రాష్ట్రీయం

ఫీజుల బరువు.. అద్దెల దరువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరలింపు తిప్పలు-2

విజయవాడ, జూన్ 6: హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలివచ్చే ఉద్యోగులు తమ పిల్లల కోసం భారీగా డొనేషన్లు, ఫీజులు చెల్లించేందుకు సిద్ధపడాల్సిందే! హైదరాబాద్ నుంచి వచ్చే హెచ్‌ఓడి, సెక్రటేరియట్ ఉద్యోగుల పిల్లలకు విధిగా సీట్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను డిఇఓ అమలుచేయాలనుకున్నా.. ప్రైవేటు విద్యాసంస్థలు వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక్కడి విద్యార్థులకు ఏవిధంగా డొనేషన్లు వసూలు చేస్తున్నామో, హైదరాబాద్ నుంచి వచ్చే విద్యార్థులు కూడా అలా చెల్లించాల్సిందేనని వాటి యాజమాన్యం చెబుతోంది. విజయవాడలోని నాలుగు పేరెన్నికగన్న స్కూళ్ల లో తమ పిల్లలను చేర్చాలని హైదరాబాద్ ఉద్యోగులు ప్రయత్నించగా వేల రూపాయల్లో డొనేషన్లు అడిగినట్టు హెచ్‌ఓడి సంఘ నాయకులు చెప్పారు. ఈవిషయమై నగరంలోని ఓ ప్రముఖ స్కూల్ యాజమాన్యాన్ని వివరణ కోరగా.. స్థానిక విద్యార్థులకు డొనేషన్లు ఏవిధంగా తీసుకుంటున్నామో, హైదరాబాద్ నుంచి వచ్చే వారికి కూడా తీసుకోక తప్పదన్నారు. ప్రభుత్వ శాఖల నుంచి లేఖలు తీసుకొస్తే ఫీజుల్లో కొంత రాయితీ మాత్రం ఇవ్వగలుగుతామని చెపుతున్నారు.
ఉద్యోగుల ‘ససేమిరా’కు కారణం?
హైదరాబాద్ సెక్రటేరియట్‌లో పనిచేసే ఉద్యోగుల్లో దాదాపు 50 శాతం మంది సొంత ఇళ్లలో ఉంటున్నవారే. మిగిలిన ఉద్యోగులు కూడా నగరానికి శివారు ప్రాంతాల్లో 7 నుంచి 8 వేల రూపాయల అద్దె చెల్లించి అన్ని వసతులతో కూడిన ఇళ్లలో ఉంటున్నారు. సొంత ఇళ్లు ఉన్న ఉద్యోగుల్లో భార్య, భర్త ఇద్దరూ ఉద్యోగులైన కుటుంబాలు మరో 20 నుంచి 30 శాతం ఉన్నాయి. సొంత ఇళ్లను, ఒంటరిగా విజయవాడ రావానుకున్న వారికి కష్టాలు మొదలవుతున్నాయి. సాధారణంగా పిల్లలు తల్లులతోనే ఉండాలనుకుంటారు. దీంతో మహిళా ఉద్యోగులు తమ వెంట పిల్లలను కూడా తీసుకురావాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లో సొంత ఇల్లు వదులుకుని ఇక్కడ 12 నుంచి 15 వేల రూపాయల అద్దె చెల్లించడానికి ఎవ్వరూ సుముఖంగా లేరు. ఇద్దరు, ముగ్గురు మగ ఉద్యోగులు కలిసి ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నా ఒక్కొక్కరికి 4 నుంచి 5 వేల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. దీనికితోడు సాదర ఖర్చులు మరో 10 వేల రూపాయల వరకూ ఉంటాయి. దీనివల్ల తాము నష్టపోతామని ఉద్యోగులే చెపుతున్నారు.
అడ్వాన్స్‌లు తిరిగి ఇచ్చేస్తూ..!
ఇదిలావుంటే సెక్రటేరియట్‌కు సమీపంలోని తుళ్లూరు, మందడం, తాడికొండ, ఉండవల్లి ప్రాంతాల్లో చాలావరకూ అపార్ట్‌మెంట్లు నిర్మించారు. కేవలం సెక్రటేరియట్ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని వీటిని నిర్మించారు. కొందరు ఉద్యోగులు రెండు నెలల క్రితం ఇక్కడికి వచ్చి ఇళ్లకు అడ్వాన్స్‌లు చెల్లించారు. ఈ నెలలో గృహప్రవేశం చేస్తామని చెప్పడానికి వస్తే, ఆయా ఇళ్ల యజమానులు అడ్వాన్స్‌లను తిరిగి ఇచ్చేసినట్టు కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. ఇక అద్దెల విషయంలో యజమానులు ఏమాత్రం తగ్గడం లేదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినా కనీసం ఒక్క ఇంటి యజమానైనా అద్దెను తగ్గించకపోవడం గమనార్హం.
వచ్చేది 1800 మందే!
భారీస్థాయిలో తాత్కాలిక సెక్రటేరియట్‌ను నిర్మిస్తున్నారు. అయితే మొత్తమీద ఇక్కడికి వచ్చేది కేవలం 1800 మంది శాశ్వత, 800 మంది తాత్కాలిక ఉద్యోగులు మాత్రమే! మరి ఇప్పటివరకూ తొలివిడత 3వేల మంది ఉద్యోగులు వస్తారని ప్రభుత్వం ఏ లెక్కన చెప్పిందో అర్థం కావడం లేదు. ఈ 1800 మంది ఉద్యోగులు కూడా జూన్ 27 నుంచి ఆగస్ట్ 31లోగా వస్తారట. అసలు విషయం తెలిస్తే సెక్రటేరియట్ ఉద్యోగుల కోసం హోరాహోరీగా అపార్ట్‌మెంట్లు నిర్మించే యాజమాన్యాల గతి ఏమైపోతుందో అంతుబట్టటం లేదు.
స్వరం మార్చిన నాయకులు
ఉద్యోగుల పరిస్థితిపై సెక్రటేరియట్ ఉద్యోగ సంఘ నాయకుడు మురళీకృష్ణ మాట్లాడుతూ ఇబ్బందులుంటాయని తెలిసే ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరామని అన్నారు.ప్రభుత్వం ఇప్పటికే 30 శాతం హెచ్‌ఆర్‌ఏ, ఐదురోజుల పనిదినాలు, తరలి రావడానికి మూడు రోజులు సెలవులు ఇచ్చిందన్నారు. ఇళ్లు, స్కూళ్ల విషయాల్లో కూడా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటే ఎలా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో సెక్రటేరియట్‌కు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వారు ఉన్నారు కదా! అని మురళీకృష్ణ ఉదహరించారు.

చిత్రం తుళ్లూరులో అద్దెల కోసం భారీగా సాగుతున్న ఇళ్ల నిర్మాణాలు