రాష్ట్రీయం

కోదండపై ముప్పేట దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ హైదరాబాద్, జూన్ 6:తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ జెఎసి, టిఆర్‌ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది.ఇక అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధం అన్నట్టుగా ఇరు వర్గాలు మాటల దాడిని ప్రారంభించాయి. తెలంగాణ విద్యావంతుల వేదిక సమావేశంలో కెసిఆర్ పాలనను విమర్శిస్తూ టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ చేసిన విమర్శలపై టిఆర్‌ఎస్ మంత్రులు, ఎంపిలు తీవ్ర స్వరంతో స్పందించారు. ఢిల్లీలో ఎంపిలు,హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి మంత్రులు ఒకేసారి కోదండరామ్‌పై ధ్వజమెత్తారు.
తెలంగాణ ఆవిర్భవించిన తరువాత రెండేళ్ల కాలంలో ఆశించిన లక్ష్యాలను ప్రభుత్వం నెరవేర్చలేదని, రైతుల ఆత్మహత్యలు నివారించలేకపోయిందని కోదండరామ్ చేసిన విమర్శలపై టిఆర్‌ఎస్ మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపిలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న రాజకీయ పార్టీలు అన్నీ ఉద్యమ కాలంలో జెఎసిలో ఉన్నాయని, తెలంగాణ ఏర్పడిన తరువాత జెఎసిలో ఒక్క పార్టీ కూడా లేదని మంత్రులు గుర్తు చేశారు. జెఎసిలో ఏ పార్టీలు ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటు లక్ష్యంతో టిజెఎసి ఏర్పడింది, తెలంగాణ ఏర్పడగానే టిజెఎసి రద్దయినట్టేనని మంత్రులు లక్ష్మారెడ్డి, జగదీశ్‌రెడ్డి తెలిపారు. కోదండరామ్ కుబుసం విడిచిన విషపునాగు అని పార్లమెంటు సభ్యులు బాల్కసుమన్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని, ఆయన చిత్తశుద్ధి, నైతికత బహిర్గతం అయిందని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే టిజెఎసి ఏర్పడింది, తెలంగాణ ఏర్పడిన తరువాత టిజెఎసి దానంతట అదే రద్దయిందని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. పేద ప్రజల అజెండానే టిఆర్‌ఎస్ అజెండాగా పాలన సాగిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, సన్న బియ్య వంటి పథకాలను ప్రధానమంత్రి కూడా ప్రశంసించారని గుర్తు చేశారు. కోదండరామ్ ఎవరి ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారో స్పష్టం చేయాలని అన్నారు.
తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా కుట్రలు జరుగుతున్నాయని చెప్పిన కోదండరామ్ ఇప్పుడు తానే విమర్శలు చేయడం సరికాదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రులు జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు కోదండరామ్ తీరును తప్పు పట్టారు. ‘కోదండరాం కుబుసం విడిచిన నాగుబాము. కాంగ్రెస్ ఏజెంట్. అందుకే సిఎం కెసిఆర్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నాడు’ అంటూ కోదండరామ్‌పై తెరాస ఎంపీలు నిప్పులు చెరిగారు. తెరాస ఎంపీలు బాల్కసుమన్, బూర నరసయ్య గౌడ్, బిబి పాటిల్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మల్లారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ కోదండరాంపై ఘాటైన విమర్శలు గుప్పించారు. ఎన్నో కుట్రలను ఎదుర్కొంటూ కెసిఆర్ రాష్ట్భ్రావృద్ధికి కృషి చేస్తున్నారని, ఈ తరుణంలో కెసిఆర్ అడుగులో అడుగులేయాల్సిన జెఏసి చైర్మన్, కాంగ్రెస్‌కు వంతపాడుతూ దాని ఏజెంట్‌లా వ్యవహరించటం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో సాధించిన విద్యుత్ ఫలితాలు కనిపించటం లేదా అని ప్రశ్నించారు. కృష్ణా, గోదావరీ నదుల్లో సముచిత వాటా సాధించి, పాత ప్రాజెక్టులను రీ-డిజైన్ చేస్తున్న ప్రణాళికలు మీకు కనిపించటం లేదా? అంటూ నిలదీశారు. గత రెండేళ్లుగా పోలవరం, విభజన చట్టం అమలుపై కేంద్రం తాత్సారం చేస్తున్నా కోదండరామ్ ఎందుకు మాట్లాడలేదని ఎంపీలు నిలదీశారు. హైకోర్టు విభజనపై ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించారు. వెయ్యి కోదండరాంలు విషం చిమ్మినా తెలంగాణ కెసిఆర్‌కు ఏమీ కాదని, మేధావి ముసుగులో ప్రభుత్వంపై దాడి చేయవద్దని వారు హెచ్చరించారు.