ఆంధ్రప్రదేశ్‌

హోదాపై హడావుడేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: ‘ప్రత్యేక హోదా కావాలని ప్రధానిని కోరాను’ ‘అయినా హోదా వస్తే ఏం వస్తుందండి? హోదా ఇచ్చి నిధులు ఇవ్వకపోతే ఏం లాభమండి’? ‘హోదా ఇచ్చిన రాష్ట్రాలు ఏమి అభివృద్ధి చెందాయండి’?- ఇవన్నీ ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వేర్వేరు సందర్భాల్లో చేసిన పొంతన లేని వ్యాఖ్యలనుకుంటే, తప్పులో కాలేసినట్లే. ప్రత్యేక హోదాపై ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీడియా సమావేశంలో చేసిన పరస్పర విరుద్ధ వ్యాఖ్యలివి. ఆ అంశంపై ఆయన ఎంత గందరగోళంలో ఉన్నారో ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ప్రత్యేక హోదాపై ప్రధానితో జరిగే భేటీలో తేలిపోతుందంటూ గత వారం నుంచి మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజంగానే ‘తేలిపోయింది’. బాబు కూడా అనేక సందర్భాల్లో మోదీతో జరిగే భేటీలో హోదా గురించి గట్టిగా మాట్లాడతానని చెప్పారు. దానితో సహజంగా అందరిలోనూ ‘హోదా’పై భారీ అంచనాలు పెరిగాయి. అయితే మంగళవారం నాటి భేటీలో బాబు ప్రధానిని మీడియాలో జరిగిన ప్రచారం స్థాయిలో నిలదీసింది లేకపోగా, ఆ అంశంపై ఆయనే గందరగోళంలో పడినట్లు బాబు వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఢిల్లీలో మోదీని కలసిన అనంతరం మీడియాతో మాట్లాడిన బాబు.. హోదా అంశంపై పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేయటం అటు పార్టీ నేతలనూ గందరగోళ పరిచింది. ప్రత్యేక హోదా కావాలని తాను మోదీని అడిగానని చెప్పిన బాబు అంతటితో ఆగితే సరిపోయేది. అయితే, హోదా ఇచ్చినంత మాత్రాన ఏమవుతుంది? తీసుకున్న రాష్ట్రాలు ఏమి బావుకున్నాయి? హోదా ఇచ్చి నిధులివ్వపోతే ఏం చేస్తాం? అనే వ్యాఖ్యలు చేయడంతో అసలు బాబు హోదా గురించి మోదీ దగ్గర ప్రస్తావించారా? లేదా అన్న కొత్త సందేహాలకు తెర లేపారని విపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
పార్లమెంటు సమావేశాల్లో ఎంపి గల్లా జయదేవ్ హోదాపై కేందాన్ని నిలదీశారు. మరొక ఎంపి శివప్రసాద్ అయితే ఏకంగా కుచేలుడు, అంబేద్కర్ వేషధారణలో హోదా డిమాండ్ చేశారు. అంతకుముందు మరొక ఎంపి రాయపాటి సాంబశివరావు హోదా ఇవ్వకపోతే రాష్ట్రంలో బిజెపికి కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఇలా ఒకవైపు హోదాపై తమ పార్టీనేతలే సీరియస్‌గా మాట్లాడుతూ..తాము ఆ అంశంపై పోరాడుతున్నామన్న సంకేతాలు పంపిస్తుంటే, తమ అధినేత మాత్రం హోదాతో ఏం ఒరుగుతుందని, ఇప్పటివరకూ ఆ హోదా తీసుకున్న రాష్ట్రాలకు ఏం ఒరిగిందని వ్యాఖ్యానించడం తమను ఆత్మరక్షణలో పడివేసినట్లేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో వైసీపీ, కాంగ్రెస్ చేసే విమర్శలకు తాము ఏవిధంగా జవాబివ్వాలన్న సందేహంలో పడ్డారు.
హోదా ఇచ్చిన రాష్ట్రాలకు ఏం ఒరిగిందని భావిస్తున్నప్పుడు..ఇక మళ్లీ దాని గురించి ప్రధానితో మాట్లాడాల్సిన పని, మీడియాలో తరచూ ప్రచారం చేయడం ఎందుకన్న కొత్త ప్రశ్నలకు బాబు తెర లేపారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ప్రత్యేక హోదాతోపాటు ప్రత్యేక ప్యాకేజీ కూడా కావాలని, బాబు అనేక సందర్భాల్లో డిమాండ్ చేశారు. అయితే, తాజా భేటీలో తానసలు ప్రత్యేక ప్యాకేజీ గురించే మాట్లాడలేదని, స్వయంగా చెప్పి విపక్షాలకు కొత్త అస్త్రం అందించినట్టయింది. రేపు ప్యాకేజీ గురించి తాము డిమాండ్ చేస్తే, ప్రధాని దగ్గర అడగకుండా ఇక్కడ మాట్లాడుతున్నారని విపక్షాలు తమపై ఎదురుదాడి చేసే ప్రమాదం ఉందని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.
హోదా ఇవ్వకపోతే బిజెపికి కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందని రాయపాటి, జెసి దివాకర్‌రెడ్డి, బుచ్చయ్యచౌదరి వంటి నేతలు ఒకవైపు బహిరంగంగా దునుమాడుతున్నారు. ఈ విషయంలో కూడా బాబులో గందరగోళం స్పష్టంగా కనిపించింది. బిజెపి హోదా ఇవ్వకపోతే ఆ పార్టీకీ కాంగ్రెస్‌కు పడిన శిక్షే పడుతుందా? అన్న ప్రశ్నకు బాబు నుంచి స్పష్టత కొరవడింది. బిజెపితోపాటు అన్ని పార్టీలనూ ఆదుకోవలసిన బాధ్యత ఉందని చెప్పారే తప్ప..తమ పార్టీ నాయకులు ఇప్పటివరకూ ఆ అంశంలో చేస్తున్న ప్రకటనలకు మద్దతుగా మాట్లాడలేకపోయారు.
ఇదిలాఉండగా, ప్రధానితో బాబు ఏయే అంశాలపై మాట్లాడాలనుకున్నారో జాబితాను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ఈ జాబితాలో అన్నీ ఉన్నా, ప్రత్యేక హోదా అంశం మాత్రం లేకపోవడం బట్టి, ఆ అంశంపై బాబు ప్రధానితో ఏ స్థాయిలో మాట్లాడారో అర్ధమవుతోందని, రాజకీయ విశే్లషకులు వ్యాఖ్యానిస్తున్నారు.