రాష్ట్రీయం

లోకేష్‌కు లైన్ క్లియర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 4: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్‌కు రూట్ క్లియరయింది. లోకేష్ చేరికపై బాబు పరోక్షంగా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఇక ఆయన క్యాబినెట్‌లో చేరడమే తరువాయి అని పార్టీ నేతలు చెబుతున్నారు. గత రెండు రోజుల నుంచి బాబు వివిధ చానెళ్లు, పత్రికలకు ఇంటర్వ్యూలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఆ సందర్భంగా లోకేష్ రాజకీయ భవితవ్యం గురించి ప్రశ్నలు అడిగినప్పుడు ఇంకా సమయం ఉంది కదా? మీకు తెలియకుండా చేయనుకదా? అని వ్యాఖ్యానిస్తూ వచ్చారు. కానీ ‘ఆంధ్రభూమి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం లోకేష్‌ను మంత్రిగా చూడటంలో తప్పేమిటి? అతను పార్టీ కోసం కష్టపడుతున్నాడు. కార్యకర్తల సంక్షేమం కోసం పనిచేస్తున్నాడు అని వ్యాఖ్యానించారు. దానితో వచ్చే మంత్రివర్గ విస్తరణలో లోకేష్‌కు చోటు ఖాయమని స్పష్టమయిపోయింది. నిజానికి లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని గంటా శ్రీనివాసరావు, పత్తిపాటి పుల్లారావు, పల్లె రఘునాధరెడ్డి, పయ్యావుల కేశవ్, ఎంపి గరికపాటి మోహన్‌రావు వంటి ప్రముఖులుగా చాలాకాలం నుంచీ డిమాండ్ చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి అయితే నేరుగానే మాట్లాడారు. లోకేష్‌కు మరిన్ని బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పరోక్షంగా మంత్రి పదవి ఇవ్వాలని బాబు సమక్షంలోనే సూచించారు. గత రెండేళ్ల నుంచి లోకేష్ ఇటు పార్టీ కార్యకలాపాల్లోనూ, అటు ప్రభుత్వంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకునే విషయంలో కూడా క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. ఆ సందర్భంగా జిల్లా నాయకులు, వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ నాయకులను పిలిపించి, ముందు వారితో మాట్లాడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు చేరినప్పటికీ, మీ ప్రాధాన్యం ఎట్టి పరిస్థితిలోనూ తగ్గదని భరోసా ఇస్తున్నారు. ఆ తర్వాత వారిని బాబు వద్దకు పంపిస్తున్నారు. అంటే ముందుగా రంగం సిద్ధం చేసి, తర్వాత చేరికలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నారన్నమాట. ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా లోకేష్ చురుకుగా వ్యవహరిస్తున్నారు. మంత్రులకు దిశానిర్దేశం చేస్తున్నారు. తన వద్దకు వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల మంత్రులకు పంపిస్తున్నారు. పార్టీకోసం పనిచేసిన వారికి వివిధ కాంట్రాక్టులు, ఇతర వ్యవహారాలను కూడా ఆయనే పర్యవేక్షిస్తున్నారు. టిజి వెంకటేష్‌కు రాజ్యసభ ఇవ్వడంలో లోకేష్ ప్రముఖ పాత్ర పోషించారు.
ఇదిలాఉండగా, లోకేష్ ఇప్పటినుంచే తన సొంత టీమ్‌ను తయారుచేసుకుంటున్నారు. సీనియర్ల ప్రాధాన్యతను క్రమంగా తగ్గించి, వారి తనయులు, యువ నేతలతో కొత్త బృందాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పూర్తిగా యువకులతో నింపి, సీనియర్లకు విశ్రాంతి ఇవ్వడం లేదా కౌన్సిల్‌కు, రాజ్యసభకు పంపించాలన్నది అసలు లక్ష్యమంటున్నారు. దానితో సీనియర్లు గత కొద్దికాలం నుంచి లోకేష్ వ్యవహారశైలిపై అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీనియర్లతో వయసు రీత్యా ఉన్న అంతరం, ఆలోచనలో ఉన్న వ్యత్యాసం, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని, లోకేష్ కొత్త టీమును ఎంచుకున్నట్లు విశే్లషిస్తున్నారు.
లోకేష్ అనుసరిస్తున్న అపాయింట్‌మెంట్ వ్యవస్థపై ఉన్న విమర్శలను పరిగణనలోకి తీసుకుని, కార్యాలయ వ్యవస్థను కార్యకర్తలకు అందుబాటులోకి తీసుకువస్తే, ఇంకా మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా చంద్రబాబునాయుడుతో సాన్నిహిత్యం ఉన్న సీనియర్లు కూడా, లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
చిన్న వయసులోనే ఈ విధానం అనుసరించడం మంచిది కాదని, కేటీఆర్ వద్దకు ఏ ఎమ్మెల్యే వెళ్లినా ఆయన వారిని సాదరంగా ఆహ్వానించి యాంటీరూమ్‌కు తీసుకువెళ్లి, మళ్లీ వెళ్లేముందు స్వయంగా సాగనంపే విధానాన్ని గుర్తు చేస్తున్నారు.
పార్టీకి టెక్నాలజీని అద్దిన లోకేష్ ఇంకా ప్రజల్లోకి చొచ్చుకువెళ్లాల్సిన అవసరం ఉందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రజల అవసరాలు, కార్యకర్తల అభిప్రాయాలను సర్వేల ద్వారా తెలుసుకునే బదులు,ప్రత్యక్షంగా బరిలోకి దిగితేనే క్షేత్రస్థాయి వాస్తవాలు బయటటపడతాయంటున్నారు.
చంద్రబాబునాయుడు కాలేజీ రాజకీయాల నుంచి ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డారని, అయితే లోకేష్‌కు ఇప్పుడు ఆ అవసరం లేకపోయినప్పటికీ, ప్రజల పల్స్ తెలుసుకోవాలంటే వారి వద్దకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.