఐటి బిటెక్ ప్రవేశాలకు
23న రెండో విడత కౌన్సిలింగ్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 13: వేలూరులోని విఐటి యూనివర్శిటీ బి.టెక్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ఈ నెల 23న రెండో విడత కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు విఐటి వర్గాలు తెలిపాయి. తొలి విడత కౌన్సిలింగ్ మే 10 నుంచి 12 వరకు జరిగింది. ఈ నెల 23న రెండో విడతలో భాగంగా 20,001 నుంచి 35 వేల ర్యాంకు వరకు, మే 25న 35001 నుంచి 50 వేల వరకు, మే 30న 50 వేల నుంచి 75 వేల ర్యాంకు వరకు, జూన్ 1న 75,001 నుంచి 99,999 ర్యాంకు వరకు కౌన్సిలింగ్ జరుగుతుందని విఐటి స్పష్టం చేసింది. తొలివిడత కౌన్సిలింగ్‌లో ఎంపికైన అభ్యర్థులకు విఐటి వైస్‌ప్రెసిడెంట్ డాక్టర్ శేఖర్ విశ్వనాథన్, జివి సెల్వం ప్రవేశ లేఖలను అందజేశారు.
బిసి కార్పొరేషన్లకు రూ. 60 కోట్లు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 13: తెలంగాణలో వెనుకబడిన తరగతుల సహాకార ఆర్థిక సంస్థలకు శుక్రవారం రూ. 60 కోట్లు విడుదల చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో బిసి కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు రూ. 40.59 కోట్లు, మత్స్యకారుల సహాకార ఆర్థిక సంస్థకు రూ. 4.51 కోట్లు, జ్యోతిరావ్ పులే బిసి సంక్షేమ గురుకుల విద్యా సంస్థకు రూ. 4.59 కోట్లు, నాయినీ బ్రాహ్మణ సహకార ఆర్థిక సంస్థకు రూ. 5.50 కోట్లు, జ్యోతిరావ్ పులే బిసి సంక్షేమ గురుకుల విద్యా సంస్థకు (ప్రణాళికేతర పద్దు) కింద రూ. 7 కోట్లు విడుదల చేసింది. అలాగే అపద్బంధువు పథకానికి రూ. 7 కోట్లు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

బిజెపి రాష్ట్ర కమిటీ
ఏర్పాటుకు లక్ష్మణ్ కసరత్తు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 13: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ పదవీ బాధ్యతలు స్వీకరించి నెల రోజులు దాటింది. దీంతో ఆయన పార్టీ కొత్త కమిటీ ఏర్పాటుకు కసరత్తు మొదలు పెట్టారు. సంవత్సరాల తరబడి పార్టీ కోసం అంకితమైన భావంతో పని చేస్తున్న నాయకులను, ద్వితీయ శ్రేణి నాయకులను, పార్టీ నిజమైన కార్యకర్తలను గుర్తించి వారికి సరైన పదవులు కట్టబెట్టాలన్న ఉద్దేశ్యంతో ఆయన ఇటీవల జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టారు. 2019లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి తెలంగాణలో బలమైన పార్టీగా తీర్చిదిద్ది అధికారం చేపట్టేలా కృషి చేయాలని ఆయన భావిస్తున్నారు. జిల్లాల్లో పార్టీ కోసం నిరంతరం కష్టపడే వారున్నా, వారికి ఇంత కాలం గుర్తింపు లభించలేదని ఆయన దష్టికి కొంత మంది నాయకులు తీసుకుని వచ్చారు. ఈ మేరకు ఆయన జిల్లా పర్యటనలు కొనసాగిస్తున్నారు. ఈ నెలాఖరులోగా అధ్యయనం పూర్తి చేసి వచ్చే నెలలో పార్టీ కార్యవర్గాన్ని ప్రకటించాలనుకుంటున్నారు. పార్టీలో అందరు నాయకులను కలుపుకుని పోవాలనుకుంటున్నారు. ముఖ్యంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఎమ్మెల్యే రాజా సింగ్, మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్ధన్ రెడ్డి తదితరులతో సమావేశమై వారిని కలుపుకుని పోవాలనుకుంటున్నారు. కార్యవర్గం ఏర్పాటు అంత తేలికైన అంశమేమీ కాదు. కిషన్‌రెడ్డి అధ్యక్షునిగా ఉన్నంత కాలం ఇప్పటి వరకు ఉన్న కార్యవర్గం రద్దు అయ్యింది. కాబట్టి ఇప్పుడు కొత్త కార్యవర్గం ఏర్పాటు కసరత్తును డాక్టర్ లక్ష్మణ్ చేపట్టారు. ఇప్పుడు ఆయనకు ఇదో పరీక్ష వంటిది. బిజెపికి కొత్త రక్తాన్ని ఎక్కిస్తానని ఆయన అధ్యక్షునిగా నియమితలైన సందర్భంగా చెప్పారు. కొత్త రక్తం అంటే కార్యకర్తలను, యువతను, ద్వితీయ శ్రేణి నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేసినట్లయితే పార్టీ కోసం సంవత్సరాల తరబడి పని చేస్తూ సీనియర్లుగా గుర్తింపు పొందిన వారి పరిస్థితి ఏమిటీ? అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి కొత్త, పాత కలయికలతో పార్టీ కార్యవర్గ నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంటుంది. డాక్టర్ లక్ష్మణ్ బిసి కావడంతో, బిసిలకూ అత్యధిక ప్రాధాన్యం లభిస్తుందన్న ఆశతో బిసిలు ఎదురు చూస్తున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆయన అడుగులు వేయాల్సి ఉంది.

తాత్కాలిక సచివాలయంలో
మహిళా కమిషన్ ఆఫీసు
గుంటూరు, మే 13: పెళ్లైన కొద్దిరోజులకే చిన్న చిన్న విషయాలతో నూతన దంపతులు గొడవలు పడి కోర్టులకు వెళ్లి వారి అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. శుక్రవారం వికాస్‌నగర్‌లోని తన కార్యాలయంలో ఆమె విలేఖర్లతో మాట్లాడారు. బాధ్యతలు స్వీకరించిన మూడు నెలల్లోనే ఎంతో మంది మహిళల సమస్యల పరిష్కారానికి కృషిచేశామన్నారు. కొంతమంది వధూవరులు వింతపోకడలకు పోయి కాపురాలు నాశనం చేసుకుంటుంటే, మరికొంత మంది అత్త, తోడికోడళ్లు, ఆస్తివివాదాలతో పచ్చనికాపురాల మధ్య చిచ్చు రగుల్చుకుంటున్నారన్నారు. చిన్న, చిన్న తగాదాలతో మహిళా కమిషన్ సమయాన్ని వృథా చేయరాదన్నారు. ఆస్తి వివాదాలు పరిష్కరించడానికి కోర్టులున్నాయే తప్ప మహిళా కమిషన్ వేదిక కాదన్న విషయాన్ని పిటిషన్‌దారులు గుర్తెరగాలన్నారు.