రాష్ట్రీయం

ఆర్డీఎస్ పనులు ఆపొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 20: ఒక రాష్ట్ర వ్యవహారాల్లో మరో రాష్ట్రం జోక్యం చేసుకోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అని ఆర్‌డిఎస్ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఆర్‌డిఎస్ పనులు నిలిపివేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోవద్దని పనులు కొనసాగించాలని తెలంగాణ నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు కర్నాటక నీటిపారుదల మంత్రి ఎంబి పాటిల్‌ను కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు ఆర్‌డిఎస్ ఆధునీకరణ పనులను కర్నాటక చేపట్టింది. పనులు నిలిపివేయాలని కర్నూలు కలెక్టర్ కర్నాటక అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు సీరియస్‌గా స్పందించారు.
హరీశ్‌రావు కర్నాటక నీటిపారుదల మంత్రితో మాట్లాడిన తరువాత తెలంగాణ నీటిపారుదల ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్‌కె జోషి, కర్నాటక జల వనరుల ముఖ్య కార్యదర్శి రాకేశ్ సింగ్‌తో మాట్లాడారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఉంటే ఆయా ప్రభుత్వాలు చర్చలు జరుపుకుంటాయని, అంతే కానీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక జిల్లా అధికారులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లేఖలు రాయడం అంటే కర్నాటక వ్యవహారాల్లో అకారణంగా జోక్యం చేసుకోవడమేనని, ఇది రాజ్యాంగ ఉల్లంఘన, మరో రాష్ట్ర అధికారాలను సవాల్ చేయడమేనని కర్నాటక నీటిపారుదల అధికారులతో జోషి అన్నారు. ఈ సమస్యను వర్షాకాలం రాక ముందే పరిష్కరించి పనులు పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలను పట్టించుకోవద్దని, బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం తెలంగాణ వాటా రావలసిందేనని హరీశ్‌రావు అన్నారు. ఆర్‌డిఎస్‌పై గతంలో ఉమ్మడి రాష్ట్రం తీసుకున్న నిర్ణయాలనే అమలు చేస్తున్నామని హరీశ్‌రావు కర్నాటకకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కుట్రపూరిత వైఖరిపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసినట్టు కర్నాటకకు హరీశ్‌రావు తెలిపారు.
రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ అనకట్ట ఎత్తు పెంపునకు కర్నాటక ప్రభుత్వం ప్రారంభించిన పనులను కర్నూలు జిల్లా అధికార యంత్రాంగం కర్నాటక రాష్ట్రంలోని రాయచూరు అధికారులకు లేఖలు రాసి పనులు నిలిపివేయించారు. ఈ విషయాన్ని కర్నాటక సాగునీటి అధికారులు మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకు వచ్చారు. ఎంతో కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ పనులు ప్రారంభించేందుకు హరీశ్‌రావు కర్నాటకతో చర్చలు ప్రారంభించారు. చర్చలు ఫలించి పనులు ప్రారంభం అయ్యాక కర్నూలు అధికారులు నిలిపివేయించారు. ఈ అంశంపై చర్చించుకుందామని ఏడుసార్లు ఏపి మంత్రి దేవినేని ఉమకు ఫోన్ చేసినా ఆయన చర్చలకు ముందుకు రావడం లేదని హరీశ్‌రావు తెలిపారు. ఏపి ప్రభుత్వం అనుమతించేంత వరకు పనులు నిలిపివేయాలని ఆర్‌డిస్ వద్ద కర్నాటక అధికారులను, కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని అధికారులు తెలిపారు.