రాష్ట్రీయం

2వేల కోట్లివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: ‘కరవుతో అల్లాడుతున్నాం. తక్షణం రెండు వేల కోట్లు సాయం చేయండి’ అంటూ సిఎం చంద్రబాబు కేంద్ర బృందాలను కోరారు. రెండు మూడేళ్లలో పూర్తిస్థాయి కరవురహిత రాష్ట్రంగా మార్చేందుకు ఆంధ్రను ఒక నమూనాగా తీసుకోవాలని సూచించారు. దేశంలో కరవును ఎదుర్కోనే రాష్ట్రాలకు ఉపశమనం కలిగించేలా శాశ్వత పరిష్కార మార్గాలు అనే్వషించాలని సూచించారు. రాష్ట్రంలోని 670 మండలాల్లో 399 మండలాలు వర్షాభావ పరిస్థితులతో బీడు భూములుగా మారాయని నివేదించారు. కరవు పరిస్థితులపై అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక ఇచ్చేందుకు వచ్చిన అంతర మంత్రిత్వ శాఖల బృందాలతో సిఎం శుక్రవరం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరవు పరిస్థితులను సిఎం వారికి వివరించారు. కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు రుతుపవనాలతో ఆ ప్రభావం కనిపించలేదని, భూగర్భ జలాలు అడుగంటి దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కోవల్సి వచ్చిందన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 10 జిల్లాల్లో దాదాపు 5 లక్షల హెక్టార్లలో విత్తనాలునాటే పరిస్థితి లేదన్నారు. నైరుతి రుతుపవనాలు మందగమనం ప్రభావం ఈసారి ఖరీఫ్‌పై బాగా కనిపించిందన్నారు.
ఈ సీజన్‌లో సాధారణ వర్షపాతం నమోదు 168 మీమీ ఉండగా, 71.1 మిమీ వర్షపాతం నమోదైందన్నారు. ఫలితంగా భూగర్భ జలాల మట్టం నికరంగా 1.53 మీటర్లకు పడిపోయిందన్నారు. ప్రతికూల పరిస్థితుల కారణంగా మొత్తం 13 జిల్లాల్లో 359 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించినట్టు చెప్పారు. గత పదేళ్లుగా వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, సాగునీటి రంగాన్ని ఇష్టానికి వాడుకున్నారని, కరవును ఎదుర్కోవడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని తెలిపారు. రాయలసీమలో బోరు వేయాలంటే 1500 అడుగుల లోతు వరకూ తవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఫలితంగా సేద్యం పెనుభారంగా మారిందని, పాలకులు ముందుచూపు లేకుండా వ్యవహరించారని, సీమలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నీరు చెట్టు, పొలం పిలుస్తోంది పేరిట కార్యక్రమాలు ఆరంభించామని, ఈ వర్షాలకు అవి సత్ఫలితాలు ఇవ్వడం ప్రారంభించాయన్నారు. నదుల అనుసంధానం, భూగర్భ జలాల పెంపు, సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికపై పూర్తిచేయడం వంటి చర్యలు తీసుకున్నామన్నారు. రెయిన్‌గన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ నిర్మాణం, ఫామ్ పాండ్స్, బిందు- తుంపర సేద్యం, ఫిజియో మీటర్ల ఏర్పాటువంటి వినూత్న విధానాలను అనుసరిస్తున్నామన్నారు. ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేయించామన్నారు. రైతులకు 50 శాతం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేసి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించామని వివరించారు. 150 రోజులకు పని దినాలను పెంచి ఉపాధి కల్పించామని, ప్రజా పంపిణీ ద్వారా వంట నూనెలు, పప్పుదినుసులు ధరలను తగ్గించి అందించామని పేర్కొన్నారు. గ్రామీణ నీటి సరఫరాకు 56.36 కోట్లు, పట్టణ నీటి సరఫరాకు 40 కోట్లు, పశుగణాభివృద్ధికి 16 కోట్లు కలిపి మొత్తంగా 102 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. కరవు, దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొనేందుకు 2వేల కోట్లకు పైగా సాయం అందించాలని ఆయన కేంద్ర బృందాలను కోరారు. రాష్ట్ర ప్రభుత్వంపై 343.34 కోట్ల రూపాయిల భారం పడిందని వివరించారు. నీతిఆయోగ్, ఆర్ధిక శాఖ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, గ్రామీణాభివృద్ధి, ఇంధనశాఖ, జలవనరుల శాఖలకు చెందిన అధికారులు కేంద్ర బృందాల్లో ఉన్నారు. తొలి బృందానికి షకీల్ అహ్మద్, రెండో బృందానికి బిసి బెహరా, మూడో బృందానికి అఖిలేష్ కమాల్ నేతృత్వం వహించారు.

చిత్రం... కేంద్ర బృందాలతో సమావేశమైన సిఎం చంద్రబాబు