రాష్ట్రీయం

మా బిడ్డ బాధను చూడలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, జూన్ 23: ‘నవ మాసాలు మోసి కన్నబిడ్డకు అంతుపట్టని రోగం సోకింది. తల్లిదండ్రులుగా మాకున్న సర్వశక్తులు ఒడబోసి వైద్యచికిత్సలు చేయించాం. రెండునెలల గడువుకు నెలరోజులుగా అభంశుభం ఎరుగని 8నెలల చిన్నారి నోరు విప్పి చెప్పలేక పడుతున్న బాధను కళ్ళెదుట చూడలేకున్నాం. ఎంత వ్యయప్రయాసలు చేసినా ఫలితం ఉండబోదని వైద్యులు చెబుతున్నారు. పాలుకారే చెక్కిళ్లతో కళ్లెదుట మా బిడ్డ పడుతున్న అవస్థలు చూస్తుండలేక పోతున్నాం. మాబిడ్డ కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి’ అంటూ ఓ చిన్నారి తల్లిదండ్రులు చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లె కోర్టును ఆశ్రయించారు. చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ బత్తలాపురానికి చెందిన జెల్లా రమణప్పకు, అదే మండలం సోంపాళెం గ్రామానికి చెందిన ఆదిమూర్తి కుమార్తె సరస్వతితో 2011లో వివాహమైంది. బెంగళూరులోని సూపర్‌మార్కెట్‌లో సూపర్‌వైజరుగా రమణప్ప పని చేస్తున్నారు. సరస్వతికి 8నెలల కితం మదనపల్లెలోని డాక్టర్ తిప్పారెడ్డి ఆసుపత్రిలో తొలిసంతానంగా కుమార్తె జ్ఞానసాయి జన్మించింది. మూడుమాసాల పాటు చిన్నారి ఆరోగ్యంగా కన్పించింది. అనంతరం విపరీతమైన జ్వరం వస్తుండటంతో మదనపల్లె పట్టణం సురక్ష ఎమర్జెన్సీ ఐసియు ఆసుపత్రిలో చికిత్సలు చేయించారు. అక్కడినుంచి తిరుపతి పట్టణం ఓం ఆసుపత్రిలో నెలరోజుల పాటు చికిత్సలు చేయించారు. ఆ చిన్నారికి బిలీరియా, అట్రాసియా అనే జబ్బు ఉన్నట్లు గుర్తించారు. చిన్నారి పుట్టిన రెండు వారాలోపు ఆపరేషన్ చేయించాల్సివుండిందని, ఆలస్యం కావడంతో బెంగళూరులోని రామయ్య ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడ సుమారు రూ.7లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించారు. మూడు మాసాల అనంతరం ఆపరేషన్ విఫలం కావడంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స చేయించగా కాలేయ మార్పిడి చేయాలని, ఇందుకు సుమారు రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుందని, ఈ ఆపరేషన్ రెండుమాసాలలో చేయించుకోవాలని చెప్పడం, ఇప్పటికే నెలరోజుల గడువు పూర్తయిందని పాపను చూస్తూ ఓర్చుకోలేక పోతున్నామని చిన్నారితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. బిడ్డను బతికించుకోవడానికి చేసిన యత్నాలన్నీ అయిపోయాయని, ఆదుకోవాలని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపోయిందన్నారు. మా బిడ్డను చంపుకోవడానికి (మెర్సీ కిల్లింగ్)కు అనుమతి ఇవ్వాలని చిన్నారి జ్ఞానసాయి తల్లిదండ్రులు తంబళ్ళపల్లె జుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయమూర్తి పరిశీలించి ఇది తన పరిధిలోకి రాదని, జిల్లాకోర్టు, హైకోర్టులను ఆశ్రయించాలని పిటిషన్‌ను తిరస్కరించి పంపివేశారు. దీంతో చిన్నారిని తీసుకొని తల్లిదండ్రులు కన్నీటితో స్వగ్రామానికి వెనుదిరిగారు.

చిత్రం 8నెలల చిన్నారి జ్ఞానసాయితో తల్లిదండ్రులు సరస్వతి, రమణప్ప