రాష్ట్రీయం

ఆత్మరక్షణలో టిడిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 14: ప్రత్యేక హోదా అంశంలో అధికార తెలుగుదేశం పార్టీని మిత్రపక్షమైన బిజెపి అడ్డంగా ఇరికించింది. హోదాకోసం ఇంటా బయటా డిమాండ్లు వినిపిస్తున్న టిడిపి చిత్తశుద్ధిని శంకించే రీతిలో బిజెపి జాతీయ కార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇంచార్జి సిద్ధార్థనాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రతిపక్షాలకు బ్రహ్మాస్త్రంగా పరిణమించడంతో, టిడిపి సంకట పరిస్థితి ఎదుర్కొంటోంది. బాబు ఏనాడూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అడగలేదని, లేఖ కూడా రాయలేదని, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టుల గురించి మాత్రమే లేఖలు రాశారని సింగ్ స్వయంగా వెల్లడించటంతో టిడిపి ఇరుకునపడింది. ‘నాకర్థం కాదు. హోదా వస్తే ఏమి వస్తాయండి? హోదా వచ్చిన రాష్ట్రాలకు ఏమి ఒరిగిందండి? అదేమీ సంజీవని కాదు కదా’ అని బాబు స్వయంగా అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను బిజెపిఎల్పీ నేత విష్ణుకుమార్‌రాజు కూడా గుర్తు చేశారు. కేంద్రం ఇచ్చిన లక్షన్నర కోట్ల రూపాయలకు ఖర్చులు చెప్పాలని, ఫిరాయింపులపై ఉన్న దృష్టి.. పెరుగుతున్న ధరలపై పెడితే బాగుంటుందన్న బిజెపి అగ్రనేత సోము వీర్రాజు వ్యాఖ్యలు టిడిపికి పుండుపై కారంలా పరిణమించాయి. బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, పార్ధసారథి తదితర విపక్ష నేతలు ప్రత్యేక హోదాపై బాబుకు చిత్తశుద్ధి లేదన్న విషయం బిజెపి నేతల మాటలతో స్పష్టమయిందని, దానికి బాబు చెప్పాలన్న డిమాండుకు పదును పెడుతున్నారు. రెండు చెంపలు వాయించినా వాస్తవంలోకి రాలేదని, హోదా అడగలేదన్న వాస్తవాన్ని బిజెపి నేత సింగ్ బయటపెట్టారని వైసీపీ సీనియర్ నేత బొత్స టిడిపి అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
ఈ పరిణామాలు టిడిపిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈనెలలో మోదీని కలవనున్న సందర్భంగా బాబు హోదా గురించి గట్టిగా నిలదీస్తారని టిడిపి అనుకూల మీడియాలో గత కొద్దిరోజుల నుంచి కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. బిజెపి నేత సింగ్ చేసిన వ్యాఖ్యలు టిడిపి నాయకత్వాన్ని కంగు తినిపించాయి. అంటే ఇప్పటివరకూ బాబు సహా మంత్రులు, ఎంపిలంతా కేవలం మీడియాలోనే హోదా గురించి హడావిడి చేస్తున్నారు తప్ప, కేంద్రం వద్ద మాట్లాడటం లేదన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయని టిడిపి నేతలు ఆందోళనతో ఉన్నారు.
ఇవన్నీ బిజెపి తమను కావాలని ఇరికించినట్లుగానే టిడిపి నాయకత్వం భావిస్తోంది. అందుకే హోదాపై బిజెపిని లక్ష్యంగా చేసుకుని, గత కొద్దివారాల నుంచి విమర్శలు చేస్తున్న టిడిపి నేతలంతా, ప్రస్తుతం వౌనాన్ని ఆశ్రయిస్తున్నట్లు కనిపిస్తోంది. బిజెపి నేతల అత్యుత్సాహం విపక్షాలకు ఆయుధంగా మారిందనే ఆందోళన టిడిపి నేతల్లో ఎక్కువగా కనిపిస్తోంది.
ఈ విషయంలో టిడిపి, ప్రత్యర్ధుల విమర్శలను ఎలా తిప్పికొట్టాలో తెలియక ఆత్మరక్షణలో పడింది. ఒకవైపు మిత్రపక్షమైన బిజెపి జాతీయ నేత స్వయంగా వెల్లడించిన వాస్తవంతోపాటు, ఆయన వ్యాఖ్యను ఆధారం చేసుకుని వైసీపీ నేతలు చేస్తున్న దాడిని ఎలా ఎదుర్కోవాలోతెలియక తలపట్టుకుంది. హోదాపై సిద్ధార్థనాథ్‌సింగ్ వ్యాఖ్యలు చేసి 24 గంటలయినా, ఇప్పటివరకూ ఒక్క యనమల రామకృష్ణుడు మినహా ఎవరూ వివరణ ఇవ్వకపోవడం విశేషం. ఆయన కూడా రాష్ట్రానికి ఇచ్చిన నిధుల గురించి వివరించారే తప్ప, ప్రత్యేక హోదా గురించి లోతుగా మాట్లాడలేదు. హోదాపై అసెంబ్లీలో తొలి తీర్మానమే చేశామని యనమల చెప్పారు. అయితే, బాబు కేంద్రానికి హోదా గురించి ప్రభుత్వపరంగా లేఖ రాయలేదన్న విమర్శలపై ఆయన స్పందించలేదు. పైగా తాము కేంద్రంతో ఘర్షణ పడమని, సానుకూలంగానే ఉంటూనే నిధులు రాబడతామని చెప్పడాన్నిబట్టి, టిడిపి ఏ స్థాయిలో ఆత్మరక్షణలో పడిందో స్పష్టమవుతోందని రాజకీయ పరిశీలకులు విశే్లషిస్తున్నారు.