రాష్ట్రీయం

పునాదుల్లోనే సమాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 14: గుంటూరు నగరం నడిబొడ్డున లక్ష్మీపురం నాలుగు కూడలిలో బహుళ అంతస్తుల భవనం నిర్మాణ పనుల్లో పెను ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం రాత్రి కార్మికులు పనుల్లో నిమగ్నమైన సమయంలో మట్టిపెళ్లలు విరిగిపడటంతో 8మంది కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారు. శిధిలాల కింద నుంచి తురకా శేషుబాబు (20), సాల్మన్ (22) మృతదేహాలను వెలికితీశారు. మరొకరు ప్రాణాపాయ స్థితిలో గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ఐదుగురిని వెలికితీసేందుకు రక్షణ బలగాలు రంగంలోకి దిగాయి. భవనం అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన చుక్కపల్లి రమేష్ బినామీలదిగా ప్రచారం జరుగుతోంది. తొలుత ప్రశాంత్ అనే కార్మికుడు ప్రమాదంలో చిక్కుకోగా రక్షించేందుకు వెళ్లిన సహచర కార్మికులపై మరోసారి సెల్లార్ మట్టిపెళ్లలు విరిగిపడటంతో వారంతా శిథిలాల కింద చిక్కుకున్నారు. రాత్రి సుమారు 7 గంటల సమయంలో ప్రమాదం సంభవించింది. సమాచారం తెలుసుకున్న కలెక్టర్ కాంతిలాల్ దండే, గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, డిఆర్‌ఒ నాగబాబు, నగరపాలక సంస్థ తదితర పోలీసు అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాత్రి 9.30 గంటల సమయంలో ప్రాణాపాయ స్థితిలోవున్న మరియబాబును శిథిలాల కింద నుంచి సురక్షితంగా బయటకు తీశారు. చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులంతా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన యువకులు. వీరిలో ఐదుగురు విద్యార్థులు కూడా ఉన్నారు. ఇంటర్, డిగ్రీ పరీక్షలు రాసి కుటుంబ పోషణకు కూలి పనులకు వచ్చారు. డిగ్రీ చదువుతున్న వారణాశి సునీల్ (20), ఇంటర్ చదువుతున్న వాసిమళ్ల మరియబాబు (మోషే -18), జొన్నలగడ్డ ప్రశాంత్ (18), బత్తుల రాజేష్ (25), జొన్నలగడ్డ సుధ (41), బత్తుల బబ్లులు శిథిలాల కింద చిక్కుకున్నారు. కాగా మరియబాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సుమారు 30 అడుగులకు పైగా మట్టి తవ్వకాలు జరిపి అందులో కాంక్రీటు పనులు చేస్తున్నారు. పెదగొట్టిపాడు గ్రామానికి చెందిన 18మంది కూలీలు రెండు బృందాలుగా సెల్లార్ పనులు చేస్తున్నారు. యథాప్రకారం ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు మాత్రమే కూలీకి ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే శనివారం సాయంత్రం వరకు ఓటి చేయాల్సిందిగా మేస్ర్తీ రాము కోరడంతో పనులు కొనసాగించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. కాగా అడ్డగోలు అనుమతుల కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని కార్మికుల బంధువులు, దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. అదే సమయంలో సంఘటనా స్థలానికి సందర్శించేందుకు వచ్చిన మంత్రి రావెల కిషోర్‌బాబు కాన్వాయ్‌పై దాడికి దిగారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి చెదరగొట్టారు. కాగా శిథిలాల్లో చిక్కుకున్న సలోమన్‌కు ఈనెల 29న వివాహం నిశ్చయమైంది. సంఘటనా స్థలాన్ని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ తదితరులు సందర్శించి ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి బాధితులకు ప్రభుత్వపరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇలాఉండగా భవన నిర్మాణం జరిగే లక్ష్మీపురం నాలుగు రోడ్ల కూడలిలో ఉద్రిక్తత నెలకొంది. శిథిలాల కింద కూలీల పరిస్థితిపై స్పష్టత లేకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. దీంతో ఎన్‌డిఆర్‌ఎఫ్, అగ్నిమాపక, పోలీసు ప్రత్యేక బలగాలు శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను వెలికితీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కొన ఊపిరితోవున్న కార్మికులను కాపాడేందుకు ఆక్సిజన్ సిలిండర్లను సిద్ధంచేశారు.

chitram మట్టి పెళ్లల కింద నుండి వెలికి తీసిన యువకుడిని వైద్య సహాయం కోసం తరలిస్తున్న దృశ్యం