రాష్ట్రీయం

మహా దోపిడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 31: అసలు పంట లేకుండానే భారీ దిగుబడులు సాధించాలంటే పశ్చిమగోదావరికి రావాల్సిందే. ఆశ్చర్యంగా ఉన్నా గత రెండు, మూడు సీజన్లుగా ఇలాంటి దిగుబడులే కనిపిస్తున్నాయి మరి. దానికి ప్రభుత్వం మద్దతు ధర కూడా చెల్లిస్తుండటం మరింత విడ్డూరం. విచిత్రంగా అనిపిస్తున్నా.. మిల్లర్లు, కొంతమంది సివిల్ సప్లయిస్ అధికారులు సిండికేట్‌గా మారి చేస్తున్న మహాదోపిడికి ఇదొక రాజమార్గం. అవును.. వాస్తవానికి కృష్ణాడెల్టా శివారునున్న పశ్చిమ పరిధిలోని కృష్ణా ఆయకట్టులో మూడొంతులకుపైగా నీరు లేక అసలు వరిసాగే చేపట్టలేదు. అయినా ఇసుక నుంచి తైలం తీసినట్లు నీళ్లు రాని, పంట వేయని ప్రాంతాల్లో కూడా ఈ సిండికేట్ భారీ ధాన్యం దిగుబడులను చూపించగలిగింది. దీంతోపాటు మిల్లర్ల నుంచి కొంతమంది సివిల్ సప్లయిస్ అధికారులు చూపుతున్న చేతివాటం కూడా కోట్లలోనే మిగులుస్తోందని తేటతెల్లమవుతోంది. ఇంతకీ ఈ మహాదోపిడి తీరుతెన్నూ చూస్తే ఇలా ఉంటుంది. రాష్ట్రానికి రైస్‌బౌల్‌గా పేరొందిన పశ్చిమగోదావరి జిల్లాలో ధాన్యం చుట్టూ కోట్ల రూపాయల దోపిడీ గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతోంది. అటు మిల్లర్లు, ఇటు అధికారులు కూడా ఈ వ్యవహారంలో తమ వాటాలు సొంతం చేసుకోవడానికి పూర్తిస్థాయిలో పాత్రధారులయ్యారు. ఇప్పటికే చాలావరకు ఈ వ్యవహారాలు ముందుకు వెళ్లాయి. అధికారుల వసూళ్లు ఒక రకంగా ఉంటే ఆ పేరు చెప్పి ఎలాగూ ఇస్తున్నామన్న ధైర్యంతో మిల్లర్లు చేస్తున్న దోపిడీ మరో రకంగా తయారైంది. ఇంతకుముందు కూడా ఇలాంటి వ్యవహారాలు వెలుగుచూసినా వాటిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు, విచారణ లేకపోవడంతో ఈసారి మరింత పటిష్ఠంగా ఈ వ్యవహారాలను ముందుకు తీసుకువెళ్లడానికి రంగం సిద్ధమైందని చెప్పాలి. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధానమైన పంట వరి. ప్రతీ సీజన్‌లో లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుంటుంది. ఈ స్థాయిలో ధాన్యం దిగుబడులను మిల్లర్లు కొనుగోలుచేసి, మిల్లింగ్‌చేసి, భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ)కు లెవీగా అందించేవారు. ఆ తరువాత ఈ విధానం దూరం కావడంతో కనీస మద్దతు ధర రైతాంగానికి అందడానికి రాష్ట్ర ప్రభుత్వం ఐకెపి కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలుచేసి, దాన్ని మిల్లర్ల ద్వారా మిల్లింగ్ చేయించి తీసుకుని, ప్రజాపంపిణీ వ్యవస్థకు ఉపయోగించుకుంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో ఎక్కడ క్వింటాలు ధాన్యం కొనుగోలు చేసినా దానికి సంబంధించి కనీసం 10 రూపాయ లనైనా సంబంధిత అధికారులకు చెల్లించాలన్న అనధికారిక నిబంధన అమలవుతోంది. ఈ మొత్తం చాలా చిన్నగానే కనిపించినా జిల్లాలో వచ్చే దిగుబడి, వాటి కొనుగోళ్లను పరిగణనలోకి తీసుకుంటే ఈ సీజన్‌లోనే దాదాపు 10 నుంచి 12 కోట్ల రూపాయల మేరకు చేతులు మారతాయన్న అంచనా. ఇంతకుముందు కూడా ఇలాంటి విధానం అమలులోవున్నా ఈసారి మాత్రం మరింత పటిష్ఠంగా అమలవుతున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి గత ఏడాది ముందు వరకు జిల్లాలో రైస్‌మిల్లర్ల వ్యవస్థ ఐకమత్యంగా, బలోపేతంగా కొనసాగుతూ వచ్చేది. దీనితో అప్పటివరకు సంబంధిత అధికారులతో కచ్చితంగా మాట్లాడుకుని క్వింటాలుకు ఎంత అన్న అంశాన్ని గంపగుత్తగా ఆ మేరకు చెల్లింపులు చేస్తూ వచ్చేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. అనుకున్న మొత్తాన్ని అధికారులతో ఒప్పంచగలిగే సామర్థ్యాన్ని మిల్లర్ల వ్యవస్థ కోల్పోయిందన్న ప్రచారం కూడా ఉంది. ఆ విధంగానే ఈసారి క్వింటాలుకు 10 రూపాయల చొప్పున కచ్చితంగా చెల్లించాలని ముందుగానే అనధికారిక శ్రీముఖాలు జారీ అయినట్లు తెలుస్తోంది. దీనికి తగ్గట్టుగానే చెల్లింపులు కూడా భారీగానే ముందుకు సాగుతున్నట్లు ప్రచారం. ఇక దీన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది మిల్లర్లు పెద్ద ఎత్తున అక్రమాలకు తెగబడుతున్నారు. ఈసారి మరింత జోరుగా అమలు చేసేందుకు కొందరు అస్మదీయులైన మిల్లర్లు సిద్ధమయ్యారు. వాస్తవానికి ఐకెపి కేంద్రాల ద్వారా ప్రభుత్వమే నేరుగా మద్దతు ధరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేయడం తెలిసిందే. ఆ విధంగా చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగిస్తుంటారు. కొన్ని చోట్ల అస్మదీయులైన మిల్లర్లు ఆయా ఐకెపి కేంద్రాల్లో ఫలానా రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసినట్లు రికార్డులు సిద్ధం చేస్తున్నారు. ఆ రకంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని తీసుకుని, మిల్లింగ్ చేసినట్లు తమ రికార్డుల్లో చూపుతున్నారు. యథాప్రకారం ఆ రైతులకు ప్రభుత్వం నుంచి కనీస మద్దతు ధర మేరకు బ్యాంకుల్లో చెల్లింపులు జరుగుతుంటాయి. అయితే వాస్తవంగా ఆ కేంద్రాల్లో ఆ పేరున్న రైతులు ధాన్యం అమ్మకపోయినా, అసలు వారు రైతులే కాకపోయినా వారి పేరుతో వ్యవహారాన్ని నడిపించేస్తారు. ఇక మిల్లింగ్ చేసిన బియ్యాన్ని అందించే సమయంలో మొత్తం గోల్‌మాల్ అంతా జరిగిపోతుంది. రైతుల పేరుతో సృష్టించిన ధాన్యం మొత్తానికి సరిపడా రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు డీలర్ల నుండి కొనుగోలుచేసి, వాటికి మెరుగుపెట్టి ప్రభుత్వానికి అప్పగిస్తుంటారు. దీనివలన మిల్లర్లు భారీగా లాభపడుతుండగా, మరోవైపు ప్రభుత్వ ఖజానాకూ భారీగానే గండిపడుతోంది. సాధారణంగా ధాన్యం కొని, మిల్లింగ్ చేసి బియ్యాన్ని అందిస్తే మిల్లర్లకు లారీకి 10 వేల నుంచి 15 వేల రూపాయల వరకు మిగులుతుందన్న అంచనా ఉంది. అయితే దానికి బదులు రేషన్ బియ్యాన్ని మెరుగుపెట్టి అందజేస్తే మిల్లర్లకు లారీకి లక్ష రూపాయలకుపైగా మిగిలే పరిస్థితి ఉంది. దీంతో రెండవ విధానానే్న ఇప్పుడు ఎక్కువమంది అమ లు చేస్తున్నారు. ఈ విధంగా అటు మిల్లర్లు, ఇటు సంబంధిత అధికారులు కూడా ఈ కొనుగోళ్ల సీజన్‌లో కోట్ల రూపాయల మేర లాభపడుతున్నట్లు సమాచారం. అయితే ఈసారైనా ఇలాంటి వ్యవహారాలకు ఏ మేరకు తెరపడుతుందన్నది వేచి చూడాలి.