రాష్ట్రీయం

ఫ్లోరింగ్ కుంగింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 23: గుంటూరు జిల్లా వెలగపూడిలోని ఏపి తాత్కాలిక సచివాలయంలో కలకలం చెలరేగింది. సచివాలయ భవనాల నిర్మాణాలు పూర్తి కావచ్చిన నేపథ్యంలో రెండవ బ్లాక్‌లో ఓ భవనం ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కుంగింది. రెండురోజుల క్రితం భారీ వర్షం కురిసింది. దీంతో సచివాలయ ప్రాంగణమంతా బురదమయమైంది. లోపలకు ప్రవేశించే వీలు కూడా లేదు. ఈ పరిస్థితుల్లో రెండవ బ్లాక్ గ్రౌండ్‌ఫ్లోర్‌లో వేసిన ఫ్లోరింగ్ తొలగించి షాపోర్జీ పల్లోంజీ సంస్థకు చెందిన కూలీలు ఇసుక, కంకరతో పూడ్చివేత పనులు నిర్వహిస్తున్నారు. ఈ ఫ్లోరింగ్ దాదాపు 100 అడుగుల మేరకు కుంగిపోయింది. రెండవ బ్లాకు ఫ్లోరింగ్‌లో సుమారు 100 అడుగుల మేర గొయ్యి ఏర్పడినట్టు తెలిసింది. అయితే మీడియాను పోలీసులు లోనికి అనుమతించలేదు. ఈనెల 29న తాత్కాలిక సచివాలయంలో విధులు నిర్వహించే విధంగా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఈ నేపథ్యంలో సచివాలయ భవనాలు కుంగిన విషయం తెలుసుకున్న ఉద్యోగ వర్గాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. వెలగపూడిలో 40.3 ఎకరాల స్థలంలో సచివాలయ భవనాలను ఐదు బ్లాకులుగా నిర్మిస్తున్నారు. అయితే నల్లరేగడి మట్టి కావడంతో పాటు సుమారు 25 అడుగులలోపే భూగర్భజలాలు ఉన్నందున స్వాభావికంగా నేలలో పటిష్టత లేదనే వాదనలు వినవస్తున్నాయి. సుమారు వంద అడుగుల లోతు తవ్వకాలు జరిపి పునాదులను నిర్మించటంతోపాటు నిపుణుల సలహాలు, సూచనలతో అన్నిరకాల భద్రతా ప్రమాణాలతో నిర్మాణాలు చేపట్టామని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. భూసారం తగ్గినందునే ఫ్లోరింగ్ కుంగిందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిషన్ నివేదికను పక్కనపెట్టి భద్రతా ప్రమాణాలను పాటించకుండా నిర్మాణాలు చేపడుతోందని విమర్శించారు. భవిష్యత్తులో ఏదైనా అనర్థాలు ఎదురైతే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.
కుంగలేదు.. కేబుల్ కోసం తవ్వారు: సీఆర్డీఏ
సచివాలయ భవనాల పటిష్టతపై సీఆర్డీఏ ప్రత్యేక అధికారి మల్లికార్జునరావును వివరణ కోరగా రెండవ బ్లాకులో వర్షాల వల్ల ఫ్లోరింగ్ కుంగలేదని, భూగర్భ విద్యుత్ కేబుళ్లను అమర్చకుండా ఫ్లోరింగ్ పూర్తిచేశారని దీన్ని సిబ్బంది గుర్తించిన నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం తవ్వకాలు జరిపి వైరింగ్ చేస్తున్నారని వివరించారు. కేబుల్ పనులు పూర్తయిన తరువాత ఫ్లోరింగ్‌ను పూర్తిచేస్తామని, కుంగినట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదన్నారు.
కాంట్రాక్టు సంస్థ తప్పిదమేనా?
సచివాలయ భవనం ఫ్లోరింగ్ కుంగిన ఘటన వెనుక కాంట్రాక్టు సంస్థ తప్పిదం ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం ఓ ఇంజనీరు ఇదే భవనంలో ఫ్లోరింగ్‌ను పరిశీలిస్తున్న సమయంలో అడుగు నుంచి వచ్చిన శబ్దం ఆధారంగా అక్కడ లోపం ఉన్నట్లు గుర్తించారని ఇసుక, నాపరాయి తగినంత నింపలేదని నిర్ధారించినట్లు చెప్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపి ఇసుక, నాపరాయి నింపాలని సూచించినట్లు తెలిసింది. దీంతో ఫ్లోరింగ్ పనులు మరోసారి నిర్వహిస్తున్నట్లు సమాచారం.
తేల్చుకుందాం రండి:
విపక్షాలకు మంత్రి నారాయణ సవాల్
భవనాలు కుంగినట్లుగా జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని పురపాలకశాఖ మంత్రి నారాయణ కొట్టిపారేశారు. వెలగపూడిలో సచివాలయ భవనాలను పరిశీలించిన అనంతరం గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని ప్రాంత ఎంపికలో అన్ని నిబంధనలు, అనుమతులు మంజూరయ్యాయని వివరించారు. మరి కొద్దిరోజుల్లో ఉద్యోగులు తరలివస్తున్నందున వారిని భయభ్రాంతులకు గురిచేసేందుకు ఈ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భూగర్భ కేబుల్ అమర్చే క్రమంలోనే తవ్వారని తెలిపారు. ఇందులో ఏదైనా తేడా ఉంటే నిపుణుల సమక్షంలో తేల్చుకుందాం రావాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి సవాల్ విసిరారు.