రాష్ట్రీయం

మహానాడుకు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 26: తెలుగుదేశం పార్టీ జాతీయ హోదా సాధనకు సిద్ధమవుతున్న తరుణంలో తొలిసారిగా తిరుపతి పుణ్యక్షేత్రంలోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు జరుగనున్న మహానాడుకు సర్వం సిద్ధమైంది. మహానాడు నిర్వహణకు ఏర్పాటైన 15 కమిటీలు అన్ని రకాల ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు. దాదాపు 28 అంశాలపై ఈ మహానాడులో చర్చ చేయనున్నారు. ఎక్కడా లోటు జరగకుండా చూడాలన్న తపన స్థానిక నేతల్లో విస్పష్టంగా కనిపిస్తోంది. కేవలం వారం వ్యవధిలోనే మహానాడుకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేశారు. గురువారం చిన్నచిన్న పనులు ఉన్నా వాటిని పూర్తి చేశారు. తుది ఏర్పాట్లను పార్టీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ గురువారం పరిశీలించారు. మార్పులు, చేర్పులను నాయకులకు సూచించారు. విఐపిలు ఆసీసునులయ్యే ప్రధాన వేదిక ఏర్పాటుకు సంబంధించి లోకేష్ పలు జాగ్రత్తలు చెప్పారు. సుమారు 4గంటల పాటు లోకేష్ సభాప్రాంగణంలోని ప్రతి ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. ఎక్కడికక్కడ తనకున్న అనుమానాలను నాయకులను అడిగి నివృత్తి చేసుకున్నారు. ఉదయం నుంచి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి సొంత వాహనాల్లో కార్యకర్తలు, నాయకులు తిరుపతికి చేరుకుని ప్రాంగణాన్ని సందర్శించారు. అలంకరణ విషయాన్ని పరిశీలిస్తే తిరుపతి నగరం పూర్తిగా పసుపు మయంగా మారింది. రోడ్లుకు ఇరువైపులా నేతలు పెట్టిన కటౌట్లు బారులు తీరి కనిపించాయి. ముఖ్యంగా నారా లోకేష్ బాబును బాహుబలి తరహాలో రూపొందించిన కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతి, నారావారి పల్లి, మహానాడు ప్రాంగణానికి వెళ్లే అన్ని మార్గాలు పసుపుమయంగా మారాయి. వేసవి ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటంతో మహానాడుకు విచ్చేసే కార్యకర్తలు, నాయకులకు అవసరమైన మంచినీటి బాటిళ్లను గురువారం నాటికే ప్రాంగణం ప్రాంతానికి చేర్చారు. గురువారం రాత్రి నుంచే వంటకాలకు ముడి సరుకులు సిద్ధం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం అల్పాహారం సిద్ధమయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భోజనాల ఏర్పాటు కమిటీ కన్వీనర్, ఎంపి మాగంటి బాబు, చైర్మన్ మాజీ మంత్రి గల్లా అరుణకుమారి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇక టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కళావెంకట్రావు ఆధ్వర్యంలో మహానాడు ఏర్పాట్లను పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్సీ జనార్థన్ రాజు, మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మీడియా కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ గాలిముద్దు కృష్ణమనాయుడు, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు గురువారం తుది ఏర్పాట్లుకు సంబంధించి మరోమారు సమీక్షించుకున్నారు. కాగా సిఎం తోపాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున వస్తుండటంతో పోలీసులుకు భద్రత ఏర్పాట్లు ఒక సవాలుగా మారాయి. ఈ నేపథ్యంలో అనంతపురం డిఐజి ప్రభాకర్ రావు, ఎస్పీలు జయలక్ష్మి, శ్రీనివాసులు తుది భద్రతా ఏర్పాట్లను పరిశీలించి సమీక్షిస్తున్నారు. ఇటు మీడియాకాని, అటు టిడిపి నేతలు కాని నిబంధనల లక్ష్మణ రేఖను అతిక్రమించకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు. 3500 మంది వివిధ హోదాల్లో ఉన్న పోలీసులను మహానాడు భద్రతకు వినియోగిస్తున్నారు. రెండు రోజులకు ముందే వివిధ ప్రాంతాల నుంచి పోలీసులను రప్పించి వారు చేపట్టాల్సిన విధివిధానాలను ఉన్నతాధికారులు స్పష్టంగా తెలిపారు. అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం పట్ట ఏమాత్రం అశ్రద్ధ చూపినా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూం ద్వారా పర్యవేక్షిస్తున్నారు. వేదికపై ఎవరెవరు ఆశీసులవుతారో జాబితాను సిద్ధం చేశారు.

chitram తిరుపతిలోని మహానాడు సభాప్రాంగణాన్ని స్వయంగా పరిశీలిస్తున్న లోకేష్